- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ ముక్త్ సౌత్!
కర్ణాటకలో కమలం వాడిపోయింది. నరేంద్ర మోడీ చరిష్మాను కన్నడ ఓటర్లు కట్టడి చేశారు. దక్షిణాదిన విస్తరించాలనుకున్న బీజేపీని పార్లమెంటు ఎన్నికలకు ఏడాది ముందే కర్ణాటక రాష్ట్రం కట్టడి చేసింది. మత విద్వేషాలను రెచ్చగొట్టి గెలుపు గుర్రంపై స్వారీ చేద్దామనుకున్న బీజేపీకు కన్నడ ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో భంగపాటు తప్పదని తెలిసే, నరేంద్ర మోడీ స్థాయిని మరిచి బజరంగ్ దళ్‌పై నిషేధాన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకొని హనుమాన్ భక్తులపై నిషేధమా? అంటూ రాజకీయాలకు మతం రంగు నులిమి పెడబొబ్బలు పెట్టినా, హిందూత్వవాదులు దయచూపలేదు సరికదా, కనికరించలేదు.
హనుమాన్ జయంతికి మూడు రోజుల ముందే అభివృద్ధి, సంక్షేమం ముందు మతరాజకీయాలు చెల్లవని స్పష్టమైన తీర్పునిచ్చారు. పరుగులు పెడుతున్న ప్రపంచం ముందు మత రాజకీయాలు సరికాదని తమ ఓటు ద్వారా కన్నడ ఓటర్లు చెప్పకనే చెప్పారు. బీజేపీ గెలుపు కోసం నరేంద్ర మోడీ సర్వశక్తులు ఒడ్డినా ఫలితం మాత్రం ఆ పార్టీకి నిరాశనే మిగిల్చింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఐదు పంచ సూత్రాలు గృహజ్యోతి యోజనే, గృహలక్ష్మి యోజనే, అన్నభాగ్య, యువనిధి, ఉచిత ప్రయాణ పథకాలకు కన్నడిగులు బ్రహ్మరథం పట్టినట్లు ఓటరు తీర్పు స్పష్టపరిచింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యూహాలు ఒకవైపు, డీకే శివకుమార్ దూకుడు మరోవైపు బీజేపిని చిత్తుచేసింది. జేడిఎస్ నేత కుమారస్వామిని సైతం కన్నడ ఓటర్లు కట్టడి చేసి రాబోయే కాలంలో రాజకీయ సంక్షోభానికి చోటు ఇవ్వకుండా విలక్షణమైన తీర్పును కాంగ్రెస్‌కు కట్టబెట్టారు. 2014 నుండి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి కన్నడ తీర్పు కొండంత ఆశను కల్పించి ఊపిరిని అందించింది.
దక్షిణాది నుండే బీజేపీపై కాంగ్రెస్ దండయాత్ర ప్రారంభమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చినట్లైంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్న బీజేపీకు కర్ణాటక ఓటమి నేపథ్యంలో బీజేపీ ముక్త్ దక్షిణ భారత్ అన్న మాటలతో కాంగ్రెస్ గట్టి సమాధానం చెప్పినట్లయింది. ఈ ఎన్నికల ద్వారా దక్షిణాదిన బలపడాలనుకున్న ఆ పార్టీకి భారీ నష్టం. గుజరాత్‌లో బీజేపీ అనుసరించిన ఫార్ములా అక్కడ ఫలితాన్ని ఇవ్వగా, కర్ణాటకలో మాత్రం బెడిసికొట్టింది 75 మంది కొత్తవారికి టికెట్లు కేటాయించగా, అందులో 14 మంది మాత్రమే గెలుపొందడం మిగతావారు ఓటమి రుచి చూడడం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ. బీజేపీ టికెట్ నిరాకరించిన పదిమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జేడీఎస్ లలో చేరి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.
ముఖ్యమంత్రి బొమ్మైపై వ్యతిరేకత, 40% కమిషన్లు, లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్పకు బీజేపీ తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం, డీజిల్, పెట్రోల్ గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో మోడీ నాయకత్వం పట్ల కర్ణాటక ప్రజలకు భ్రమలు తొలగిపోయాయి. అలాగే బీజేపీ చేసిన అనేక పొరపాట్లు కాంగ్రెస్‌కు సహజంగానే కలిసి వచ్చాయి. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర కూడా కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది. యాత్ర సాగిన 20 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 15 స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. ఈ ఎన్నికల ద్వారా దక్షిణాదిన కాంగ్రెస్ మళ్లీ ఖాతా తెరిచినట్లుంది. ఈ ఫలితాల ప్రభావం డిసెంబర్‌లో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. ఆరు నెలల క్రితం జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో సైతం బీజేపీకు భంగపాటు తప్పలేదు. వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి పెనుసవాలుగా మారనున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీకు వ్యతిరేక పవనాలు వీస్తున్న ఈ సమయంలో డిసెంబర్లో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి తగు మోతాదు విజయాలు సాధించడం అంత ఈజీ కాదన్నది కమలనాథులను కలవరపెడుతున్న మాట!
సట్ల మురళీకృష్ణ
సీనియర్ జర్నలిస్టు
9441174565