- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నదులు జన జీవన నాడులు..
నదులు నాగరికతకు చిహ్నం. నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికత పరిఢవిల్లినట్లు, అభివృద్ధి జరిగినట్టు తేటతెల్లమవుతుంది. నదుల గురించి అవగాహన కలిగించడం, నదుల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టి జీవవైవిధ్యాన్ని కాపాడడం వంటి అనేక చర్యల ద్వారా జనజీవితాలకు,ఇతర జీవరాశులకు మేలు చేయడం కోసం బృహత్తర కార్యాచరణతో ముందుకు సాగడం, నదుల పరిరక్షణ పట్ల అవగాహన కలిగించడం ప్రపంచ నదుల దినోత్సవం ముఖ్య ఉద్దేశం.
అపార జల సంపద కడలి పాలు!
నదీనాం సాగరో గతిః అనేది వాస్తవం. అయితే అది గతం. విజ్ఞానం వికసించని రోజుల్లో నదులకు ఆనకట్టలు కట్టి, నీటిని రక్షించడం కష్టతరంగా ఉండేది. ఆర్థర్ కాటన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి వారు ఎంతగానో శ్రమించి లక్షలాది ఎకరాల భూమిని సశ్యశ్యామలం చేశారు. అయితే అప్పటి మేథావుల కృషి, పట్టుదల వర్తమానంలో కానరావడం లేదు. అప్పటికంటే ఇప్పుడు సాంకేతికంగా ప్రపంచం ఎంతో ముందంజలో ఉంది. అయినా ప్రతీచోట జలవివాదాలు తలెత్తుతున్నాయి. అపారమైన జల సంపద కడలి పాలౌతున్నది. పంటలకు, తాగునీటి అవసరాలకు వినియోగించవలసిన జలరాశులను సముద్రాల పాలు చేయడం బాధాకరం. మానవ విజ్ఞానం స్వార్ధంతో పెనవేసుకుని నదులను, జలరాశులను పూర్తి వినియోగం లోకి తీసుకురావడంలో అడ్డుపడుతున్నది. ఒక వైపు తాగడానికి గుక్కెడు నీరైనా లేని ప్రాంతాలెన్నో ఉన్నాయి. బంజరు భూములన్నీ నీరు లేక నెర్రలు తీస్తున్నాయి. కరువు ప్రాంతాలుగా కటిక దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతాల ప్రజల జీవన దైన్య స్థితి ఒకవైపు, మరోవైపు అతి వృష్టితో అపారమైన జలవనరులు వృధాగా పోతున్నాయి.
సముద్ర జలాలనుండి ఉప్పు నీటిని వేరు చేసి, మంచి నీటిగా మార్చే డీశాలినేషన్ ప్లాంట్ల ఏర్పాటును భవిష్యత్తులో విసృతం చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే 100 దేశాలకు పైగా డీశాలినేషన్ ప్రక్రియను విజయవంతంగా అమలు చేస్తున్నాయి. అయితే వీటీ నిర్వహణ వ్యయం ఎక్కువ! అందుచేత ప్రస్తుతానికి భూమిపై నీటి నిల్వలను ముఖ్యంగా నదుల్లోని నీటిని సంరక్షించి, సాగు, త్రాగునీటికి వినియోగించాలి. వీటిని తరిగిపోకుండా చూడడమే కాకుండా నేటి కలుషిత వాతావరణంలో మనకందరికీ పరిశుభ్రమైన నీరు విధిగా అందించవలసిన బాధ్యత ప్రపంచ సమాజంపై ఎంతైనా ఉంది. ఈనాటికీ ప్రపంచ జనాభాలో అత్యధిక శాతం మందికి స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదు.
నీళ్లు కూడా అందించలేని సమాజాలు
ప్రతీ మనిషికీ త్రాగడానికి, ఇతర అవసరాలకు సరిపడా కనీస నీటిని కూడా మనం అందించలేకపోతున్నాం. దాని ఫలితమే ఈ నీటికారక వ్యాధుల విజృంభణ. మరో దశాబ్దం నాటికి నీటి అవసరాలు మరింత పెరుగుతాయి.మనకు నదులు, సరస్సుల రూపంలో నీటి వనరుల లభ్యత ఉంది. కానీ అనేక రకాల కారణాల వల్ల మనం నీటి వనరులను సరిగ్గా వినియోగించుకోలేక పోతున్నాం. నీరంతా వృథాగా సముద్రం పాలౌతుంది. సరైన అవగాహన, చైతన్యం లేకపోవడమే దీనికంతటికీ ముఖ్య కారణం.
ప్రజల తాగునీటి అవసరాలను సాకుగా తీసుకుని కొంతమంది రక్షిత మంచినీటి సరఫరాను పెద్ద వ్యాపారంగా మార్చేస్తున్నారు. ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా పుంఖానుపుంఖాలుగా, పుట్టగొడుగుల్లా వ్యాపిస్తున్న రక్షిత నీటి సరఫరా విభాగాలపై ప్రభుత్వాలు కొరడా ఝళిపించాలి. వీటి సరఫరా ప్రమాణాల ప్రకారం సక్రమంగా జరుగుతుందా లేదా పర్యవేక్షించేందుకు తగిన యంత్రాంగం నెలకొల్పాలి. ప్రాణాధారమైన నీటిని కలుషితం కాకుండా కాపాడుకోవాలి. విషరసాయనాలు, ఇతర కలుషిత పదార్థాలు నీటిలో కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకుని మానవాళి మనుగడను పదికాలాల పాటు భద్రంగా కాపాడుకోవలసిన తరుణం ఆసన్నమైంది. ప్రపంచ నదుల పరిరక్షణకు పటిష్ఠమైన అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళిక అవసరం. ప్రపంచ నదుల దినోత్సవం నదుల పరిరక్షణకు దోహదం చేయాలని ఆశిద్దాం.
(నేడు ప్రపంచ నదుల దినోత్సవం)
- సుంకవల్లి సత్తిరాజు,
సామాజిక విశ్లేషకులు
97049 03463