సేవామూర్తులు మన నర్సులు

by Ravi |   ( Updated:2022-09-03 17:04:16.0  )
సేవామూర్తులు మన నర్సులు
X

తెలుపు రంగు దుస్తులు ధరించి ఆప్యాయతతో మాట్లాడుతూ, రోగులను కంటికి రెప్పలా చూసుకునేవారే నర్సులు. నిరంతరం రోగుల మధ్య ఉంటూ రోగాలతో పోరాడుతూ ఎటువంటి సంకోచం లేకుండా తల్లిలా, సోదరిలా సేవలు అందించి వారు త్వరగా కోలుకునేలా విధులను నిర్వర్తిస్తుంటారు. కరోనా సమయంలో వారు చేసిన సేవలు వెలకట్టలేనివి. వారి నిస్వార్థ సేవలను గౌరవించి కృతజ్ఞతలు తెలియజేయడం మన కనీస ధర్మం. రోగులకు మానసిక ధైర్యాన్ని పెంపొందించి రోగాలు నయం చేయడంలో అహర్నిశలు శ్రమించే నర్సుల సేవలు అజరామరం. ఈ నర్సింగ్ వ్యవస్థకు మూల కారణం 'ఫ్లోరెన్స్ నైటింగేల్' 1820 లో మే12న ఇటలీలోని ఓ బ్రిటిష్ కుటుంబంలో జన్మించారు. ఆమె గణాంకవేత్త అయినప్పటికీ, సామాజిక దృక్పథం ఉన్న సామాజికవేత్త.

ఆమెకు గుర్తుగా

1853 లండన్‌లోని మహిళల ఆసుపత్రిలో సూపరిండెంట్‌గా చేరారు నైటింగేల్, 1854లో టర్కీ క్రిమియా యుద్ధంలో గాయపడిన సైనికులకు సేవలు చేసే నర్సుల బృందానికి నాయకురాలిగా వెళ్లారు. రాత్రిపూట చిన్న లాంతర్ సహాయంతో సేవలందించి అనేక మంది ప్రాణాలను కాపాడారు. అందుకే ఆమెను 'లేడీ ఆఫ్ ది ల్యాంప్' అంటారు. ఆమె నిస్వార్థ సేవలతో విక్టోరియన్ సంస్కృతిలో నర్సులకు ప్రత్యేక హోదా ఇచ్చారు. నైటింగేల్ 1859లో 'నోట్స్ ఆన్ నర్సింగ్' పుస్తకాన్ని ప్రచురించారు. 1860లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 'నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్' పేరుతో నర్సింగ్ శిక్షణ కేంద్రాన్ని స్థాపించారు. అందుకే ఈమెను 'ది రైవల్రి ఆఫ్ మోడరన్ నర్సింగ్ 'అని పిలుస్తారు.

నర్సుల వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకువచ్చిన నైటింగేల్ సేవలను గుర్తించిన 'ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్' సంస్థ 1965 నుంచి ఆమె పుట్టిన రోజు మే 12 ను 'అంతర్జాతీయ నర్సుల దినోత్సవం'గా ప్రకటించింది. మన దేశంలో కూడా విశిష్ట సేవలందించిన నర్సులకు 1973 నుంచి 'నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆవార్డు'లను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తున్నారు. నైటింగేల్ 13 ఆగస్టు, 1910న లండన్‌లో పరమపదించారు.

(నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం)

నరేందర్ రాచమల్ల

9989267462

Advertisement

Next Story

Most Viewed