రామక్కో రామక్కా

by Ravi |   ( Updated:2023-10-19 00:30:23.0  )
రామక్కో రామక్కా
X

తెలంగాణ బిడ్డలే రామక్క!

దిక్కులేక ఆగమాయే రామక్కా!

అమరవీరుల ఆత్మ గోస రామక్క

నీ చెవులకు వినిపిస్తలేదా రామక్క

తరాజు బాట్ల జోకుడే రామక్క

అభివృద్ధి అటకెక్కే రామక్క

సారూ మాత్రం గద్దెనెక్కే రామక్క

నిరుద్యోగులకు తెడ్డు చూపే రామక్కా

!తెలంగాణ బిడ్డలే!

ఉద్యోగాలు మనకొద్దా రామక్క

చేపలు, బర్లు, గొర్లు ముద్దా రామక్క

2000 పింఛన్ ఇచ్చి రామక్క

పెద్ద కొడుకు అని అంటివి రామక్క

అసలు కొడుకుల గతి ఏంది రామక్కా

నీకు కొంచెమన్నా లేకపోయే రామక్కా

!తెలంగాణ బిడ్డలే!

రైతు బంధుకు మురిసిపోతే రామక్క

తరుగు పేరుతో నిలువు దోపిడీ రామక్కా

నోటిఫికేషన్లు ఆగిపోయే రామక్క

ఆడబిడ్డలు ఆగమాయే రామక్క

నిరుద్యోగ భృతి ఏదే రామక్కా

ముందు అడిగినంక పాట పాడు రామక్క

!తెలంగాణ బిడ్డలే!

ఉచిత ఎరువులు ఏడ పాయే రామక్క

ఉపాధి లేక ఆగమాయే రామక్క

రేషన్ కార్డులు దిక్కే లేవు రామక్కా

బెల్టు షాపులు కొదువ లేదు రామక్క

వైన్స్ షాపులేమో పెరిగిపాయె రామక్కా

తెలంగాణ ఆగమాయే రామక్కా

!తెలంగాణ బిడ్డలే!

దళిత బంధు ఏడ బాయే రామక్కా

దళిత సీఎం జాడ లేదు రామక్కా

బి. సి బంధుతో ఆగం చేసే రామక్క

మూడెకరాల భూమిని రామక్క

ముగ్గురికన్నా పంచిండా రామక్క

డబుల్ బెడ్ రూమ్ ఏడపాయె రామక్క

గృహలక్ష్మి అనే కొత్త నాటకం రామక్క

!తెలంగాణ బిడ్డలే!

కోటి ఎకరాల కాళేశ్వరం రామక్క

ఎవరికో కోట్లు తెచ్చి పెట్టే రామక్కా

మిషన్ భగీరథ పథకం రామక్కా

కమీషన్ల పాలయ్యే రామక్క

బాహుబలి మోటార్లనే రామక్క

నీట మునిగి నిండా ముంచే రామక్క

సన్న వడ్లు వెయ్యమని రామక్కా

సన్నాసుల మనల జేసే రామక్కా

!తెలంగాణ బిడ్డలే!

ఇంటికో ఉద్యోగమనే రామక్కా

ఊరికి ఒక్కనికన్నా ఇచ్చిండా రామక్క

కుల సంఘ భవనం అంటూ రామక్క

కులాల ఓట్లకు గాలమేసే రామక్క

ఉద్యోగ ఉపాధి లేక రామక్క

ఉన్నది అమ్మే కాలమచ్చే రామక్క

గులాబీ జెండా నీడ కింద రామక్క

మాకు గుండె కోతలే మిగిలే రామక్క

నీకు కొంచెమన్నా లేకపోయే రామక్క

మమ్మల్ని ఆగం జేయ్యాపట్టే రామక్కా

ధరణి మొత్తం దందాలే రామక్క

రైతులు అంత ఆగమాయే రామక్క

!తెలంగాణ బిడ్డలే!

దండం పెట్టి చెప్తున్నా రామక్క

భావి తరాల గొంతు కోయకు రామక్క

నమ్మి మళ్ళా ఓటు వెయ్యకు రామక్క

మమ్మల్ని ఆగం ఆగం జేయ్యకు రామక్క....

నరెడ్ల గౌతమ్ రెడ్డి

96666 82668

Advertisement

Next Story