వస్తున్నవి ఎన్నికలు.. ఇక పండగే పండగ

by Ravi |
వస్తున్నవి ఎన్నికలు.. ఇక పండగే పండగ
X

ఎలచ్చన్ల పండగొస్తుంది

జేబు నిండా డబ్బు

గొంతుల్దాక మందు

కడుపు నిండా తిండి

పండగే పండగ..

ప్రజాస్వామ్యం

తమ నేతను తానే ఎన్నుకొనే

సువర్ణావకాశం

తన ఓటుతో తన తలరాతను

మార్చుకునే గొప్ప అవకాశం

ఓట్ల పండుగ..

నోట్ల పండుగ

నోటు తో ఓటు కొనే పండుగ.

నోటుకు ఓటును అమ్మే పండుగ

ప్రజలను ప్రలోభ పెట్టే పండుగ

ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల పండుగ..

జే జే లు..జై జై లు..

ముర్దాబాద్ లు జిందాబాదులు

రంగు రంగుల జెండాల రెపరెపలు

మైకుల్లో పాటలు వరాల జల్లుల

ఊకదంపుడు ఉపన్యాసాలు ఊరంతా ఊరేగింపులు

రయ్యు రయ్యున

పరిగెత్తే వాహనాల కాన్వాయులు

నాయకులు వినాయకులు

కండువాలు, సెల్ఫీలు,

పూల జల్లులు

ఫ్లయింగ్ కిస్సులు

సందడే సందడి

ఎలచ్చన్ల సందడి..

పండగంటే పండుగ

పైసా ఖర్చు కాని పండుగ

దండాలు, వేడుకోళ్లు

వంగి వంగి సలాములు

వరాల జల్లులు

హామీలు హగ్గింగులు

జిమ్మిక్కులు.. ప్రమాణాలు

ఆప్యాయతలు

అద్భుత నటనలు..

ప్రేమలు కురిపించే

వరసలు

కాళ్ళు పడుతరు

చేతులు వత్తుతరు

పిల్లాడి ముడ్డి గడుగతరు.

ఇస్త్రీ చేస్తరు..

మోరి సాబ్ చేస్తరు.

అబ్బో ఒక్కటా

ఉచిత వినోదం ..

పండగే పండుగ..

మంది ఎక్కువైతే

మజ్జిగ పలుచన.. ఎవడాడు చెప్పింది..

ఎలచ్చణల పండుగ వస్తే

ఎంత మంది ఉంటే అంత మంచిది..

ఎన్ని జెండాలు ఉంటే అన్ని డబ్బులు..

వందలు.. వేలు.. ఛీ ఛీ..

వారం రోజుల్లో లచ్చల సంపాదన ..

ఇచ్చినోడికి ఇచ్చినంత

డబ్బుల పందేరం

తెలివి ఉన్నోడికి లాక్కున్నంత..

మీటింగులు, ఈటింగులు

లైటింగులు, వాహనాలు

టెంటు హౌసులు,

అమర్చే వారికి పండగే పండుగ

వైన్ షాపులు బెల్ట్ షాపులు

బార్లు రెస్టారెంట్లు

అన్నిట్లో సందడే సందడి..

బొడ్రాయి పండుగ మించి

బోసిపోయిన గ్రామాలన్నీ

జనమయం..

ఊగుతూ తూగుతూ

ఊరంతా పండగే

రాని సంక్రాంతి కోసం..

ఈ ఓట్ల పండుగ

రోజూ ఉంటే పోలే ఏం చక్కా

రోజూ పోలేరమ్మ జాతర జేసుకోవచ్చు..

మధ్యంతర ఎలచ్చన్లు వస్తే

మజాయే మజా...

ఓటు బాలెట్టు బాక్సుల పడ్డ దాకా

పండగే పండుగ

మళ్ళీ అయిదెండ్ల దాకా గుర్తుండే పండుగ..

తల రాత మారుతుందో..

మరి ఎక్కిరిస్తుందో...

మళ్ళీ ఎలెచ్చన్ల పండుగ కోసం.

ఎదిరి చూపులో..

-శిరందాస్ శ్రీనివాస్

హైదరాబాద్

9441673339

Advertisement

Next Story

Most Viewed