- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నికార్సైన సాయుధ పోరాటయోధుడు రావి
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రజా నాయకుడు, సంఘ సంస్కర్త, నికార్సైన కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి. 1908 జూన్ 4వ తేదీన నేటి యాదాద్రి భువనగిరి జిల్లా బొల్లేపల్లి గ్రామంలో జన్మించాడు. వెంకట రామమ్మ, గోపాల్ రెడ్డి ఆయన తల్లిదండ్రులు. వీరిది భూస్వామ్య కుటుంబం. గోపాల్ రెడ్డి వేల ఎకరాల భూమి గల పటేల్ పట్వారీ. పోలీసు శాఖలో ఉద్యోగం చేశాడు. రావి నారాయణరెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం బొలేపల్లిలో ప్రారంభమైంది. కొంతకాలం భువనగిరి మిడిల్ స్కూల్లో, ఆ తర్వాత హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ హైస్కూల్లో చదివాడు. అటు పిమ్మట నిజాం కాలేజీలో ఇంటర్ విద్యను అభ్యసించాడు. క్రీడల్లో కాలేజీ ఛాంపియన్‌గా నిలిచాడు. స్కౌట్స్‌లో చేరి ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు.
ఆ రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశమంతటా స్వాతంత్ర ఉద్యమాలు జరిగేవి. మహాత్మా గాంధీ ప్రభావానికి లోనైన రావి నారాయణరెడ్డి ఉప్పు సత్యాగ్రహంలో గాంధీని అరెస్టు చేసినందుకు నిరసనగా నిజాం రాష్ట్రంలో ఒక నిరసన సభ నిర్వహించాడు. కాకినాడ వెళ్లి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. గాంధీ పిలుపుతో తన సొంత ఊరులో ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పాడు. తాను ఖద్దరు ధరించాడు. మహాత్మా గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు రావినారాయణరెడ్డి తన భార్య సీతాదేవితో కలిసి వెళ్లి ఆయనను కలిసాడు. తన భార్య వంటిపై ఉన్న నగలు అన్ని తీసివేయించి గాంధీజీకి ఇచ్చి హరిజన సేవకు వినియోగించమని కోరాడు. బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లకు ఉరిశిక్ష విధించినప్పుడు దానికి నిరసనగా హైదరాబాద్‌లో జరిగిన సభలో పాల్గొన్నాడు.
గాంధీ ప్రభావంతో దేశభక్తి, జాతీయ భావాలు ప్రోదిచేసుకున్న రావి నారాయణరెడ్డి నెహ్రూ, జయప్రకాష్ నారాయణ రచనల ప్రభావంతో సోషలిస్టు భావాలను పెంపొందించుకున్నారు. హైదరాబాదులో హరిజన సేవా సంఘాన్ని స్థాపించాడు. దాని కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి హరిజన సేవా కార్యక్రమాలు చేపట్టాడు. అస్పృశ్యత నివారణ ఉద్యమం ప్రారంభించి కులం పేరుతో అస్పృశ్యతకు గురవుతున్న వారితో కలసి సహపంక్తి భోజనాలు పెట్టించాడు. హరిజనుల కోసం సుమారుగా 100 పాఠశాలలు ప్రారంభించాడు. వారికోసం రెండు వసతి గృహాలను నిర్మించాడు. నాడు రష్యా సాధిస్తున్న ప్రగతికి ముగ్ధుడై కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షతుడైనాడు.
దేశమంతటా స్వేచ్ఛ స్వాతంత్ర్యల కోసం పోరాటం కొనసాగుతుంటే నిజాం రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉండేది. నిరంకుశ, నియంతృత్వ విధానాలతో సామాన్య ప్రజలు అనేక కష్టాలు పడేవారు. ఆంధ్రా జనసంఘం ఏర్పాటుతో తెలంగాణ పల్లెలు చైతన్యవంతమై క్రమంగా నిజం వ్యతిరేక ఉద్యమ బాట పట్టాయి. ఆంధ్ర మహాసభల్లో చురుకుగా పాల్గొన్న రావి నారాయణరెడ్డి రైతాంగ సమస్యలు, నిజాం నిరంకుశపాలన, రాజ్యాంగ సంస్కరణలు, మహిళా స్వాతంత్రం మొదలైన అంశాలపై తీవ్రంగా స్పందించేవాడు. ఆ తర్వాత జరిగిన ఎనిమిదవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించాడు. అలాగే 11 ఆంధ్ర మహాసభకు కూడా రావినారాయణరెడ్డి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. ఆయన నాయకత్వంపై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉండేది.
హైదరాబాద్ సంస్థానంలో భూస్వాములు,పెత్తందారులు దోపిడీవర్గాల, నిజాం పోలీసుల దాష్టీకానికి, మత దురహంకారులైన రజాకార్ల ఆగడాలకు అల్లాడిపోతున్న జనసామాన్యాన్ని ఆదుకునేందుకు రావి నారాయణరెడ్డి ఆయుధం చేతపెట్టాడు. అజ్ఞాతవాసం గడుపుతూ ఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటు చేసి సాయుధ పోరాటం ప్రారంభించాడు. పోరాటాన్ని ఉధృతం చేశాడు. నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. 1946-48 మధ్యకాలంలో నిజాం సైనికులకు, గెరిల్లా దళాలకు మధ్య తీవ్ర పోరాటం నడిచింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి రావినారాయణరెడ్డి నాయకత్వం వహించి ముందుకు నడిపించాడు. తెలంగాణ చరిత్రలో సాయుధ పోరాటం ఒక మహోజ్వల ఘట్టం.
తర్వాత 1948లో హైదరాబాదు రాష్ట్రంపై పోలీసు చర్య జరిగిన తర్వాత నిరంకుశ నిజాం పాలన నుండి సంస్థాన ప్రజలు విముక్తులయ్యారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైనది. ఆ తర్వాత సాయుధ పోరాటాన్ని విరమించాలని రావి నారాయణరెడ్డి భావించాడు. రహస్య జీవితం గడుపుతున్న నారాయణరెడ్డి అజ్ఞాతం వీడాడు. పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన పెరోల్‌పై విడుదలైనాడు.
1952లో భారత దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ స్థానంలో కమ్యూనిస్టు పార్టీ తరఫున పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో నెహ్రూ కన్నా అధిక ఓట్లతో గెలిచి చరిత్ర సృష్టించాడు. 1957, 1962 లో భువనగిరి శాసనసభ్యుడిగా గెలిచాడు. శాసనసభ్యుడిగా ఎటువంటి ఆర్భాటం లేకుండా రిక్షాలో శాసనసభకు వెళ్లేవాడు. ఏ పదవిలో ఉన్న నిరాడంబరంగా ఉండడం, ప్రజా సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరింపజేయడం వంటివి నారాయణరెడ్డి వ్యక్తిత్వానికి నిదర్శనం. తన 60 ఎండ్ల వయస్సులో రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకున్నాడు. అలాగే పార్టీలోని పదవులను కూడా వదులుకొని ఒక సాధారణ సభ్యుడుగా కొనసాగాడు. నల్లగొండకు నందికొండ ప్రాజెక్టు, నడికుడి రైల్వే జంక్షన్ తీసుకురావడంలో కీలకపాత్రను పోషించాడు.
భూస్వామ్య కుటుంబంలో పుట్టినా దాని తాలూకు ఛాయలు కనిపించని ప్రజాస్వామ్యవాది రావినారాయణరెడ్డి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సమయంలో తనకున్న వందల ఎకరాల భూమిని రైతు కూలీలకు పంచిన ఆదర్శ నాయకుడు. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యాలయం మగ్దుం భవన్ శంకుస్థాపనకు పార్టీ చైర్మన్ డాంగే వచ్చినప్పుడు కమ్యూనిస్టు నాయకులందరూ గౌరవంగా లేచి నిలబడినారు. వారిలో మన రావి నారాయణరెడ్డి కూడా ఉన్నాడు. డాంగే నేరుగా నారాయణరెడ్డి వద్దకు వెళ్లి ''మీరు నా గౌరవార్థం లేచి నిల్చోవడం తగదు. ఒక్కమాటలో ప్రజా సమూహాన్ని నియంత్రించిన సేనాని మీరు. మీ ముందు మేమెంత వాళ్ళం'' అని వినయంగా నమస్కరించాడు. ఇలాంటి సంఘటనలు ఆయన జీవితంలో కోకొల్లలు. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రావి నారాయణరెడ్డికి కళాప్రపూర్ణ బిరుదు ప్రదానం చేసింది.
అణగారిన తాడిత, పీడిత ప్రజలకు అండగా, నిరంకుశ నిజాం రాజుకు సింహస్వప్నంగా, సాయుధ పోరాట యోధునిగా తన జీవిత ప్రస్థానాన్ని కొనసాగించిన అరుణతార రావి నారాయణరెడ్డి 1991 సెప్టెంబర్ 7న మరణించాడు. ఆయన మరణానంతరం భారత ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది.
(నేడు రావి నారాయణ రెడ్డి జయంతి)
- సుధాకర్.ఏ.వి
అసోసియేట్ అధ్యక్షులు,STUTS
90006 74747
Read More... ఇప్పటికీ అస్పృశ్యతా భారతమేనా!?