- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చేనేతోద్యమ సూరీడు ప్రగడ కోటయ్య
దేశంలో చాలామంది వ్యక్తిగత స్వార్థం కోసం, అక్రమార్జన కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలను వాడుకుంటూ ఉంటారు. అయితే వారు తాత్కాలికంగా తెరమీద కనపడినప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత చరిత్ర ద్రోహులుగా మిగిలిపోతారు. కానీ కొంతమంది తమ జీవితాన్ని పణంగా పెట్టి లక్ష్యశుద్ధితో నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఉంటారు. అలాంటివాళ్లు సమకాలీన సమాజంలో అంతగా గుర్తించబడకపోయినా తర్వాతి తరాలు వారిని స్మరించుకుని కీర్తించుకుంటారు. వారి చరిత్రను లిఖించి భావితరాలకు అందిస్తారు. అలాంటి ప్రజా ఉద్యమకారుడు, జాతీయోద్యమ నాయకుడు, చేనేత రంగం పరిరక్షణ కోసం అహర్నిశలు ఆరాటపడి ఉద్యమ భావజాలంతో చేనేత రంగాన్ని నూతన పుంతలు తొక్కించిన నేత, నాటి సమాజం, ప్రభుత్వంతో చేనేత రంగ పితగా గుర్తించబడిన వ్యక్తి ‘ప్రగడ కోటయ్య’. ఆయన ప్రజల కోసం పని చేసిన ధన్యజీవి. వీరి వ్యక్తిత్వం, సామాజిక చింతన, చేనేత రంగానికి చేసిన పోరాటం వంటివి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.
చేనేత రంగం కోసం చేసిన కృషి..
చేనేత కుటుంబంలో పుట్టిన ఆయన భారతీయ చేనేత పరిశ్రమపై పరిశోధనలు జరిపిన వ్యక్తి. ఆచార్య ఎన్జీరంగా సలహామేరకు మద్రాసులోని టెక్స్టైల్ ఇన్సిట్యూట్లో చదివి అక్కడ సూపర్ వైజర్ గా పనిచేశాడు. అక్కడి అనుభవంతో 1935లో ఏర్పడిన మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామిక సహకార సంఘంలో ప్రొడక్షన్ ఇన్ఛార్జిగా ఉద్యోగంలో చేరి, సర్కారు జిల్లాల్లో ప్రాథమిక చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేసి విశేష కృషి చేయడానికి తోడ్పడింది. ఆ తర్వాత 1945లో ఏర్పడిన ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ వీవర్స్ కాంగ్రెస్ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి ఆ రంగంలోని కార్మికుల సమస్యల పరిష్కారంలో విశేషంగా కృషి చేశారు. అలాగే భారత ప్రభుత్వ చేనేత రంగ ప్రతినిధిగా నియామకమైన కోటయ్య శ్రీలంక, బ్రిటన్, చైనా ,హాంకాంగ్ వంటి తదితర దేశాలలో పర్యటించి చేనేత రంగంలోని అనుభవాలను పరస్పరం పంచుకున్నారు. ఆయన సారథ్యంలో 1939లో జరిగిన మద్రాసు రాష్ట్ర కేంద్ర చేనేత సహకార సంఘం ఎన్నికల్లో చేనేత నాయకులు ఎన్నికయ్యే విధంగా కృషి చేసి సాధించారు. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో 1941లో దేశవ్యాప్త చేనేత రంగం స్థితిగతులను అధ్యయనం చేసేందుకు నియమించిన ‘థామస్ కమిటీ’ని గుంటూరు జిల్లాకు ఆహ్వానించి వంద పేజీల మెమోరాండం కార్మికుల సమస్యలపై ఆ కమిటీకి అందజేసి ప్రాతినిధ్య ధోరణికి తెరతీశారు. 1942లో మద్రాస్ రాష్ట్ర చేనేత పారిశ్రామిక సంఘాన్ని చైతన్యవంతం చేయడంలో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ సందర్భంలో నూలు కొరతను అధిగమించేందుకు, నూలు ధరలు తగ్గించి స్థిరీకరణ చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేనేత రక్షణ యాత్రలు నడిపి చరిత్ర సృష్టించారు. ప్రగడ కోటయ్య నాయకత్వంలో చేనేత పరిశ్రమకు నూలు సరఫరా చేయాలని, నూలు ధరలు అదుపులో ఉంచాలని, నూలు కొరతకు కారణమైన ఎగుమతులను ఆపాలని ఆందోళన చేసినా 1950 వరకు ఎలాంటి మార్పు రాలేదు. ఆ పరిస్థితులకు నిరసనగా 1950 ఏప్రిల్ 16 నుండి జూన్ 30 వరకు 75 రోజులు సత్యాగ్రహం చేసి పదివేల మంది చేనేత కార్మికులతో ప్రదర్శన నిర్వహించడంతో కేంద్ర చేనేత పరిశ్రమల మంత్రి మద్రాసు వచ్చి చేనేత నాయకులతో చర్చలు జరిపి హామీ ఇస్తే కానీ సత్యాగ్రహాన్ని విరమించని పోరాటయోధుడు ప్రగడ కోటయ్య.
1953లో చేనేత కార్మికుల కోసం రేపల్లెలో సత్యాగ్రహం చేపట్టి జైలు శిక్ష అనుభవించాడు. చేనేత రంగంపై ఏర్పడిన కమిటీ చేసిన ప్రజావ్యతిరేక సిఫార్సులకు నిరసనగా ఉద్యమించడమే కాకుండా చేనేత కార్మికులకు ప్రయోజనం కలగడం కోసం సహకార సంఘాలు మాత్రమే పరిష్కారమని నమ్మి ఆ వైపుగా కృషి చేశాడు. ఆయన ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రాంతంలో ఆనాడు 200కు పైగా చేనేత సహకార సంఘాలు ఏర్పడి అసంఘటిత రంగ చేనేత కార్మికులు నేసిన బట్టలకు సరైన గిట్టుబాటు ధర లభించడానికి దోహదపడ్డాయి. చేనేత రంగంలో విప్లవాత్మక మార్పులకు తన జీవితాంతం కృషి చేసిన ధన్యజీవి ప్రగడ కోటయ్య. ఆనాడు పెంపొందించిన చైతన్యం, ప్రభుత్వానికి చేసిన సూచనలు పునాదిగా నేడు దేశవ్యాప్తంగా చేనేత కార్మికులకు సంబంధించిన విధానం కొనసాగుతూ కాలానుగుణంగా నూతనత్వాన్ని సంపాదించుకోవడానికి ప్రగడ కోటయ్య కృషిని పునాదిగా విశ్వసించాలి.
ప్రజా ప్రతినిధిగా ఎన్నో సేవలు..
సుమారుగా రెండు దశాబ్దాల పాటు చేనేత రంగంతో పాటు వివిధ రంగాల శ్రామికుల కోసం చేసిన ఈ కృషిలో భాగంగా 1952 నుంచి 62 వరకు రెండు పర్యాయాలు, 57 నుండి 72 వరకు ఎమ్మెల్యేగా, 1974 నుంచి 80 వరకు ఎమ్మెల్సీగా, తరువాత 1990వ నుంచి 95 లో మరణించే వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేసి విభిన్న రంగాల్లో ప్రజలకు తనదైన శైలిలో సేవలు అందించారు. చేనేత వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రయోజనం కోసం పదవిలో ఉన్న సమయంలో చీరాల వద్ద 17 వేల ఎకరాలకు పైగా బంజరు భూములను పేద ప్రజలకు పంపిణీ చేసారు, అలాగే.. సముద్రతీర ప్రాంతంలో సేద్యపు నీటి సౌకర్యం కల్పించడంలో కానీ, చీరాల నెల్లూరు రాజమండ్రి పట్టణాలలో సహకార నూలు మిల్లులు ఏర్పాటు చేయడంలో కానీ వీరు చూపిన కృషి ప్రజా ప్రతినిధిగా ఎన్నైనా సేవలు అందించవచ్చని అట్టడుగు వర్గాల కోసం ప్రజా ప్రతినిధి ఏమైనా చేయవచ్చునని ప్రగడ కోటయ్య రుజువు చేసి నేటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు. వీరి రాజకీయ పరిణతికి, సేవాతత్పరత కు నిదర్శనంగా మెడికల్ సెలక్షన్ కమిటీ సభ్యునిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యునిగా పదవీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిన ఘనత వీరి చిత్తశుద్ధికి నిదర్శనం.
చివరికి 1995 నవంబర్ 26వ తేదీన 80 ఏళ్ల వయసులో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో అనారోగ్యంతో మరణించిన కోటయ్య గారి వ్యక్తిత్వం, జీవితం, రాజకీయాలు, ప్రజా సేవ, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రత్యేకించి చేనేత రంగాన్ని ఉద్ధరించిన విధానం నేటి ప్రజానీకానికి, సమాజానికి, రాజకీయ పక్షాలకు, ప్రభుత్వాలకు మార్గదర్శనం కావడమే కాక కనువిప్పు కలిగిస్తుందని వారి పోరాట పటిమను నేటితరం గుర్తించి ఆదరించి ఆచరిస్తుంది అని మనసారా కోరుకుందాం.
(ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా)
వడ్డేపల్లి మల్లేశము
90142 06412