పెన్షన్ విద్రోహ దినం!

by Ravi |   ( Updated:2024-09-01 00:30:16.0  )
పెన్షన్ విద్రోహ దినం!
X

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు పదవీ విరమణ అనంతరం ప్రతినెలా చెల్లించే జీవన భృతి(పెన్షన్)తో జీవిత చరమాంకంలో ప్రశాంతంగా జీవనం కొనసాగించే వారు. ఎన్నో దశాబ్దాలు పోరాడి సాధించుకున్న పాత పెన్షన్ విధానాన్ని పార్లమెంట్ అనుమతి లేకుండా ఒకే ఒక కార్యనిర్వాహక ఆర్డర్ ద్వారా రద్దు చేస్తూ కార్పొరేట్ వర్గాల పెట్టుబడుల కోసం ఇటు ఉద్యోగ, ఉపాధ్యాయుల కష్టార్జితాన్ని, అటు ప్రభుత్వ సొమ్మును ఎన్‌పీఎస్ ద్వారా షేర్ మార్కెట్‌లో తాకట్టుపెట్టిన రోజు సెప్టెంబర్ 01. అందుకే ఈ రోజుని ఉద్యోగ, ఉపాధ్యాయులు పెన్షన్ విద్రోహ దినంగా రాష్ట్ర రాజధానిలోను, జిల్లా కేంద్రాల్లోను జరపనున్నారు.

సీపీఎస్ పెన్షన్ విధానం..

ఎన్డీఏ ప్రభుత్వం పెన్షన్ విధానంలో మార్పులు చేయడానికి బి.కె. భట్టాచార్య నేతృత్వంలో హైపవర్ కమిటిని ఏర్పాటు చేసింది. వారి ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం 2003 ఆగస్టు 23న ఆమోదించి 2004 జనవరి 1 నుండి అమల్లోకి తెచ్చింది. అయితే, కొత్తగా ఏర్పడిన తెలంగాణలో పాత పెన్షన్ విధానం కొనసాగించేందుకు అవకాశం ఉన్నప్పటికీ గత ప్రభుత్వం కనీసం ఏ ఉద్యోగ, ఉపాధ్యా య సంఘాల నేతలను సంప్రదించకుండానే సీపీఎస్ విధానానికే మొగ్గు చూపారు. ఈ కొత్త పెన్షన్ అమలు చేసే సమయంలో ద్వారా ఉద్యోగులకు పదవి విరమణ అనంతరం కొన్ని కోట్ల రూపాయలు వస్తాయని ప్రచారం చేశారు. కానీ ఈ మధ్యనే పదవి విరమణ చేసిన వారి పెన్షన్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకిచ్చే పెన్షన్ మేలనిపిస్తుంది.

యూపీఏస్ వల్ల ఉద్యోగులకు నష్టం!

సీపీఎస్ పెన్షన్ విధానంపై అటు కేంద్ర ప్రభు త్వ ఉద్యోగులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులు ఉద్యమం ఉధృతం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ మధ్యనే యూపీఎస్‌ని తెచ్చింది. ఇది మేడిపండు మాదిరిగా ఉండి, ఉద్యోగులకు నష్టం చేకూర్చుతుంది. ఓపీఎస్‌కి షేర్ మార్కెట్‌తో సంబంధం లేదు. ఎన్‌పీఎస్ వలె యూపీఎస్‌లో కూడా ఉద్యోగి, ప్రభుత్వం వాటాల సొమ్మును ప్రభుత్వమే షేర్ మార్కెట్‌లో పెట్టి బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనాల కోసం కాంట్రిబ్యూషన్ విధానం కొనసాగించనుంది. పెన్షన్ లెక్కింపులో చివరి బేసిక్ పే‌లో 50% కాకుండా 12 నెలల సగటు వేతనం పరిగణలోకి తీసుకోవడం వల్ల ఆ మేరకు ఉద్యోగులు పెన్షన్‌లో నష్టపోతారు. యూపీఎ‌స్‌లో పీఆర్సీని పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుంది. 25 సంవత్సరాలు పూర్తి చేస్తేనే పూర్తి పెన్షన్ వర్తించడం ఈ విధానంలో ప్రధాన సమస్య. ఈ షరతు వల్ల పెన్షన్ నుంచి కొన్ని వర్గాలను దూరం చేయడమే అవుతుంది. హెల్త్ కార్డులపై, అదనపు పెన్షన్‌పై స్పష్టత లేకపోవడం, ఉద్యోగి కాంట్రిబ్యూషన్ తిరిగి తీసుకోవడంపై స్పష్టత లేకపోవడం వల్ల ఉద్యోగులకు నష్టం జరగవచ్చు. ఉద్యోగి నుంచి కాంట్రిబ్యూషన్ 10 శాతం కొనసాగించడం ఈ విధానంలో ప్రధాన లోపంగా చెప్పవచ్చు. ఎన్‌పీఎస్, యూపీఎస్ పేరు ఏదైనా కానీ కేంద్రం ఇటు ఉద్యోగి డబ్బు, అటు ప్రభుత్వ డబ్బు షేర్ మార్కెట్లో పెట్టడం వల్ల కార్పొరేట్ శక్తులకు షేర్ మార్కెట్లో పెట్టుబడి కాసులు కురిపిస్తుంది.

హామీని నెరవేర్చాలి..

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సీపీఎస్‌నీ రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌నీ రద్దు చేసి వెంటనే ఓపీఎస్‌నీ అమల్లోకి తేవాలని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా కోరుతున్నాయి.

(నేడు పెన్షన్ విద్రోహ దినం)

జుర్రు నారాయణ యాదవ్,

తెలంగాణ టీచర్స్ యూనియన్,

94940 19270

Advertisement

Next Story

Most Viewed