- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరో శివాజీ తాంతియా భీల్
ప్రథమ భారత స్వాతంత్య్ర పోరాట వీరుల్లో తాంతియా తోపే గురించి తెలిసినంతగా తాంతియా భీల్ గురించి తెలియదు. ఇండోర్ (మధ్య ప్రదేశ్)లోని పాతాల్ పానీ రైల్వే స్టేషన్‌కు ఆదివాసీ వీరుడైన తాంతియా భీల్ పేరుతో ఆ రైల్వే స్టేషన్‌కు నామకరణం చేశాకా, ఆనాటి తాంతియా భీల్ పోరాట స్ఫూర్తిని మనం తెలుసుకున్నాం. మన దేశంలో తెల్లవాడి పాలన మొదలైన నాటి నుంచి కడదాకా రాజీ లేకుండా ఎదిరించింది ఆదివాసులే. వలస పాలనా కాలమంతటా దేశంలో ఎక్కడో ఒకచోట ఆదివాసులు తెల్లవాడి పైకి విల్లు సంధిస్తూనే వచ్చారు. ‘చరిత్ర’ విస్మరించిన ఆ మహత్తర పోరాటాలలో భిల్లుల తిరుగుబాట్లను (1822 -1857, 1874 -1889) ప్రత్యేకించి చెప్పుకోవాలి. నేడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌లలో విస్తరించి ఉన్న భిల్లు, బిలాలా, బరేలా, మంకర్ తదితర ఆదివాసులను భిల్లులని అంటారు. 1874 -1889 బిల్లుల తిరుగుబాటుకు నేతృత్వం వహించిన తాంతియా భీల్ మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా సమీపాన గల బర్దా తహసిల్ పంధానాలో 1840 -1842 మధ్యలో జన్మించాడు. అతని అసలు పేరు టుండారా. దృఢకాయులైన తేవరులు శరీర సౌష్టవం, వారికి ధీటైన యుద్ధ పాటవం గలిగిన టుండారాకు ‘తాంతియా’ అనే పేరు స్థిరపడింది.
స్వాతంత్ర్య పోరాటంలో గిరిజనులు..
బ్రిటిష్ పాలనలో అటవీ సంపదపై హక్కులు కోల్పోయిన భిల్లులు సామంతులు. జమీందార్ల దోపిడీ పీడనలకు, అవమానాలకు గురయ్యారు. ఈ దుర్భర పరిస్థితుల్లో తాంతియా తన తల్లి సహా భిల్లు మహిళలకు జరిగిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రతినబూనాడు. తాంతియా తోపేతో 1857, సెప్టెంబర్ 15న తాంతియా భీల్‌కు పరిచయం ఏర్పడింది. గెరిల్లా పోరాటంలో నైపుణ్యం సాధించాడు. విల్లంబులు, కత్తి, డాలు వంటి సంప్రదాయక ఆయుధాలతో బగడావి, తేవరుల అండదండలతో బ్రిటిషు పాలకులపైనా, వారి తైనాతీలపైనా తిరుగుబాటును నడిపాడు. నిరక్షరాస్యులైన గిరిజనులు స్వాతంత్ర్య పోరాటంలో ముందున్నారని చెప్పడానికి తాంతియా భీల్ ఒక ఉదాహరణ. ఆయన అనేక సార్లు జైలు నుంచి తప్పించుకున్నాడు. బ్రిటిష్ ధనాగారాలను పేదలకు పెంచిపెట్టాడు. గిరిజనులు గర్వంగా తాంతియాను ‘మామ’ గా పిలిచేవారు. పులుల్లా కదిలే తేవర్లు తోడు కావడంతో తాంతియా దావానలమై చెలరేగిపోయాడు. ఒకేసారి ఐదారు శత్రుస్థావరాలపై హఠాత్తుగా దాడిచేసి, మెరుపువేగంతో దెబ్బతీసి తప్పించుకుపోయే ఎత్తుగడలతో నిమాడ్, మాల్వా ప్రాంతాలలో బ్రిటిషువాళ్లకు సింహస్వప్నమయ్యాడు. ఆ ఎత్తుగడల కారణంగానే తాంతియాను 'శివాజీ'తో పోల్చేవారు. తాంతియాను 1874 ఒకసారి, 1878లోను ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వంలో హాజీగా పనిచేసిన నస్రుల్లా ఖాన్ యూసూప్ జాయ్ అరెస్ట్ చేసి ఖాండ్వానా జైలులో పెట్టాడు. మూడు రోజుల తర్వాత తప్పించుకున్న తాంతియా సంపన్నుల సంపదను దోచి పేదలకు పంచిపెట్టే రాబిన్ హుడ్ పాత్రలోకి తన జీవితాన్ని మార్చుకున్నాడు.
రాబిన్ హుడ్ ఆఫ్ ఇండియా!
సిమాండ్, హోషంగాబాద్, భీల్ వాడ, దుగర్ పూర్‌లలోని భిల్లు వీరులంతా తాంతియాను నేతగా స్వీకరించారు. శత్రువుల నుంచి తప్పించుకోవడానికి అజ్ఞాతవాసానికి తాంతియా ఎక్కువగా హోల్కర్ (ఇండోర్) రాజ్యాన్ని ఎంచుకునేవాడు. సామంతులు, జమీందార్లు, భూస్వాముల సంపదను దోచి పేద ప్రజలకు పంచేవాడు. అందుకే బ్రిటిషు వాళ్లు తాంతియాకు ‘బందిపోటు’ ముద్ర వేశారు. అతని వేటకు ‘తాంతియా బెటాలియన్’ ను నియమించారు. 1878 - 1885 మధ్య ఈ తిరుగుబాటు ఉదృతంగా సాగింది. తదుపరి కాస్త సన్నగిల్లింది. తన సోదరి భర్త గణపత్ నమ్మక ద్రోహంతో తాంతియా 1889లో ఇంగ్లిషువాళ్ల చేతికి చిక్కాడు. ఆ ఆదివాసి స్వాతంత్య్ర వీరుడ్ని జగదల్ పూర్ జైల్లో ఉంచి, విచారణ తతంగం నడిపి 1889, అక్టోబర్ 19న ఉరితీశారు. ఆయన మృతదేహాన్ని ఇండోర్ సమీపంలోని ఖాండ్వా మార్గంలోని పాతాల్ పానీ రైల్వే స్టేషన్ సమీపంలోన విసిరేసినట్లు చెబుతారు.
తాంతియా భీల్ అరెస్ట్ వార్తను న్యూయార్క్ టైమ్స్ 1889, నవంబర్ 10 సంచికలో ప్రముఖంగా ప్రచురించింది. ఈ వార్తతో తాంతియాను ‘రాబిన్ హుడ్ ఆఫ్ ఇండియా’ గా వర్ణించింది. పాతాల్ పానీ సమీపంలో తాంతియాకు జ్ఞాపికగా చెక్కబొమ్మలను ఉంచి, తాంతియా సమాధిగా భావించి ప్రజలు నివాళులర్పిస్తారు. రైలు డ్రైవర్లు ఇక్కడ తాంతియా మామకు గౌరవ సూచకంగా రైలును ఒక్క నిముషం నిలిపి ముందుకు కదులుతారు. నేటికీ నిమాడ్, మాల్వా ప్రాంతాలలోని ఆదివాసి ప్రజలు తాంతియాను ఆరాధిస్తారు. వీర్ తాంతియా భీల్ వంటి సాహస యోధుల ఉజ్వల సాహసాల, త్యాగాల చరిత్రలకు సమున్నతమైన స్థానాన్ని కల్పించడమే వారికి అర్పించగల నిజమైన నివాళి.
గుమ్మడి లక్ష్మీనారాయణ,
ఆదివాసీ రచయితల వేదిక
94913 18409
- Tags
- tantiya bhil