నడుస్తున్న చరిత్ర:ఆర్థిక దుస్థితి మెరుగుపడేదెలా?

by Ravi |   ( Updated:2022-09-03 16:30:15.0  )
నడుస్తున్న చరిత్ర:ఆర్థిక దుస్థితి మెరుగుపడేదెలా?
X

ఢిల్లీ ఆందోళనలో చనిపోయిన రైతు కుటుంబాలకు కేసీఆర్ అందించిన ఆర్థిక సాయం ముక్కున వేలేసుకొనేలా ఉంది. ఇక్కడ కౌలు రైతులు చనిపోతుంటే పట్టించుకోక, అక్కడికెళ్లి 600 కుటుంబాలకు రూ.మూడు లక్షల చొప్పున ఈయడం రుచించని విషయమే. యాదాద్రి గుడి ఖర్చు అంచనా రూ.1,200 కోట్లు. గోపురానికి స్వచ్ఛ బంగారు పూత కోసం ఆర్బీఐ నుండి 125 కిలోల బంగారాన్ని కొనేందుకు రూ.65 కోట్లు కేటాయించారు. కొత్త సెక్రెటేరియేట్ భవనానికి రూ. నాలుగైదు వందల కోట్లు అంటున్నా అది రూ.వేయి కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడున్న భవనాలు ఇంకా యాభై ఏళ్లు పనికొస్తాయని పరిశీలకులు చెప్పినా తన అభీష్టం నెరవేర్చుకొనేందుకే కేసీఆర్ ముందడుగేశారు. ఒక రకంగా దీనిని రాష్ట్రం తనకు తాను తెచ్చుకొన్న ఆర్థిక అత్యయిక పరిస్థితి అనుకోవచ్చు.

మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ఎక్కడో ఓ చోట ప్రస్తావన రాని రోజు లేదనుకోవచ్చు. 2022 ఆరంభం నుంచి ఈ కటకట మరీ ఎక్కువైంది. ప్రభుత్వాన్ని విమర్శించేలా విపక్ష నేతలకు ఇదో ఆయుధమైంది. సమయానికి జీతాలు, బిల్లులు చెల్లించలేని పరిస్థితి దాచితే దాగేది కాదు. మాటలతో మభ్యపెట్టలేని విషయమిది. ఖజానా ఎలా ఖాళీ అయినా బాధ్యత పాలకులే వహించవలసి వస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే 2014లో రాష్ట్రం ఏర్పడ్డాక చాలా కాలం చాలా సందర్భాలలో సీఎం కేసీఆర్ మనది ధనిక రాష్ట్రమని అన్నమాటలు గుర్తొస్తాయి. విభజన వేళ రూ.6 వేల కోట్ల మిగులు బడ్జెట్ కల రాష్ట్రం ఎనిమిదేండ్లలో లక్షల కోట్ల అప్పుల కుప్పగా ఎలా మారిందని ప్రశ్న ఇప్పుడు ప్రభుత్వం ఎదుర్కొంటోంది. తెచ్చిన అప్పు అంతా రాష్ట్ర అభివృద్ధికే ఖర్చు చేశామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా ప్రజల జీవితాలలో గణనీయ మార్పేమీ కానరావడం లేదు.

బంగారు తెలంగాణ అన్న మాట టీఆర్ఎస్ నేతలకు, కొన్ని అగ్రకుల కుటుంబాలకు తప్ప సామాన్యులకు వర్తించేలా లేదని విపక్షాలు అంటున్నాయి. టీఆర్ఎస్ పాలనను ముప్పు తిప్పలు పెట్టాలని కంకణం కట్టుకొన్న కేంద్రం, రాష్ట్రం ఆయువు పట్టుపై దెబ్బకొట్టే పనిలో ఉంది. ఇక పార్టీల సంగతి చూస్తే టీఆర్ఎస్, బీజేపీ మధ్య పెద్ద తేడా లేకున్నా టీఆర్ఎస్ ఇంటి పార్టీ, తెలంగాణ సాధన కోసం దశాబ్దంన్నర కాలం నిర్విరామంగా పోరాడిన చరిత్ర దానికుంది. ఈ విచక్షణ తెలంగాణ ప్రజలకు అవసరం. దానికి తోడుగా దిగజారుతున్న ప్రతిష్టను, ఆర్థిక స్థితిని ఎలా కాపాడుకోవాలో టీఆర్ఎస్ ఆలోచించవలసిన అవసరముంది. ప్రజల విశ్వాసాన్ని కాపాడుకొనేందుకు పునరాలోచించుకోవలసిన సమయమిదే. బుకాయించకుండా తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా ఒప్పుకొని ముందుకు సాగాలి.

రాష్ట్ర బడ్జెట్ సంగతి ఇదీ

ఒక్కసారి గత కొన్నేళ్లుగా తెలంగాణ బడ్జెట్‌ను పరిశీలిద్దాం. 2016-17లో రూ.1,30,416 కోట్లలో రూ. 61,607 కోట్లు జీతాలు, పింఛన్లు, వడ్డీలకు సరిపోగా నీటి పారుదలకు రూ.9,000 కోట్ల నుంచి రూ.24,132 కోట్లకు పెంపు జరిగింది. 2017-18లో బడ్జెట్ రూ.1,49,646 కోట్లు. పాత అప్పులు తీర్చడానికి రూ.4,659 కోట్లు, ఉన్న అప్పులకు వడ్డీలు రూ.11,139 కోట్లు, మొత్తం రూ.16 వేల కోట్లు. బడ్జెట్‌లో అది 10.5 శాతానికి పాకింది. 2018-19లో రూ.1,54,453 కోట్లు. రూ.25,000 కోట్లు నీటిపారుదల, రూ.12,000 కోట్లు రైతుబంధు, రూ.6,000 గొర్రెల పంపిణీకి కేటాయించారు. వీటితోపాటు జీతాలు, పింఛన్లు, పాత అప్పుల చెల్లింపు. వడ్డీలు షరా మాములే. మోయలేని భారం ఇక్కడే కనబడుతోంది. 2019-20 లో రూ.1,74,454 కోట్లు. అందులోంచి రూ.23,841 కోట్లు అప్పుల చెల్లింపు, వడ్డీలకు 16 శాతం వెళ్లింది.

మద్యం అమ్మకాలతో వచ్చే సొమ్ముకు అది సరిసమానం. గమనించవలసింది ఏమిటంటే తెలంగాణ సర్కారు 2019 నుండి వ్యవసాయం, దాని అనుబంధాలకు, సంక్షేమ పథకాలకు మిగతా రాష్ట్రాల కన్నా రెండింతలు ఖర్చు చేస్తోంది. దేశంలోని చాలావరకు రాష్ట్రాలలో వ్యవసాయానికి బడ్జెట్‌లో 6.5 శాతం ఉంటే, తెలంగాణాలో 17 శాతం ఉంది. అంతటా సంక్షేమ పథకాలకు సగటున 3 శాతం ఉంటే ఇక్కడి 14.4 శాతం ఉంటోంది. తెలంగాణ బడ్జెట్‌లో 22 శాతం జీతాలకు, 9 శాతం పింఛన్లు , 12 శాతం వడ్డీలకు యేటా పక్కన పెట్టాలిసిందే. వీటికి అదనంగా 2022-23 బడ్జెట్ రూ.2,56,958 కోట్లలో రూ.17,700 కోట్లు దళితబంధుకు, రూ.14,800 కోట్లు రైతుబంధుకు వెళ్లాయి. చివరకు రాష్ట్రం సాధించిన ప్రగతి ఏమోగానీ రూ.3,29,988 కోట్ల అప్పు జనం నెత్తిన పడింది.

ఈ దుస్థితికి జవాబు చెబుతారా?

దేశమంతా మన వైపు చూస్తోందని టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఎవరెవరో వచ్చి ప్రభుత్వ పథకాలను, పనులను కీర్తించి వెళుతున్నారని, విదేశీ సంస్థలు అవార్డులు ప్రకటిస్తున్నాయని అంటున్నారు. అయితే, ఈ భారీ పథకాలతో ముందు ముందు రాష్ట్రానికి ఆర్థికంగా కోలుకోని స్థితి వస్తుందని ఎవరూ చెప్పక పోవడం విడ్డూరం. అప్పుడు తెగ మెచ్చుకున్నవారు ఈ దుస్థితికి ఇప్పుడు సమాధానం చెప్పాలి.ప్రభుత్వ నిర్ణయాలను విశ్లేషిస్తే తొలివరుసలో 2016 మార్చిలో పెంచుకున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాలు కూడా లెక్కలోకొస్తాయి. వారి నెల జీతాలు 163 శాతం పెరిగాయి.

ప్రధాని మోడీ నెల జీతం రూ.1.60 లక్షలు మాత్రమే. అందులో చాలావరకు దాతృత్వసేవలకే వెళ్తుందంటారు. మన ముఖ్యమంత్రి నెల జీతం రూ.4.21 లక్షలు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వేతనం రూ.83 వేల నుంచి రూ.2.5 లక్షలకు పెరిగింది. కర్ణాటకలో ఎమ్మెల్యే నెల జీతం రూ.65 వేలు మాత్రమే. జాతి నిర్మాణంలో క్రియాత్మక పాత్ర పోషించేందుకు, లంచాలకు దూరంగా ఉండేందుకు ఈ పెంపు తప్పదని సీఎం సమర్థించుకున్నారు. ప్రజాసేవ అంటే జీతం కోసం పోటీ పరీక్ష రాసి సంపాదించుకొన్న ఉద్యోగం కాదు. కోట్ల కొద్దీ ధనాన్ని ఖర్చు చేసి చట్టసభలకు వస్తున్నవారు నెల జీతాలపై ఆధారపడి బతికే రకం కాదు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నెలకు ఒక రూపాయి జీతంగా తీసుకొనేవారట. అదే బాటలో మే 2019 నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వెళుతున్నారు. మన చట్ట సభసభ్యులు ఈ విషయం ఆలోచించాలి.

దుబారా ఖర్చులెందుకు?

ఢిల్లీ ఆందోళనలో చనిపోయిన రైతు కుటుంబాలకు కేసీఆర్ అందించిన ఆర్థిక సాయం ముక్కున వేలేసుకొనేలా ఉంది. ఇక్కడ కౌలు రైతులు చనిపోతుంటే పట్టించుకోక, అక్కడికెళ్లి 600 కుటుంబాలకు రూ.మూడు లక్షల చొప్పున ఈయడం రుచించని విషయమే. యాదాద్రి గుడి ఖర్చు అంచనా రూ.1,200 కోట్లు. గోపురానికి స్వచ్ఛ బంగారు పూత కోసం ఆర్బీఐ నుండి 125 కిలోల బంగారాన్ని కొనేందుకు రూ.65 కోట్లు కేటాయించారు. కొత్త సెక్రెటేరియేట్ భవనానికి రూ. నాలుగైదు వందల కోట్లు అంటున్నా అది రూ.వేయి కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడున్న భవనాలు ఇంకా యాభై ఏళ్లు పనికొస్తాయని పరిశీలకులు చెప్పినా తన అభీష్టం నెరవేర్చుకొనేందుకే కేసీఆర్ ముందడుగేశారు. ఒక రకంగా దీనిని రాష్ట్రం తనకు తాను తెచ్చుకొన్న ఆర్థిక అత్యయిక పరిస్థితి అనుకోవచ్చు. నివారణ చర్యల గురించి ఆలోచించాలి. వడ్డీలకు అప్పులు తెచ్చి కొనసాగించే కన్నా సాధ్యం కాని సంక్షేమ పథకాలపై పున సమీక్ష జరగాలి.

కరెంటు బిల్లులు, ఆస్తి పన్ను చెల్లింపులలో ప్రభుత్వ సంస్థలు, భవనాలు కోట్లలో బకాయి పడ్డాయి. కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు రూ.5,258 కోట్ల ఆస్తి పన్ను పెండింగ్ ఉన్నట్లు సమాచార చట్టం ద్వారా బయటపడింది. వీటిని చెల్లించడానికి చతికిలపడుతున్న ప్రభుత్వం పేజీలకొద్దీ పత్రికా ప్రకటనలకు కోట్లలో ప్రజాధనం వృధా చేస్తోంది. రైతులకు ఉచిత కరెంటు, రైతుబంధు, ఉచిత బీమా, పంట రుణమాఫీ, దళిత బంధు పథకాలు ప్రధాన భారంగా భావించాలి. దేశంలో మరే రాష్ట్రం వీటిని చేపట్టడం లేదు. కొన్ని రాష్ట్రాలు రాయితీ ఇస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని పథకమని గొప్పలు చెప్పుకొనే బదులు వారెందుకు ముందుకు రావడంలేదో గమనించాలి. తొలి ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ నిధుల కేటాయింపులు ఇలా వీలు కాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవిస్తే ఆయన తేలికగా మాట్లాడినట్లు చెప్పుకుంటారు.

బి.నర్సన్

94401 28169

Advertisement

Next Story

Most Viewed