- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సబ్బండ వర్ణాల సింహం సర్వాయి పాపన్న
అతడు ఒక సామాన్య గీత కార్మికుడు.. ఛత్రపతి శివాజీకి సమానుడు. క్షత్రియ పౌరుషానికి ఏ మాత్రం తీసిపోని బహుజన నాయకుడు. మొఘల్ చక్రవర్తి పెత్తనాన్ని సవాల్ చేసిన గౌండ్ల బిడ్డ.. సబ్బండ వర్ణాల ఆశా జ్యోతి ‘సర్వాయి పాపన్న గౌడ్’ ఆయన ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం ఖిలాషా పూర్‌లో ధర్మన్న, సర్వమ్మ దంపతులకు సామాన్య కులవృత్తి చేసుకునే కుటుంబంలో జన్మించినాడు. తల్లి ‘పాపడు’ అని ప్రేమగా పిలిచేది.
ముస్లిం ఆధిపత్యాన్ని అంతం చేయాలని..
పాపన్న కల్లు గీత కార్మికుడిగా వృత్తిని స్వీకరించాడు. దొరలు, జమీందారులు, భూస్వాముల పెత్తనాన్ని ఎంత మాత్రం సహించే వాడు కాదు. కల్లు తాగడానికి వచ్చిన తురుష్క సైనికులు డబ్బులు ఇవ్వకుండా తన స్నేహితులపై కాలు ఎత్తి తన్నబోతే సర్వాయి పాపన్న ఆగ్రహించి, తాటి చెట్టుగీసే కత్తితో సైనికుల తలలు తెగ నరికాడు. భయపడిన సైనికులు గుర్రాలను, వెంట తెచ్చుకున్న ధన రాశులను వదిలి పారిపోయారు. పాపన్న అతని స్నేహితులు ఆ ధనాన్ని పేద జనాలకి పంచి పెట్టారు. అలాగే తురక సైనికులు వసూలు చేసిన శిస్తును దారి కాచి అడ్డగించి స్వాధీనం చేసుకునే వారు. ఈ డబ్బుతో గుర్రాలు, ఆయుధాలను సమకూర్చుకునే వారు. డబ్బును పేదవారికి పంచి పెట్టడం వల్ల జనగాం ప్రాంతంలో పాపన్నకు మంచి పేరు వచ్చింది. గ్రామాలలోని వ్యక్తులు, యువకులు పాపన్న వద్ద సైనికులుగా పనిచేసేవారు. పది మందితో ప్రారంభం అయిన సైన్యం మూడు వేలకు చేరుకున్నది.
మొగల్ రాజు తెలంగాణలో, అంతకంతకు పెరుగుతున్న ముస్లింల అధిపత్యాలను అంతం చేయాలని జమీందారులు, జాగిర్దారులు, దొరలు చేసే దురాగతాలను గమనించి గోల్కొండ కోటపైన బడుగు బలహీన వర్గాల జెండాని ఎగరవేయాలని నిర్ణయించాడు సర్వాయి పాపన్న గౌడ్. అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం గానీ, ధనము, అధికారము లేవు. సొంతంగా గెరిల్లా సైన్యం తయారు చేసుకొని ఆ సైన్యం ద్వారా మొగల్ సైన్యంపై దాడి చేసి, తన సొంత ఊరు ఖిలాశాపూర్‌ని రాజధానిగా చేసుకొని 1675లో సర్వాయిపేటలో తన స్వీయ రాజ్యాన్ని స్థాపించాడు. అతని తరుపున పోరాడడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. దీంతో సైనికుల సామర్థ్యం 12 వేలకు చేరుకున్నది.
గోల్కొండ కోటను స్వాధీన పరచుకొని..
శివాజీ ముస్లిం పాలన అంతానికి మహారాష్ట్రలో ఎలాగా పోరాటం చేశాడో, పాపన్న కూడా తెలంగాణలో ముస్లింల పాలన అంతానికి పోరాటం చేశాడు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. పాపన్న ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించి, విజయదుర్గాలు నిర్మించాడు. సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి దాదాపు 20 కోటలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. పాపన్న ఆలోచనలకు భయపడ్డ భూస్వాములు నిజాం తొత్తులు కుట్రలు పన్ని సైన్యాన్ని బలహీనపరిచారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దాదాపు 12 వేల సొంత సైనికులను సమకూర్చుకొని చివరకు గోల్కొండ కోటను స్వాధీన పరచుకోవడంతో పాటు ఏడు నెలలు అధికారం చెలాయించాడు. తెలంగాణలో మొఘలుల రాజ్య విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్నే. ఆయన సామ్రాజ్యం తాటి కొండ, కొలనుపాక, చేర్యాల నుండి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, హుజురాబాద్ వరకు విస్తరించింది. ముస్లిం మతానికి చెందిన స్త్రీని వివాహం చేసుకున్నాడు.
ఇంతటి చరిత్ర ఉన్న పాపన్న గూర్చి జానపద కళాకారులు తరతరాలుగా మూడు, నాలుగు వందల సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ జానపద పాటలలో పాపన్న చరిత్ర ఇప్పటికీ పాడతారు. పాపన్న ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన వాడు కనుక అతనికి ప్రజల కష్టనష్టాలన్నీ తెలుసు. అందుకే పాపన్న రాజ్యంలో పన్నులు లేవు. ఖజానా కోసం జమీందారు, సుబేదార్లపై తన గెరిల్లా సైన్యంతో దాడి చేయించేవాడు. పాపన్న యోగ్యమైన పనులు చేశాడు. అతని రాజ్యంలో సామాజిక న్యాయం పాటించేవాడు. తాటికొండలో చెక్ డ్యామ్ నిర్మించాడు. అతను ఎల్లమ్మకు పరమ భక్తుడు. కావున హుజురాబాద్‌లో ఎల్లమ్మ గుడి కట్టించాడు. అది నేటికీ రూపం మారినా అలానే ఉంది. ఔరంగజేబు మరణించిన తర్వాత గోల్కొండలో సింహాసనాన్ని అధిష్టించిన దక్కన్ పాలకుడు కంభక్షక్ ఖాన్, పాపన్న కొలువై ఉన్న వరంగల్ కోటపై దాడి చేశాడు. ఈ దాడిలో పాపన్న పట్టుపడ్డాడు. దీంతో శత్రువు చేతుల్లో చావడం ఇష్టం లేని పాపన్న, తన బాకుతో గుండెల్లో పొడుచుకొని చనిపోయాడు. తర్వాత 1710 లో పాపన్న తలని గోల్కొండ కోట ద్వారానికి వేలాడదీశారు.
(నేడు సర్వాయి పాపన్న జయంతి)
యాడవరం చంద్రకాంత్ గౌడ్
94417 62105