స్త్రీలు.. దేశ అభ్యున్నతికి కొలమానాలు

by Ravi |   ( Updated:2024-03-08 00:30:43.0  )
స్త్రీలు.. దేశ అభ్యున్నతికి కొలమానాలు
X

స్త్రీ అంటే ఆదిశక్తి, స్త్రీ అంటే ప్రకృతి. సృష్టికే ప్రతిసృష్టి చేసి సమాజానికి మార్గ నిర్దేశనం చేసే మహిళ సంసార సాగరంలో తనకు తానే సాటి. ఓర్పు, నేర్పు, ఓదార్పులకు అమ్మగా, భార్యగా, అక్కగా, చెల్లిగా ఆత్మీయతను అనురాగాన్ని పంచే అమృతమూర్తి మహిళ.

యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత

ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారు అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అనే స్ఫూర్తిని నిజం చేస్తూ అవని నుండి అంతరిక్షం వరకు రాజకీయ రంగం, కార్పొరేట్, వాణిజ్య, క్రీడా, విద్య,వైద్యం, అంతరిక్షం వంటి పలు రంగాలలో అతివల విజయాలకు హద్దులు లేవని అనిపిస్తోంది. కానీ లింగ వివక్షత, వేతన సమానత్వం ఈ విషయంలో స్త్రీలు వెనకబడే ఉన్నారని చెప్పాలి.

ఒక సంపూర్ణ మానసిక స్థైర్యం కలిగిన స్త్రీ కండలు తిరిగిన పురుషుడి కంటే శక్తివంతమైనది. ఆమెకు ఊహ తెలిసిన వయసునుండి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం, అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రేమను, ఆత్మీయతను పంచి తనవారి కోసం అహర్నిశలు కష్టించి అవమానాల్ని సహించి, కుటుంబ సభ్యుల అవసరాలు తీరుస్తూ తన ఇంటిని నందనవనంగా మార్చి మరో తరానికి దారులు సుగమం చేస్తుంది పడతి. అందుకే సమాజ నిర్మాణంలో సగ భాగమైన స్త్రీకి సమానత్వమే దేశ ప్రగతికి మూలం అనే నినాదం రావాలి. మహిళల స్థితిగతులు బాగుపడందే సమాజం అభివృద్ధి చెందదు. మానవ వనరుల సంపూర్ణ వినియోగంలో వీరి పాత్ర కీలకం. రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకొని పురుష శక్తికి తామేమీ తక్కువ కాదని నిరూపించగలరు స్త్రీలు. ఇప్పుడిప్పుడే పురుషాధిక్య ప్రపంచంలో స్వేచ్ఛను సంపాదించుకొని అనేక రంగాల్లో ఎదుగుతున్నారు. కోరుకున్న లక్ష్యాలను సాధిస్తున్నారు.

కార్యేషు దాసి- కరణేషు మంత్రి

భోజ్యేషు మాత- శయనేషు రంభ

అని ఒక కవి చెప్పినట్లు ప్రతి మగాడి జీవితంలోనూ స్త్రీ పాత్ర లేనిదే అతని జీవితానికి మనుగడ లేదని చెప్పాలి. మహిళలకు కొంత ఆర్థిక స్వావలంబన స్వయం సహాయక సంఘాలు, డ్వాక్రా గ్రూపుల ద్వారా కొంత మార్పు వచ్చిందని చెప్పాలి, కానీ ఇంకా రావాల్సింది ఉందనే చెప్పాలి. మహిళా సంఘాలు సఖీ కేంద్రాల ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నారు. అన్యాయం జరిగితే వెంటనే స్పందిస్తున్నారు. స్త్రీల రక్షణ కోసం కొత్త టెక్నాలజీ ఎన్నో వచ్చాయి. వాటి వినియోగంపై అందరికీ చైతన్యం కల్పించాలి. ముఖ్యంగా యువతకు కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలి. మహిళా రక్షణ చట్టాలు మరింత కఠినతరం చేయాలి. అలాగే స్త్రీల పట్ల సహృదయత, సమానత్వ భావం, గౌరవ భావం మొదలైన వాటిని తల్లిదండ్రులు పిల్లల్లో చిన్న వయసు నుండే కలిగించాలి. ఇది ప్రతి ఇంటి నుండి ప్రారంభం అవ్వాలి అప్పుడే ఈ సమాజంలో మార్పు సాధ్యమవుతుంది.

భారతదేశ చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధుల శాతం 12శాతానికి మించలేదు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నా స్వతంత్ర భారతదేశానికి రాజకీయ రంగంలో మహిళా ప్రాతినిధ్యం తక్కువే! దేశంలో నేటికి లింగ వివక్షత కొనసాగుతూనే ఉంది. కేవలం ఈ రోజు మాత్రమే బుద్ధిమంతులుగా మాట్లాడవద్దు. స్త్రీలను అందలమెక్కించక పోయినా పర్వాలేదు, గానీ అగ్నికి ఆహుతి ఇయ్యకండి. ప్రతినిత్యం స్త్రీల పట్ల కొంత గౌరవం కలిగి ఉంటే చాలు. అచంచలమైన ఆత్మవిశ్వాసమే హద్దుగా మహిళలు ప్రగతి పథంలో పయనిస్తూ వారి హక్కుల సాధనకు నిరంతరం కృషి చేయాలి. అవసరమైతే ఆడది ఆదిపరాశక్తిగా మారాలి.

- కొమ్మాల సంధ్య

తెలుగు ఉపన్యాసకులు

91540 68272

Advertisement

Next Story

Most Viewed