ప్రమాదం అంచున దక్షిణ భారతం

by Ravi |   ( Updated:2024-11-23 01:15:49.0  )
ప్రమాదం అంచున దక్షిణ భారతం
X

గతంలో కోవిడ్ 19 వల్ల ఆలస్యమైన జనగణన ప్రక్రియను 2025లో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ధనిక, తక్కువ జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాల కంటే పేద, ఎక్కువ జనాభా కలిగిన ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువగా ఎన్నికల ప్రాతినిధ్యం కలిగి ఉన్నాయి.

ప్రస్తుతం దేశంలో సగటున 25 లక్షల జనాభాకు ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉదాహరణకు బిహార్‌లో ఒక లోక్‌సభ సభ్యుడు సుమారు 30.1 లక్షల పౌరులకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, కేరళలో సంబంధిత నిష్పత్తి 10.75 లక్షలుగా ఉంది. ఆర్టికల్ 81 ప్రకారం, ప్రతి రాష్ట్రానికి దాని జనాభాకు అనుగుణంగా సీట్లను మంజూరు చేయాలని, ఆ సీట్లను దాదాపు ఒకే పరిమాణంలో ఉన్న నియోజకవర్గాల మధ్య పంపిణీ చేయాలని ఆదేశించింది. అసలు భారత రాజ్యాంగం ఈ నిష్పత్తిని 7.5 లక్షలకు ఒక లోక్‌సభ సభ్యుడిగా నిర్ణయించింది. జనగణన ప్రక్రియ జనాభా లెక్కలకు మాత్రమే పరిమితమవుతుందా? లేదా దేశంలోని లోక్‌సభ, రాష్ట్రా ల్లోని శాసనసభల సీట్ల సంఖ్యను కూడా పెంచబోతుందా? అనే విషయంపై రాజకీయ వర్గాల్లో భారీగా చర్చ జరుగుతోంది.

పునర్విభజన వివాదాస్పదమైన అంశం

జనాభా పెరుగుదలలో ప్రాంతీయ అసమతుల్యత సమస్యకు కేంద్రంగా ఉంది. అందుకే రాష్ట్రాల మధ్య లోక్‌సభ స్థానాల పునర్విభజన అనేది రాజకీయంగా సున్నితమైన, వివాదాస్పదమైన అంశం. దేశ జనాభాలో 20%కి దక్షిణాది రాష్ట్రాలు, 80 శాతంకి ఉత్తరాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం కలిగి ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ సంతానోత్పత్తి రేటు 2.1లను కలిగి ఉండటం వల్ల 150% వృద్ధి రేటును, దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలు 100% కంటే తక్కువ వృద్ధి రేటును నమోదు చేశాయి. మొత్తం జనాభాలో రాష్ట్ర వాటా ఆధారంగా సీట్ల పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణ కలిగి, దేశానికి భారీ జీడీపీని ఇస్తున్న రాష్ట్రాలకు జరి మానా విధించినట్లే అవుతోంది. రాజకీయ ప్రాతి నిధ్యం రూపురేఖలు సమూలంగా మారుతాయి. ఫలితంగా సీట్ల పునర్విభజన మరిన్ని అంతర్రాష్ట్ర సమస్యలకు దారితీయవచ్చు.

సంపద వాటా ఏ లెక్కన ?

దేశ జీడీపీలో 31% వాటాను దక్షిణ భారతదేశం అందిస్తుంది. దక్షిణాది జీడీపీ ₹83.57 ట్రిలియన్లు కాగా ఉత్తర భారతదేశ జీడీపీ ₹46.00 ట్రిలియన్లు. జీడీపీలో దక్షణాది రాష్ట్రాలు భారీ సంపదను సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రజల చేతుల్లో ఆదాయం కూడా వేగంగా పెరిగింది. జాతీయ సగటులో తలసరి ఆదా యంలో అద్భుతమైన వృద్ధిని సాధించాయి. అయితే, కేంద్ర ఆదాయాలను రాష్ట్రాలకు కేటాయించేందుకు 15వ ఆర్థిక సంఘం 2011 జనాభాకు 15% వెయిటేజీని డెమోగ్రాఫిక్ పనితీరుకు 12.5% ​​వెయిటేజీని కేటాయించింది. దీని మూలాన తమిళనాడుకు 18.7%, కర్ణాటక 17.7%, తెలంగాణ 14.1%, బిహార్‌కీ ప్రత్యేకించి 67.4% మధ్యప్రదేశ్ 48.1%, ఉత్తరప్రదేశ్ 42.3% కేటాయింపులను పొందుతున్నాయి. ఇక పన్నులు ఇతర పద్ధతుల్లో సేకరించిన నిధులు కేంద్రానికి వెళ్లిన తర్వాత ప్రతి రాష్ట్రం నుంచి ఒక రూపాయి వసూలు చేస్తే.. తిరిగి రాష్ట్రాలకు కేటాయించేప్పుడు 50 పైసలు కూడా ఉండటం లేదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అయితే ఈ కేటాయింపులు మరీ దారుణంగా ఉన్నాయి. ప్రతి రూపాయికి కర్ణాటకకు 15 పైసలు, తమిళనాడుకు 28 పైసలు, ఏపీకి 42 పైసలు, తెలంగాణకు 47 పైసలు, కేరళకు 62 పైసలు మాత్రమే రిటర్న్ వస్తున్నాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో రాజస్థాన్‌కు రూ.1.20, ఒడిశాకు రూ .1.25, మధ్యప్రదేశ్‌కు రూ.2.09, యూపీకి రూ.2.49 , బిహార్‌కి ఏకంగా రూ.7.26 పైసలు కేటాయిస్తుంది. జీడీపీలో దక్షిణాది వాటా 30 శాతం ఉంటే 16 శాతం జనాభా లెక్కన నిధులు ఇవ్వడం ఏమిటనే చర్చలు జరుగుతున్నాయి. జనాభా వృద్ధిరేటు దక్షిణాది రాష్ట్రాలకు మైనస్‌గా, ఉత్తరాది రాష్ట్రాలకు ప్లస్‌గా మారింది.

పార్లమెంట్‌లో దక్షిణాది పరిస్థితి?

2026 పునర్విభజన వల్ల రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటరీ ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఐదు దక్షిణ భారత రాష్ట్రాలు.. లోక్‌సభలో మొత్తం 134 స్థానాలను కలిగి ఉన్నాయి. మొత్తం 543 సీట్లలో 24.6% ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇది మూడింట రెండు వంతుల మెజారిటీకి అవసరమయ్యే రాజ్యాంగ సవరణలతో సహా శాసనపరమైన విషయాలలో ఈ సంఖ్యకు గణనీయమైన గౌరవం ఉంటుంది. 2026 డీలిమిటేషన్‌లో ఐదు దక్షిణాది రాష్ట్రాలు దాదాపుగా 26 పార్లమెంటరీ స్థానాలను కోల్పోయి, 108 సీట్లు లేదా అంతకంటే తక్కువ పొందే అవకాశం ఉందని, అనగా మొత్తం సీట్లలో దాదాపు 20% మాత్రమే ప్రాతినిధ్యం ఉండే అవకాశం ఉంటుంది. రాజ్యాంగ సవరణలను ప్రభావితం చేసే వారి సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతుంది. దక్షిణాది ఎంపీలందరూ ఒక కూటమిగా ఓటు వేసినప్పటికీ, మూడింట రెండు వంతుల మెజారిటీని నిరోధించడానికి అవసరమైన 33% కంటే ఇది చాలా తక్కువ. ఈ ధోరణులను అదుపు చేయకుండా వదిలేస్తే, జాతీయ నిర్ణయాత్మక ప్రక్రియలలో తక్కువ రాజకీయ ప్రాతినిధ్యం, వనరుల కేటాయింపుల వల్ల దక్షిణాదికి కనీస విలువ లేకుండా పోతుంది.

ఏం చేయాలి!

ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలు నూతన డిలిమిటేషన్ వలన తక్కువ లోక్‌సభ స్థానాలు పొందనున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆజ్ఞలను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చెయ్యని, ఆర్థిక అంశాలలో ఏమాత్రం నియంత్రణ చేయలేని ఉత్తరాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్ల పెంపులో లబ్ధిని పొందవచ్చనే చర్చలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. జాతీయ ఆర్థిక అభివృద్ధికి, దేశ అభివృద్ధికి కారణమైన దక్షిణాది రాష్ట్రాలు డిలిమిటేషన్ విధానం వలన భవిష్యత్తులో ప్రాధాన్యత కోల్పోయే అవకాశం ఇవ్వకూడదు. అందుకే కేంద్ర ప్రభుత్వం సమగ్ర, శాస్త్రీయ దృక్పథంతో భారతదేశం అంటేనే రాష్ట్రాల సమాఖ్య అనే స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఉండాలి. అందుకు పన్నులు, ఆర్థిక కేటాయింపులు, వలసలు, అంత ర్రాష్ట్ర అసమానత వంటి అంశాలను పరిష్కరిస్తూ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య విస్తృత చర్చలకు జాతీయ, ప్రాంతీయ పార్టీలు, ప్రజాసంఘాలతో సమాలోచనలు జరిపి మనమంతా ఒకటే.. భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా వివేకవంత మైన, ఆచరణాత్మక విధానాన్ని అవలంబించి ముందుకు సాగాలని ఆశిద్దాం.

డాక్టర్. బి. కేశవులు. ఎండి. సైకియాట్రీ

ఛైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం

85010 61659

Advertisement

Next Story

Most Viewed