ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

by Ravi |   ( Updated:2024-03-24 01:00:50.0  )
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
X

గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల హామీ ఇచ్చి కూడా, ఏ ఒక్కటి పరిష్కరించకుండా అణచివేత, ఒత్తిడి పెంచింది. అంతేకాదు ఉద్యోగులను ప్రజల నుండి వేరుచేసి ప్రజల్లో ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నామని దుర్మార్గంగా దుష్ప్రచారానికి తెర లేపింది. ఆ వేళ ప్రతిపక్షంగా ఉన్న నేటి పాలకులు ఉద్యోగుల అన్ని సమస్యలు మేము అధికారం చేపట్టిన వెంటనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టగానే ప్రభుత్వ ఉద్యోగులందరికీ, పెన్షనర్లు అందరికీ నాలుగేళ్ల తర్వాత ఫిబ్రవరి నెల వేతనాలను ఒకటో తారీకు చెల్లించడం అభినందనీయం. అయినప్పటికీ ఇంకా ఉద్యోగుల చాలా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సతమతమవుతున్నారు.

జనవరితో కలిపితే నాలుగు(4)కరువు భత్యం (డి ఏ)లు పెండింగులో ఉన్నాయి. వాటి కోసం ఏడాదికి పైగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ట్రెజరీల్లో ఆమోదం పొంది రెండేళ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న జిపిఎఫ్, టిఎస్జిఎల్ఐ, పిఆర్సీ బకాయిలు, మెడికల్ రీయింబర్స్మెంట్, పెన్షన్ తదితర బిల్లులన్నీ వెంటనే విడుదల చేయాల్సి ఉంది. పెండింగ్లో ఉన్న మూడు డీఏ లతో పాటు ఇకపై డీఏ సకాలంలో ప్రకటించి నేరుగా చెల్లిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మాట నిలుపుకోలేకపోతున్నారు. మరోవైపు ఉద్యోగుల సమస్యలు అసలు సమస్యలే కావనట్టుగా, ఇది ప్రభుత్వాలకు ప్రజలకు చెందిన సమస్య కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఉద్యోగుల సేవలను తక్కువ చేసి చూపించడం, సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల ఊసెత్తకుండా వాటి పరిష్కారం పట్ల నేటికీ ఉలుకు పలుకు లేదు. నిత్యావసర ధరలు పెరిగిన దరిమిలా యథాలాపంగా రావలసిన డీఏలు నాలుగు ఇవ్వకుండా ప్రభుత్వం ఇంకా కాలాయాపన చేయడం సబబు కాదు.

ఉద్యోగులంటేనే చులకన భావం

గత కొన్నాళ్లుగా పాలకుల నిర్లక్ష్యంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటేనే! జీతాలు సకాలంలో రావని సమాజంలో చులకన భావం ఏర్పడి రుణాలు పొందలేని దీన పరిస్థితి, వారి పిల్లలకు సంబంధాలు కుదరటం లేదు, సొంతంగా ఒక ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. పరపతి పోయి, పరువు పోయి ఇటు కుటుంబంలో అటు సమాజంలో ఉద్యోగులను తక్కువ చేసి చూడటానికి ముమ్మాటికి ఈ ప్రభుత్వాల దుష్ప్రచార విధానాలే కారణం. నిష్టూరం అయినా యదార్థాన్ని పరిశీలించండి.. సేవ చేస్తామనే పేరుతో వచ్చిన ప్రజాప్రతినిధులకు అయ్యే ఖర్చు ఎంతో. వారి జీత భత్యాలు, అలవెన్స్ లు, పెన్షన్లు ఇష్టానుసారంగా పెంచుకుంటున్నారు ప్రజా ప్రతినిధులు. ఇది నిజం కాదా! ఉద్యోగుల సేవలు, ప్రజా ప్రతినిధుల సేవలు ఒక ప్రత్యేక సంస్థతో అంచనా వేయిస్తామా! ఎవరిది సేవ.. ఎవరిది త్యాగం.. ధనం ఎవరికి పోతుంది.. ప్రజల్లో బదనాం చేసేది ఎవరిని ఇది ధర్మమా..

జీతాలు, డీఏలకు బడ్జెట్ లేదా?

ఉద్యోగులకు హక్కుగా రావలసిన జీతాలు, డిఏ లు, పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చేసరికి బడ్జెట్ లేదనడం ఎంతవరకు సమంజసం. ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించడం మంచి పద్ధతి కాదు. వాస్తవాలు గుర్తించి ఉద్యోగుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఉద్యోగ( కొన్ని) సంఘాలు పాలకుల భజనలు చేస్తూ పదవి కోసమో, పైరవీ కోసమో బానిసలైన్లు. ఎన్నో ఏండ్లుగా పోరాడి సాధించుకున్న హక్కులు పాలకుల వద్ద తాకట్టు పెట్టిన (భజన సంఘాల) తీరుతో ఒక్కొక్కటిగా హక్కులను కోల్పోతున్నారు. చివరకు ఉద్యోగులు జీవిత కాలం పొదుపు చేసుకున్న డబ్బులు నిత్యవసరాలకో, కష్టకాలంలోనో, ఆడపిల్ల పెళ్లికో అక్కరకొస్తాయన్న ఆశతో పెట్టుకున్న బిల్లులు కూడా మంజూరు చేయ పెండింగ్ పెడుతూ గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది. నేడు కూడా విడుదల కావడం లేదు.

ప్రభుత్వం వెంటనే డిఏ ల విడుదల కోసం ప్రకటన జారీ చేయాలి. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. సిపిఎస్ రద్దు చేస్తామన్న మాట నిలబెట్టుకోవాలి. ఉద్యోగ సంఘాలు మొద్దు నిద్ర వీడి ప్రభుత్వాలను నిలదీయాలి. ఇవి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు మాత్రమే కావు, ప్రభుత్వాల, ప్రజల సమస్యల పరిష్కారానికి గుండెకాయ లాంటి ఉద్యోగుల పాలన వ్యవస్థకు సమస్యలు వస్తే ఆ సమాజం కూడా సమస్యల్లో ఉండిపోతుందని గ్రహించాలి. ప్రభుత్వ విధానాల అమలులో, పాలనలో వేగము, పారదర్శకత అందించి ప్రభుత్వాలకు పేరు ప్రతిష్టలు తెచ్చే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగుల వృత్తి నిబద్ధత- పాలకుల చిత్తశుద్ధి, పారదర్శకత- పాలితుల ప్రశ్నించే స్వేచ్ఛను బాధ్యతతో కూడిన హక్కుగా భావించాలి

- మేకిరి దామోదర్,

సామాజిక విశ్లేషకులు

95736 66650

Advertisement

Next Story