ఆ నెత్తుటి మరకలకు 43 ఏళ్లు

by Ravi |
ఆ నెత్తుటి మరకలకు 43 ఏళ్లు
X

ఇంద్రవెల్లి గాయం ఆదివాసీల మనసులో నుండి ఇంకా చెరిగిపోలేదు. దోపిడీకి వ్యతిరేకంగా జంగ్ సైరన్ మోగించి కదిలి వచ్చిన అదివాసుల నెత్తుటి మరకలను వారు మరచిపోలేకపోతున్నారు. 1981 ఏప్రిల్ 20న ఆదివాసీ గూడేలు చిందరవందర అయిన రోజు అడవి తల్లి చెమర్చిన రోజు...43 ఏళ్ళు కావస్తున్నా ఆ గాయం ఇంకా మానలేదు, ఆ రోజు వచ్చిందంటే అక్కడ గంభీరమైన వాతావరణం నెలకొంటుంది.

దోపిడీ, దౌర్జన్యాలతో, అడవి బిడ్డలు బుక్కెడు బువ్వ కోసం పడరాని కష్టాలు పడుతున్న రోజులవి. హద్దులు లేని దోపిడీతో అడవి తల్లి ఆగం అవుతున్న సందర్బం.. దళారుల దౌర్జన్యాలను ఎండగడుతూ తిరగబడ్డారు. తుడుం మోత వాళ్ళ చైతన్య శంఖారావంగా మారింది. ఆదివాసీలను పీడించుకుతింటున్న షావుకార్లు(వడ్డీ వ్యాపారులు), గిరిజనేతరుల వలసల వల్ల, ఆదివాసీ ప్రాంత భూములు, వనరులు అన్యాక్రాంతం జరుగుతుంటే, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు చూసి చూడనట్టు ఉండడం గమనించిన ఆదివాసీలు, వారి హక్కులను కాపాడుకోవడం కోసం కార్యాచరణ రూపొందించారు. గిరిజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో 1981 ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలంలో భారీ బహిరంగ సభను తలపెట్టారు గూడల్లో తుడుం మోగించి ప్రచారం చేశారు.

ఆ రోజు...

ఏజెన్సీ ఆదివాసి ప్రజలంతా, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రవాహంలా ఇంద్రవెళ్లికి బయలుదేరారు. సమావేశానికి అదివాసులను రాకుండా ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసింది. వాహనాలను రాకుండా ఎక్కడికి అక్కడ అడ్డుకున్నారు అయిన ఒక్కసారిగా ఆదివాసులు వేలాదిగా ఇంద్రవెల్లికి పోగయ్యారు. ఆ రోజు ఇంద్రవెల్లిలో వారసంత జనంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది. అది చూసి పోలీసులు విస్తుపోయారు. సభా స్థలం నుండి భారీ ఊరేగింపు ప్రారంభమైనది. అదివాసుల నినాదాలతో ఇంద్రవెల్లి మార్మోగింది. అయితే ఊరేగింపుగా వస్తున్న అదివాసులకు, పోలీసులకు మధ్య మాట మాట పెరిగి ఉద్రిక్తతకు దారితీసింది. అది జీర్ణించుకోలేని ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగంతో అమాయకపు అదివాసులపై ఫైరింగ్ చేయించింది. ఆ ఫైరింగ్‌కి కొంత మంది ఆదివాసులు అక్కడికి అక్కడే మృతి చెందితే, మరి కొందరు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అడవి వెంట పరుగులు తీశారు. పచ్చని చెట్లకు ఎర్రని రక్తపు మరకలు అంటి అడవి అంతా అదివాసుల రక్తపు మరకలతో ఆ ప్రాంతమంత రణక్షేత్రంగా మారింది. నిసిగ్గుగా ప్రాణాలు హరించిన ప్రభుత్వమే ఆ రక్తపు ముద్దలను 13 మందిగా లెక్క కట్టింది. కానీ అదివాసుల కన్నీల్లే చెబుతున్నాయి. 80 మందికి పైగా మారణహోమం అని. ఇంద్రవెల్లి ఘటన పచ్చని ఆకులపై ఎర్రని నెత్తుటి సాక్షిగా అదివాసులు తమ ప్రాణాలను కోల్పోయిన ఘటన యావత్ దేశన్నే చలింపచేసింది.

స్తూపం ఏర్పాటు...

ఇంద్రవెల్లి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరుల గుర్తుగా, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆదివాసులు 1986 ఏప్రిల్ 19న ఇంద్రవెల్లిలో స్థూపం ఏర్పాటు చేశారు. ఇంద్రవెల్లి పోరాట చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియద్దు అని, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దురుద్దేశ్యంతో డైనమెట్లతో స్థూపాన్ని పేల్చి వేసింది. మళ్ళీ ప్రజలు స్తూపాన్ని పునర్నిర్మించుకున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ 20 వచ్చింది అంటే అక్కడ భయానక వాతావరణం, స్తూపం వద్ద ఇనుప బూట్ల శబ్ధం. ప్రజలకు భయాందోళన కలిగిస్తూ పోలీస్ బందోబస్తు, అంక్షలతో అతి కొద్ది మందికి మాత్రమే నివాళులు అర్పించడానికి అనుమతి ఇచ్చేది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆదివాసులు కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. రాష్ట్రం ఏర్పడితే మాకు ఏజెన్సీ వనరుల పై పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది, ఆదివాసీ చట్టాలు అమలు అవుతాయి అని ఆకాంక్షించారు, కానీ 10 ఏళ్ళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నాటి ఆంధ్ర పాలకులలాగే భూములను, వారి చట్టాలను తుంగలో తొక్కేసి, హక్కులను హరించింది.

స్మతి వనంగా స్తూపాన్ని తీర్చిదిద్దాలి

నేటితో ఇంద్రవెల్లి మారణహోమానికి 43 ఏళ్ళు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇంద్రవెల్లిలో అసువులు భాసిన ఆదివాసీ అమరవీరులను స్వేచ్ఛగా స్మరించుకోడానికి ఎలాంటి అంక్షలు లేకుండా అనుమతి ఇచ్చి, స్తూపాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దాలి. తమ రక్షణ కోసం పోరాటాలు చేసే దుస్థితి నుంచి తప్పించి జల్, జంగల్, జమీన్లపై పూర్తి స్వేచ్చా అధికారాలు అదివాసులకు లభింపచేసినప్పుడే ఇంద్రవెల్లి అమరుల త్యాగాలకు మనం అర్పించే ఘన నివాళి ఔతుంది. జోహార్ ఇంద్రవెల్లి అమరవీరులకు జోహార్.

(నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ సందర్భంగా)

కుడిమేత శ్రీనివాస్,

అడ్వకేట్.

91771 66152

Next Story