బోధనా స్వేచ్ఛకు సంకెళ్లు!

by Ravi |   ( Updated:2023-08-10 04:43:11.0  )
బోధనా స్వేచ్ఛకు సంకెళ్లు!
X

ఆంధ్రప్రదేశ్‌లో 70 ఏళ్ల చరిత్రలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ఉపాధ్యాయులపై ఎమర్జెన్సీ ప్రకటిస్తుంది ప్రభుత్వం. ఉపాధ్యాయులపై అసంబద్ధ తనిఖీలు, అవిశ్రాంత పనిభారం, అనాలోచిత ఆదేశాలు, అకారణ శిక్షలు, అసంకల్పిత ప్రతీకారంతో కూడిన చర్యలు అసంఖ్యాకంగా మన ముందుకు వచ్చాయి. అసలు ఇంత దుస్సాహసానికి ఒడిగడుతున్న ఆయన సాధించాలనుకున్న ఫలితాలేమిటి? సమాజానికి ఇవ్వదలచుకున్న సందేశమేంటి? తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఉపాధ్యాయులను ఏ కోణంలో చూపించదలచుకున్నారు?

కులీన సంస్కృతిని నరనరాన ఒంటబట్టించుకుని ఉద్యోగ వర్గాన్ని బానిసలుగా చూసే వ్యవస్థగా మార్చే కుట్రలో భాగమిది.

ప్రభుత్వోద్యోగి పని గంటలెన్ని?

ప్రభుత్వపు కనుసన్నల్లో నడుస్తూ బండెడు చాకిరీని ఉపాధ్యాయులపై మోపి చైతన్యాన్ని పంచే వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ దుందుడుకుగా ముందుకుసాగుతున్న సదరు అధికారి ఆయాచిత వేగానికి ముగుదాడు వేయాల్సిన బాధ్యత, అవసరం కూడా ఉపాధ్యాయులదే! నాగరిక సమాజానికి సైతం విస్మయం కలిగించే అధికారం చాటున ఉక్రోషంతో మాటువేసి తన చర్యలతో వ్యవస్థలను కూలగొడుతున్నారు. ఉపాధ్యాయ వర్గాన్ని టార్గెట్ చేసి మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. జీవితాలను వృత్తికి అంకితం చేసిన బోధనా రంగంలో మానవ యంత్రాలకు ఇదొక అపత్కాలం. అధికారిక ఆదేశాలకు తలవంచడమా, నియంతృత్వ పోకడలకు సమాధి కట్టడమా, నిజాయితీ వెలుగులో నిరుపమాన సేవలను సమాజం ముందుంచడమా, డెబ్భై ఏళ్లకు ముందు మొగ్గలు తొడిగిన బానిసత్వానికి ఎదురొడ్డి పోరాడడమా, జీవచ్ఛవాలుగా జీవితాలను గడపడమా కింకర్తవ్యమేంటి ఈ సంధికాలపు సవాళ్లను అధిగమించడానికి సాధికారతను నిలబెట్టుకోవడానికి తెగించాల్సిన వేకువ ఝాము ఇది.

ఒక ప్రభుత్వోద్యోగి ఎన్ని గంటలు పని చేయాలి? ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఉపాధ్యాయుడు పని చేస్తున్న సమయమెంత? ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయుల పనిభారమెంత? ఉన్నత పాఠశాలలో గరిష్టంగా వారంలో 39 వరకు పీరియడ్ల టైం టేబుల్ బిగించిన అధికారులు ఆ 39 పీరియడ్లకు డైరీ రాయడానికి, పాఠ్యప్రణాళికలు సిద్ధం చేయడానికి ఎంత సమయం పడుతుందో కనీస పరిశీలన చేసివుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కనిష్ఠానికి 20 మాఫీవున్న తరగతిలో నోటు పుస్తకాలు అక్షరానికి అక్షరం సరిచేసి రాయడానికి, వాటిని మళ్లీ చూడడానికి పట్టే సమయమెంత? నిర్వహించిన పరీక్షల మూల్యాంకనం కోసం యుద్ధప్రాతిపదికన షెడ్యూల్ ప్రకటించడంలో ఔచిత్యమేంటి?

అణచివేతతో ఏం సాధిస్తారు?

ఈ దృగ్గోచర వాస్తవాన్ని ఏ ఒక్కరూ, ఏ సందర్భంలోనూ ప్రశ్నించలేదు, అప్రయత్నంగా అయినా ఆ ప్రయత్నం చేయలేదు. కారణం చట్టపరిధిని దాటి కర్ర పెత్తనం చేస్తున్న అధికారులంటే భయం. ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు ఆంధ్రప్రదేశ్ తన సొంత పర్యాటక క్షేత్రంగా మార్చుకొని పుష్పక విమానంలో ఢిల్లీ నుంచి గల్లీకి విస్తృత పర్యటనలు చేస్తూ బెంబేలెత్తిస్తున్నారు. ఆయన ఉపాధ్యాయులు ఎంత సమయం పనిచేయాలో అధికారికంగా ప్రకటించాలి. ఒక మనిషిగా ఉపాధ్యాయుడు సమర్ధవంతంగా ఏ పని ఎంత సమయమైతే పూర్తి స్థాయిలో చేయగలరో సెలవివ్వాలి. నైతికంగా వారు వ్యవహరిస్తున్న తీరు సమంజసమా, సమర్ధనీయమా బహిరంగ చర్చకు రావాలి. రోజులో ఒక ఉపాధ్యాయులు తమకు కేటాయించిన ఆరున్నర పని గంటలే కాకుండా అదనంగా మరో పది గంటల రెక్కలు ముక్కలు చేసుకుంటే గానీ అధికారులు చెప్పినట్లు నడుచుకోలేరు. ఆచరణాత్మక సైకాలజీ ప్రకారం కాకుండా అణిచివేత చర్యలతో సాధించేదేమీ ఉండదని గ్రహించాలి.

తరగతి గదిలో ఉపాధ్యాయులకు స్వేచ్ఛ లేకపోతే నిర్బంధ బోధనా నిబంధనలతో నిర్ణీత సామర్ధ్యాలను సాధించలేరు. నిబంధనలతో విద్యార్థులను అభ్యసనానికి దూరం చేసి శాశ్వతంగా డ్రాపౌట్లను చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని మట్టుబెట్టే చర్యలు వాంఛనీయం కావు. ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల్లోని కొందరు దద్దమ్మలపై వశీకరణ మంత్రం ప్రయోగించి వారు ఉపాధ్యాయుల పక్షాన నోరు తెరవకుండా చేయగలిగింది. మరికొందరు రాజకీయ ప్రయోజనాల కోసం చేతులు ముడుచుకొని చూస్తున్నారు. విషయ పరిజ్ఞానం లేని మరికొందరు సన్నాసులు ప్రభుత్వ పక్షాన వకాలత్ పుచ్చుకున్నారు. ఈ మొత్తం పరిస్థితి ప్రభుత్వానికి కలిసొచ్చింది. కొన్ని సంఘాల అచేతనను అర్థం చేసుకున్న ఉపాధ్యాయ లోకం పోరాటాలకు దూరంగా ఉంటుంది.

టీచర్ల వ్యక్తిత్వాన్ని దిగజార్చితే...

పాఠశాలలో ప్రవేశించింది మొదలు ఇంటి గంట కొట్టేదాకా ఏడు గంటల సమయంలో ఆరు గంటల వ్యవధిలో పదికి పైగా రోజువారీ యాపుల నిర్వహణ, బోధన, మూల్యాంకనం, నోటు పుస్తకాలు, వర్కు బుక్కుల తనిఖీ, పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల అప్ లోడ్, తల్లిదండ్రుల సమావేశాలు, శిక్షణా తరగతులు హాజరు, ఎంఈఓ కార్యాలయాలకు సమాచారం చేర్చడం, బడి బయట పిల్లలను రప్పించడం ఇలా ఉపాధ్యాయులు కూలీలుగా, అసంఘటిత కార్మికులుగా మార్చి వేయబడ్డారు. వారి హక్కులు భూస్థాపితమయ్యాయి. వారు సాధించుకున్న ప్రయోజనాలు ఒక్కొక్కటే మాయమయ్యాయి. నెలాఖరు జీతానికే మోహమాచిపోతున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పాఠశాలలు మౌలిక వసతులతో ముస్తాబవుతున్నా అడ్మిషన్లు లేక వెలవెలబోతున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనంతో ఎంతో సమగ్రంగా ముద్రించి పంపిణీ చేసిన సారాంశాన్ని విద్యార్థులకు అందించడంలో ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు.

పరీక్షల నిర్వహణలో పెచ్చరిల్లిన వింత దూకుడు అసలు వాస్తవ మూలాలను దెబ్బకొడుతున్నాయి. బడుగుల బడులకు గెడులు పెట్టే చర్యలవి. అందువల్ల పల్లె చదువులు కనీస బోధన సామర్ధ్యాలకు దూరమై కొడిగడుతున్నాయి. రానున్న కొద్ది కాలంలోనే ప్రభుత్వ విద్యారంగం కునుకు తీసే చర్యలకు అధికారులు ఊతమిస్తున్నారు. పర్యటన సందర్భంగా ఉపాధ్యాయులపై శివాలెత్తుతూ, వారి వ్యక్తిత్వాన్ని దిగజార్చే వీడియోలను యూ ట్యూబ్ ఛానెళ్లకు అందిస్తూ వ్యవస్థ పతనానికి వంతెన వేయడం ఒక ఉన్నతాధికారిగా చేయవలసిన పనికాదు. అది పరోక్షంగా గ్రామాల్లో లిటిగెంట్లను పాఠశాలల పైకి ఉసిగొల్పడానికి దోహదపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మానవాభివృద్ది సూచికలలో జ్యేష్ఠ భాగంలో ఉన్న వివిధ దేశాల్లో పాఠశాలల నిర్వహణ, బోధన సమయం, వేతనాలు ఇత్యాది సమగ్ర విషయాలను గమనించండి. కట్టలు తెంచుకుంటున్న ఆవేదనను, ఆవేశాలను, ఆందోళనను, అభద్రతాభావానికి చరమగీతం పాడే రోజు కోసం అందరూ ఒక్కటవ్వాల్సిన అవసరాన్ని గుర్తించాలి. పోరాటానికి పిలుపులు అవసరం లేదు.

- మోహన్ దాస్,

రాష్ట్ర కౌన్సిలర్, ఏపిటిఎఫ్ 1938

9490809909

Advertisement

Next Story

Most Viewed