- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామీణ పాఠశాలలే విద్యకు పునాది!
విద్య మహోజ్వలమైన జీవన స్రవంతి, సామాజిక విప్లవ జ్యోతి, మానవాభ్యుదయ విజయమార్గం, నీతి, నిజాయితీ, వ్యక్తిత్వాలకు పెట్టని కోట. విద్యను విస్మరించిన ప్రభుత్వాలు కూలకతప్పవు. విద్యలో బోధన ముఖ్యమైనది. అందుకే బోధకుడు శక్తివంతమైన జ్ఞానతృష్ణ కలిగివుండి నిరంతర అధ్యయన శీలుడై వుండాలి. అధ్యయనం అనేది ఉపాధ్యాయునికి ఒక జీవశక్తి, అధ్యయనం లేని ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దటంలో విఫలం కాక తప్పదు. ఈనాడు ఉపరితలమైన బిల్డింగులు, బెంచీలు, బాత్రూంలు దృశ్యమానంగా ఉన్నా, పాఠశాలలో లైబ్రరీలు, అధ్యయన కేంద్రాలు, ల్యాబ్స్, బోధన సామర్థ్యం కలిగిన ఉపాధ్యాయులు కరువైపోయారు. అందుకే పదవ తరగతిలో కూడా ఒక పేరా రాయలేని పరిస్థితుల్లో పిల్లలున్నారు. పిల్లలు కొత్త కళను పెంపొందించుకోగలగాలి. ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించగలగాలి, బహు భాషలు నేర్వగలిగిన సామర్థ్యం కలిగి వుండాలి. డా. బీఆర్ అంబేద్కర్ ఒక కుగ్రామంలో పుట్టి కొలంబియాలో చదవగలిగాడు. కారల్ మార్క్స్ జర్మనీలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఇనిఫిన్ స్టోన్ మీద ది క్యాపిటల్ అనే మహా గ్రంథం రాయగలిగాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో గీతాంజలి రాసి నోబెల్ పొందగలిగాడు. బెట్రాండ్ రస్సెల్ లండన్లో పుట్టి ప్రపంచ దేశాలన్నింటా బోధన చేసి వంద పుస్తకాలు రాయగలిగాడు వంద సంవత్సరాలు కూడా బతకగలిగారు. డార్విన్ జీవశాస్త్ర పరిణామం గురించి రాసి ప్రపంచాన్ని మార్చే సూత్రాలు నిర్మించాడు. శరీరానికి కసరత్తు ఎలా అవసరమో మెదడుకు నిరంతర శ్రమ అవసరం. ప్రతి మనిషి మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదవాలి. బోధకునికి అయితే మనోవిజ్ఞాన శాస్త్రం అవసరం. సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ సిద్ధాంతం ద్వారా తన విద్యుత్వ నిర్మాణాన్ని బోధించాడు. ఈ శాస్త్రాలన్ని ఈనాడు అధ్యయనం చేయాలంటే విద్యార్థులకు తాత్విక శక్తి అవసరం.
పేరుకేనా తెలుగు జాతి..
మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమున్న విద్యను తెలుగు రాష్ట్రాలు విస్మరిస్తున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లీష్ విద్య పేరుతో 86 వేల స్కూళ్లను రద్దు చేశారు. దీనివల్ల ఎంతోమంది పిల్లలు చదువుకు దూరం అయ్యారు. ఒక గ్రామం నుంచి చిన్న పిల్లలు 2, 3 కిలో మీటర్లు నడిచి వెళ్ళి చదవగలరా? పోనీ అలా రద్దు చేస్తే వారికి మీరేమైనా ప్రత్యేక బస్సులు వేశారా? ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా ఇలా గ్రామాల్లోని స్కూళ్లను రద్దుచేయడంలోని అంతర్యం ఏమిటి? గ్రామంలో స్కూల్ ఉంటే ఆ గ్రామానికి విలువ. పిల్లలు మంచి డ్రెస్సులో వెళ్లడం, మంచి పుస్తకాలు చదవడం, ప్లే గ్రౌండ్లో ఆటలు ఆడటం వంటి విద్యా వాతావరణం గ్రామాల్లో ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ఎత్తివేసిన పాఠశాలల్లో పేకాటలు, అసాంఘిక కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రైవేట్ సూళ్లకు విద్యార్థులను తీసుకెళ్ళడానికి బస్సులున్నాయి. లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నా ప్రభుత్వాలు విద్యార్థులకు బస్సులు ఏర్పాటు చేయలేరా? ప్రజాప్రతినిధుల పిల్లలు విదేశాల్లో, కార్పొరేట్లలో చదువుతున్నారు. కానీ బడుగు వర్గాల విద్యార్థులకు వచ్చేసరికి అన్ని స్కూళ్లకు ఉపాధ్యాయుల్ని ఇవ్వలేము అంటున్నారు. పేరుకు తెలుగు జాతి ముద్దు బిడ్డలం అంటారు కానీ ఎన్నో స్కూళ్ళలో తెలుగు పండిట్లు లేరు.
ప్రధానమంత్రికి గానీ, ముఖ్యమంత్రులకు గానీ చేతిలో పుస్తకం ఉండదు. వీరు పుస్తకాలు చదివినట్టు కూడా ఎక్కడ రుజువులు లేవు. వీరు లైబ్రరీలు సందర్శించరు. కొత్త లైబ్రరీలు కట్టరు, ఎక్కడ సైన్స్ ల్యాబ్‌లూ కట్టలేదు, యూనివర్సిటీల్లోనే సైన్స్ ల్యాబ్‌లు లేవు, వీరు ద్విభాషలను క్షుణ్ణంగా మాట్లాడలేరు. ప్రధానమైన పదవుల్లో ఉండి కూడా అనేక సందర్భాల్లో వీరు అపశబ్దాలు వాడుతున్నారు. సుమారు రెండు రాష్ట్రాలలో పది లక్షల మందికి పైగా ప్రాథమిక విద్య నేర్చుకుంటున్నారు. ఉపాధ్యాయులకు లక్షల జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు. వారికి 220 రోజులు మాత్రమే పని కల్పిస్తున్నారు. 20 రోజులకు పైగా వారికి సొంత సెలవులు ఇస్తున్నారు. మీరు ఇచ్చిన జీతంపై వారిచే విద్యా కార్యక్రమాలు ఎందుకు చేయించలేకపోతున్నారు? అంతంత జీతాలు ఇవ్వలేకపోయినపుడు కన్సాలిడేట్ పేమెంట్‌తోనైనా ఇబ్బడిముబ్బడిగా ఉన్న బీఈడీ, ఎంఈడీ చదివిన వారికి అధ్యాపక వృత్తిని ఎందుకు కల్పించరు? విద్యా వ్యాపారులను ప్రోత్సహిస్తున్నారు. కార్పొరేట్ విద్యావ్యవస్థలకు, రెడ్ కార్పెట్ వేస్తున్నారు. కార్పొరేట్ వ్యవస్థ విస్తృతమై విద్యను కొని అమ్మే వ్యాపారంగా నడుపుతున్నారు.
వారిలో భయాలు పోయేదెలా?
దేశంలో విద్యాదానం పెరగడం లేదు. ఎన్నో కొత్తగా నిర్మించుకునే ప్రభుత్వాలు కొన్ని వందల బడుల భవనాలు కూలిపోయే స్థితిలో ఉన్నా వాటి మరమ్మత్తులకు నిధులు విడుదల చేయడం లేదు. అవి బడులు తెరిస్తే విద్యార్థుల మీద పడే అవకాశం ఉంది. దేశంలో విద్యా వ్యవస్థ సన్నగిల్లడానికి కారణం విద్యకు సంబంధించిన ఎన్విరాన్మెంట్ రూపొందించకపోవడమే. విద్యకు పునాది పరిసరాలు, ఇళ్ళల్లో తాగుబోతు తండ్రులు చేసే పనుల వల్ల పిల్లల మనసు గాయపడుతుంది. విద్యమీద ఏకగ్రాహ్యతను కలిగి ఉండలేరు. విద్యార్థికి శారీరక శక్తి, మానసిక శక్తి, పర్యావరణ స్వచ్ఛత చాలా అవసరం. ప్రభుత్వాలు మధ్యాహ్న భోజనం నాణ్యతతో సరఫరా చేయడం లేదు. దీంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని నిరాకరిస్తున్నారు. ప్రభుత్వాలు ప్రకటనలకు పెట్టే ఖర్చుతో ఇంకా మెరుగైన సేవలు ఎన్నో అందించవచ్చు. ప్రభుత్వాల్లో ప్రచారార్భాటం బాగా పెరిగింది. ప్రచారార్భటం వల్ల పాలకుల వ్యక్తిత్వం వికసించదు. రాజ్యం విద్యను పోషించకపోతే విద్యతో పాటు రాజు కూడా అప్రతిష్టపాలు అవుతారు. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా వారి ప్రధాన కర్తవ్యం ప్రాథమిక విద్యను వ్యాప్తి చేయడమే.
చిన్న పిల్లలప్పుడు మెదడులో అక్షరాల ధారణ బలంగా ఉంటుంది. అప్పుడు. మెదడుకు శక్తి చాలా అవసరం అవుతుంది. అందుకే పాఠశాలల్లో పాలు, వెన్న, జున్ను, జీడిపప్పు, బాదం వంటి బలవర్ధకమైన ఆహారంతో మెదడు శక్తిని చిన్నప్పటి నుంచీ పెంచాలి. విద్యను వ్యాప్తి చేయడం ద్వారా దేశాన్ని నాగరికం చేస్తూ సుసంపన్నం చెయ్యొచ్చు, విద్య ద్వారా జ్ఞానం, అవగాహన, సామాజిక స్పృహ, సాంస్కృతిక వికాసం, వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతాయి. గ్రామీణ పాఠశాలలు మరుగయ్యేకొలది గ్రామం ఆరాచక పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతుంది. గ్రామాలలో పాఠశాలలు లేకపోతే నిరక్షరాస్యత, నిద్రాణత, అవిద్య, దారిద్ర్యం అలుముకుంటాయి. గ్రామం మందమతులతో నిండిపోతుంది. ప్రజలు అజ్ఞాన సముద్రంలో మునిగిపోతారు. పిల్లల్లో కలిగిన భయాలు విద్య ద్వారా పోగొట్టాలి. బూచాడి భయం, దెయ్యం భయం, చీకటి భయం, నిప్పు భయం, బల్లి భయం ఇలాంటి భయాలన్నీ విద్య ద్వారానే పోతాయి. విద్య లేని ఊళ్లు మూఢనమ్మకాల ఊబిలో కూరుకుపోతాయి. అందుకే గ్రామాల్లో ఉన్న పాఠశాలలు రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం.
పునరుజ్జీవనానికి సోపానమిదే!
విద్యలో ఇంగ్లీషు భాషాధ్యయనం కోసం మాతృభాషల్ని నిర్లక్ష్యం చేయకూడదు. మాతృభాషలో వంద పద్యాలైనా రానివారు. వాక్య నిర్మాణం చేయలేదు. దుఃఖాన్ని వ్యక్తీకరించలేరు. ఆనందాన్ని పొందలేరు. అర్ధ మానవులుగా జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే సమాజాన్ని హిందూ భావజాలంతో ఒకవైపు, పాశ్చాత్య చింతనతో మరోవైపు నింపుతున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. గ్రామాల్లో విద్యాలయాలు ఎత్తి వేయడం అమానుషం. గ్రామాల్లో మద్యం ఇబ్బడిముబ్బడిగా దొరుకుతుంది కానీ మంచి నీళ్ళు దొరకడం కనాకష్టమౌతోంది. దేశంలో విద్య పెరగాలంటారు కానీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఎందుకు చేయరు? అవిద్య వలన వయోజన విద్యాభ్యాసం పూర్తిగా కుంటుపడింది. దానివల్ల తల్లిదండ్రులకు పిల్లల మీద విద్యాపరమైన అజమాయిషీ లేకుండా పోయింది. గ్రామాల్లోని పాఠశాలలు రద్దుచేయడం విస్మరించాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉపాధ్యాయ రిక్రూట్మెంట్‌ను విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా పూర్తి చేయాలి. పాఠశాలలు విలీనం చేసిన దగ్గర ప్రత్యేకమైన ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి. ప్రతి గృహంలో చదువుకునే విద్యార్థికి వసతి కల్పించాలి. ఒకవేళ ప్రభుత్వం గ్రామ విద్యను రద్దు చేస్తే రాష్ట్రాలను చీకట్లోకి నెట్టినట్టే ఔతుంది. తప్పు చేయడం కాదు తప్పును తెలుసుకోవడం, సరిదిద్దుకోవడమే ప్రజాస్వామిక లక్షణం. రాజ్యాంగమే గ్రామీణ పునరుజ్జీవనానికి సోపానం.
డా. కత్తి పద్మారావు
సామాజిక తత్వవేత్త
98497 41695