కర్ణాటకానికి తెర... సీఎం 'సిద్ధం'!

by Ravi |   ( Updated:2023-05-17 23:45:39.0  )
కర్ణాటకానికి తెర... సీఎం సిద్ధం!
X

కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఎంపిక ఎప్పుడూ ప్రహసనమే. తాజాగా కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి పునరావృతమవుతోంది. ఎప్పటిలానే రేసులో ఇద్దరు కంటే ఎక్కువ ఉండడంతో ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మూడు రోజులుగా సాగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి. రేసులో నిలిచిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చే విషయంలో కీలకంగా నిలిచినా, మరోసారి సిద్ధరామయ్యకే సీఎం పదవి కట్టబెట్టేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైంది. తన అభ్యర్థిత్వాన్ని నిర్ణయించేసినట్లు సమాచారం. సీఎం రేసులో ఉన్న పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు..కీలక శాఖల బాధ్యతలను అప్పగిస్తూ సోనియా, రాహుల్ గాంధీ నిర్ణయించారు. అయితే సీఎం పదవి కోసం సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ తీవ్రంగా ప్రయత్నించినా, సిద్ధరామయ్యకు ఉన్న అనుభవం, సీనియార్టీని పరిగణనలోకి తీసుకుని.. డీకే శివకుమార్‌ను బుజ్జగించినట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా ఉన్నా.. సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపింది. రాబోయే జనరల్ ఎలక్షన్స్ వరకు కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గానే కొనసాగాలని.. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత సీఎం పదవి ఇస్తామంటూ కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం.

కేసుల బూచితో తటపటాయింపు..

శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడవచ్చని కాంగ్రెస్ అధిష్టానం యోచన. వాస్తవానికి కాంగ్రెస్ గెలుపులో శివకుమార్ పాత్ర ఎక్కువ అయినా సరే కేసులను బూచిగా చూపిస్తూ ఆయన్ను నిలువరించి, సిద్ధరామయ్యకు సీఎం పీఠం కట్టబెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైపోయింది. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు కాంగ్రెస్ సాధించడానికి శివకుమార్ చేసిన కష్టం, గతంలోని 78 సీట్లను 135కు చేర్చడానికి, రాహుల్ పాదయాత్ర మొత్తం దక్షిణ భారతదేశంలో సాగడానికి శివకుమార్ శ్రమ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆయన్ను సీఎం పీఠానికి దూరం చేసేందుకు అవకాశాలూ అన్నే ఉన్నాయి. శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడవచ్చని తెలుస్తోంది. నిన్నటి వరకూ కర్ణాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్‌ను ఎకాఎకిన సీబీఐ చీఫ్‌గా నియమించిన కేంద్రం ఇప్పుడు శివకుమార్ విషయంలో దూకుడు ప్రదర్శించి కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలన్నది బీజేపీ వ్యూహం.

పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత, పార్టీకి అండగా ఉండటం సోనియా గాంధీకి నమ్మకస్తుడనే పేరున్న శివకుమార్... పార్టీలో ట్రబుల్ షూటర్ గా బాధ్యతాయుతంగా ఉంటానని, ఎవరినీ విడగొట్టాలని అనుకోనని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు నేను కట్టుబడి ఉంటానని వెన్నుపోటు పొడవనని, బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు అసలు చేయనని స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌కు 20 సీట్లు తీసుకురావడమే తమ ముందున్న సవాల్ అని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు శివకుమార్ సేవలని పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకోవాలన్న ఆలోచనలో అధిష్టానం వుంది. ఉపముఖ్యమంత్రిగా చేసి బుజ్జగించే వ్యూహాన్ని అమలు చేశారు.

సిద్ధరామయ్యకు కలిసివచ్చే అంశాలు..

ఆయనది వ్యవసాయ కుటుంబం. 1948 ఆగస్టు 12న మైసూరు జిల్లాలోని సిద్ధరామనహుండిలో సిద్ధరామయ్య జన్మించారు. పదేళ్ళ వయసు వచ్చే వరకు ఆయన బడికి పోలేదని చెబుతారు. పొలం పనుల్లో తల్లిదంద్రులకు సాయం చేసేవారు. ఆ తరువాత డిగ్రీ పూర్తి చేసి, మైసూర్ యూనివర్సిటీ నుంచి లా పట్టా తీసుకున్నారు. 75 ఏళ్ల సిద్ధరామయ్యకు రాజకీయాల్లో 45ఏళ్ల అనుభవం ఉంది. 2013 నుంచి 2018 వరకు కర్ణాటక సీఎంగా పని చేసిన అనుభవం ఆయన సొంతం. ఐదేళ్ల పూర్తి కాలం పదవిలో ఉన్న ముగ్గురు నేతల్లో సిద్ధరామయ్య ఒకరు. ఎన్నికల ముందు నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యే కావాలని ప్రజలు కోరుకున్నట్లు తేలింది. 2013 నుంచి 2018 వరకు కర్ణాటక సీఎంగా పనిచేశారు అవినీతి రహిత పాలన. మాస్ లీడర్ గానూ సిద్దరామయ్యకు పేరుంది. ఓబీసీ వర్గాల్లో సిద్ధరామయ్యకు మంచి ఇమేజ్ ఉంది. 135 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 90 మంది ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకే ఉన్నట్లు అధిష్టానం నిర్వహించిన రహస్య ఓటింగ్‌లో స్పష్టమైనట్లు తెలిసింది. కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో మూడో అతిపెద్ద సామాజిక వర్గం (మైనారిటీలు,బీసీలు, దళితులు)ని ఏకం చేసి కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా మార్చిన ఘనత సిద్ధరామయ్య సొంతం. ప్రజాభీష్టం ప్రకారం చూస్తే సిద్ధరామయ్యదే పైచేయి. అధిక శాతం ప్రజలు సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్న నేపథ్యంలో.. సిద్ధరామయ్యను ముఖ్య మంత్రినిచేస్తే ప్రజా నాయకుడికే పదవి అప్పగించామని కాంగ్రెస్ చెప్పుకోవచ్చు , ప్రజాదరణ, రాజకీయ పరిణితి, అనుభవంతో ప్రస్తుత పరిస్థితులను చక్కబెట్టి అన్ని వర్గాల వారిని సమన్వయపరిచి పార్టీని ముందుకు నడిపించగల సామర్థ్యం ఉంది. కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర వహించిన, బీజేపీ హయాంలో 40% కమీషన్ ఆరోపణ ప్రజల్లోకి బాగా చొచ్చుకొని పోయింది. అవినీతి రహిత పాలనను కర్ణాటక ప్రజలు కోరుకుంటున్న తరుణంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా తగిన వ్యక్తి అని చెప్పవచ్చు.

వాడవల్లి శ్రీధర్

99898 55445

Advertisement

Next Story