- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కులగణనతోనే సామాజిక న్యాయం!
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా సమగ్ర కులగణనను నిర్వహించే ప్రతిపాదనను తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రంలో బలహీన వర్గాల బలోపేతం కోసం సమగ్ర కుటుంబ సర్వేతో పాటు కుల గణనను చేపట్టనున్నట్టుగా సీఎం ప్రకటించడం, అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించడం చారిత్రాత్మక నిర్ణయంగా భావించాలి.
త్వరలో చేపట్టబోయే ఈ సర్వేతో రాష్ట్రంలో కులాల వారీగా జనాభా లెక్కలు అందుబాటులోకి రానున్నాయి. ఆయా వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తత్ఫలితంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలలోనూ వాటా దక్కే అవకాశం ఏర్పడుతుంది.
ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనే..
కుల వ్యవస్థ బలీయంగా ఉన్న మన దేశంలో సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు చేరాలంటే కులగణనే ఏకైక మార్గమని, దీంతోనే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. దేశంలో ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలను చేపట్టడం చూస్తూ వస్తున్నాం. కానీ జనాభా లెక్కలు దేశానికి ఎంత ముఖ్యమో ఆయా రాష్ట్రాలలోనూ కుల గణన కూడా అంతే ముఖ్యమనే విషయం ప్రస్తుతం కనిపిస్తోంది. అందుకే నేడు దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా కుల గణన అనే అంశం తెర మీదకు వస్తోంది. నేడు కుల గణనను చేసేందుకు దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖతను చూపిస్తున్నాయంటే దీంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనే భావించాలి. కులగణనతో రాష్ట్రంలోని ప్రజల ఆర్థిక, సామాజిక సూచికలకు సంబంధించిన సమగ్ర డేటా వస్తోంది.
మరింత స్పష్టత దిశగా...
కుల గణనతో విద్య, ఉద్యోగ రంగాలలో అమలు చేస్తున్న రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు కూడా శాస్త్రీయంగా వెలుగులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరులకు అమలవుతున్న రిజర్వేషన్లు, వారున్న జనాభా వంటి విషయాలు స్పష్టంగా తేలే అవకాశం ఉంటుంది. అగ్రకుల రిజర్వేషన్ ఎస్టీల కంటే ఎక్కువగా ఉందనీ, ఏ కులాల జనాభా ఎంతో తేల్చాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా మొదలై అనేక విమర్శలను ఎదుర్కొంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. వాస్తవంగా ఇప్పటివరకు దేశంలో కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే కులం ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలుతున్న విషయం తెలిసిందే. ఓబీసీల విషయానికొస్తే క్రీమిలేయర్ కారణంగా కులం తో పాటు, ఆర్థిక స్థితిని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన దేశంలో బీసీలకు జాతీయ స్థాయిలో ఎలాంటి రిజర్వేషన్లు లేవు. 1979-1980లో నియమించిన మండల్ కమిషన్ దేశ వ్యాప్తంగా ఉన్న 3,743 కులాలను బీసీ కులాలు(52 శాతం)గా గుర్తించింది. ఆ నివేదిక ఆధారంగానే కేంద్ర స్థాయిలో 27 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
కుటుంబ సర్వే లెక్కలు ఏవి?
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మూడున్నర కోట్ల జనాభా ఉంది. ఈ జనాభాలో ఎస్సీ(17.50%), ఎస్టీ(9.91%), బీసీ(51.08%), ఓసీ(21.50%), మైనారిటీ(14.46%) చొప్పున ఉన్నారంటూ కొన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ గణాంకాలలో హెచ్చుతగ్గుల కూడా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి లేకుండా నికరమైన లెక్కలు కులాల వారీగా తేలాలి అంటే కులగణనతోనే సాధ్యం. 2014లోనూ రాష్ట్రం వచ్చిన తొలినాళ్లల్లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు నేటికి బయటకు రాని పరిస్థితి. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి పనులను చేపట్టాలన్నా, అందరికీ సామాజిక న్యాయం దక్కేలా చూడాలన్నా ఆయా వర్గాల వారీగా లెక్కలు తేలాల్సి ఉంది. దేశంలో ఒకవేళ జనాభా లెక్కలు చేపడితే ఈసారి కులగణన ప్రస్తావన కూడా తెర మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో ఎన్నో కులాలున్నాయి. ఈ కులాలు ఎన్నో రకాల వృత్తులలో నిమగ్నమై జీవిస్తున్నారు. ఇలాంటి వృత్తి పరమైన కులాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలంటే జనాభాలో ఆయా కులాల, జాతుల శాతం ఎంతో తేలాలి. గత ఏడాది బిహార్లో కుల జన గణనలో ఆసక్తికరమైన ఆలోచింపచేసే అంశాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ 13 కోట్లు ఉన్న జనాభాలో వెనుకబడిన కులాలు(బీసీ) 27.12శాతం, అత్యంత వెనుక బడిన వర్గాలు (ఎంబీసీ) 36.01శాతం, ఎస్సీ-19.65శాతం, ఎస్టీ-1.68శాతం, ఓసీ 15.52 శాతం చొప్పున ఉన్నారనేది స్పష్టమైంది. అంటే బిహారులో బీసీలలోని అత్యంత వెనుకబడిన వర్గాల సంఖ్యనే ఎక్కువగా ఉందనే విషయం తేలింది.
కులగణన విజయవంతం కావాలి!
మన రాష్ట్రంలోనూ కులాల సంఖ్య వందల్లో ఉంటుంది. కొన్ని కులాలు మాత్రమే మనకు ఏదో ఒక రూపంలో కనిపిస్తున్నాయి. వాస్తవానికి చాలా కులాలు, తెగలు నేటికి విద్యకు, సమాజానికి దూరంగానే ఉన్న పరిస్థితి. చట్టసభల్లోనే కాదు కనీసం గ్రామాలలో వార్డు సభ్యుడిగా కూడా స్థానం లేని కులాలు, జాతులు అనేకం ఉన్నాయి. ఎస్సీలలో కులాలు, ఎస్టీలలోని తెగలు, బీసీలలో ఎంబీసీలు, ఈ విధంగా ఉన్న కులాలు, జాతులు, తెగల లెక్కలే కాదు వారి వృత్తులు, ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితి గతులు తేలాలి అంటే అది ఒక కులగణనతోనే సాధ్యం. రాష్ట్రంలో అసలైన వెనుకబాటుతనాన్ని గుర్తించాలంటే కులాలకు సంబంధించిన గణాంకాలు, సమాచారం ఉండాలి. రిజర్వేషన్ల అమలుతో పాటు సంక్షేమ పథకాల అమల్లోనూ కులానిదే కీలక పాత్ర. ఇది కేవలం కులగణనతోనే సాధ్యం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా కుల గణనను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోతుంది. ఇది విజయవంతంగా సాగాలని కోరుకుందాం.
-డా.ఎన్.యాదగిరిరావు,
అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ
97044 05335