చిరస్మ'రమణీ'యం... 'కోతి కొమ్మచ్చి'

by Ravi |   ( Updated:2024-06-28 00:45:37.0  )
చిరస్మరమణీయం... కోతి కొమ్మచ్చి
X

‘నేను జ్యేష్ఠ మాసం జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో పుట్టాను. అంటే జూన్ 28 తెల్లవారు ఝామున 1931లో. పీ.వి.గారు కూడా జూన్ ఇరవయ్యేనిమిదే. కానీ 1921లో. అంటే నాకూ ఆయనకూ పదేళ్లూ వ్యత్యాసం. రాజమండ్రి, ధవళేశ్వరంల మధ్య ఉన్న ఆలకట్టుతోట ఆసుపత్రిలో పుట్టాను. మా అమ్మనాన్నలది, వాళ్ల అమ్మానాన్నలది బరంపురం, ఛత్రపురం, గోపాలపురం వగైరాలట. ఇప్పుడు ధవళేశ్వరం. గోదావరి ఒడ్డున రాంపాదాల రేవు. ఆ వీధిలో మొట్టమొదటి మేడ మా ఇల్లు..’ అని ముళ్లపూడి వెంకట(రావు) రమణ తన ‘కోతి కొమ్మచ్చి’లో రాసుకున్నారు. ఇది ఆయన ‘ఆత్మకథ’. ఇది మూడు భాగాలుగా వెలువడింది.

ఇందులో ఆయన నవ్విస్తూ ఏడిపించే సన్నివేశాలు.. ఏడిపించే సన్నివేశాలను నవ్వుతూ చెబుతూ చార్లీ చాప్లిన్, వుడ్ హౌస్‌లను గుర్తు చేస్తారాయన. ఆయన జీవితం నిండా ‘కోతికొమ్మచ్చి’ చేష్టలున్నాయి. సుఖదుఃఖాలు, రుణానంద లహరి గాథలు వంటివి ఈ ‘ఆత్మకథ’ ఆవిష్కరించింది. సంగీత, సాహిత్య, సినిమాల ఎన్సైక్లోపీడియాగా ‘కోతికొమ్మచ్చి’ని చెప్పుకోవాలి. ‘ఆకలి ఎంత రుచి’ అనే సంఘటనను వివరించే క్రమంలో మద్రాసు నుంచి ఏలూరు వెళ్లే సందర్భంలో ‘అంత కంగారులోనూ మందోబస్తు చేసుకున్నాం గానీ మధ్యాహ్నంకి విందోబస్తు చూసుకోలేదని, దబ్బ పచ్చడితో ఓ ముదుసలి దారిలో ఇచ్చిన విందు గురించి ‘పసందుగా’ వివరిస్తారు. అన్నం తిన్న తర్వాత ఆ ముసలావిడకు డబ్బులిస్తే ‘ఇక్కడ అన్నం తినడానికే, అమ్మడానికి కాదని’ ఆమె చెప్పిన సమాధానం కనులను, గుండెను చెమరిస్తుంది. (ఈ రకమైన డైలాగులు ‘అందాల రాముడు’ సినిమాలో అక్కినేని చేత అనిపిస్తారు). అక్షరాలను ‘పదాలుగా’ వాడుకునే క్రమంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రను కనపరచటం ముళ్లపూడి వారి ప్రత్యేకత. ‘నచ్చే బొమ్మలు దొరకవు. దొరికే బొమ్మలు నచ్చవు’ అనేది ఆయన మార్కు సంభాషణా చమత్కారం.

జీవితం నిండా భయం లేనితనం

’అయ్యా ఆత్మకథ అంటే సొంత డబ్బా, పరనిందా అని అంటారు. కోయ్ కోయ్ అంటారు. అదే హెమింగ్వే అన్నట్టు నో మ్యాన్ ఈజ్ యాన్ ఐలాండ్.. సెర్లో బెడ్డేస్తే నీరంతా కదులుద్ది- ఊరంతా తగులుద్ది… ఆత్మకథ రాస్తూ ‘నేను ఒక గొప్పవాణ్ణి’ అంటే పదిమంది చవటలున్నట్టే కదా..! అందుకే ఆత్మకథలు రాయడమంటే నాకు భయం- పీల్చే ఊపిరిలా అబద్ధాలు లోపలికి దూరిపోతాయ”ని ఆయనే చెప్పుకున్నారు. కానీ.. అన్ని నిజాలే రాశారు.. ‘అచ్చం’గా నిజాలే చెప్పారు. అతిశయోక్తులు లేవు. వెంకటరమణ గారి తండ్రి సింహాచలం గారు గోదావరి ఆనకట్ట ఆఫీసులో పని చేసేవారు. మేనేజర్‌గా కూడా చేశారు(ట). కనుకనే వెంకటరమణ గారిని చిన్నతనంలో ‘చక్రవర్తి’ అని పిలిచేవారు(ట). కానీ… తండ్రి ‘భక్త రామదాసులా ఆయన పడవాళ్ల కుటుంబాలకి ఆఫీసు కాసులు తెచ్చి సర్దేసేవారట. నెల చివర కోమటి కొట్లో నోటు రాసి అప్పు తెచ్చి ఖజానాలో కట్టేసేవారట’

పేదరికాన్ని అలా జయించా..!

ఈ కారణంగా వారు ధవళేశ్వరం వదిలి మద్రాసు చేరుకున్నారు. తండ్రిగారు చిన్నతనంలోనే మరణించడం కూడా ఒక కారణం. తర్వాత ఆయన జీవితం నిండా ‘భయం లేనితనమే’ రాజ్యమేలింది. అమ్మ, అమ్మమ్మతో ‘రమణ’గారు ఓ చిన్నగదిలో కుదురుకొని.. ఆకులు కుట్టి జీవనం సాగించారు. కన్నీరు, ఆకలి, పేదరికం వంటివి ‘తన భయంలేమి’తో జయించేశారంటారాయన. ఇది అమ్మ నేర్పిందని కూడా అంటారు. ఈ భయంలేని తనంతో తరువాత తరువాత సినిమాలు తీసి చేతులు, కాళ్లు కూడా కాల్చుకొని లక్షలు పోగొట్టుకున్నారు. ఇటువంటి అమ్మలు మద్రాసులో తొమ్మిది మంది ఉన్నారని చెబుతూ “నేను మా ఊళ్లో పుట్టినప్పుడు నాకు ఒక్కమ్మే కానీ మెడ్రాసులో పెరిగినప్పుడు తొమ్మండుగురు అమ్మలు దొరికారు. కొన్ని రోజుల నుంచి కొన్ని నెలలు, ఏళ్లు కూడా నన్ను తమ బిడ్డగా సాకారు’ (వీరిలో బాపుగారి తల్లి సూర్యకాంతమ్మ గారు ఒకరు).

ప్రతి పేజీలోనూ ఆత్మీయత గుణం

ముళ్లపూడి వెంకటరమణ గారి తన తల్లి ఆదిలక్ష్మి మరణించిన సమయంలో తనో జీవితపాఠం నేర్చుకున్నానని చెబుతూ ‘ఇవ్వడం అంటే దానాలు, డబ్బులు, బిస్కెట్లు, దుప్పట్లు కాదు- స్నేహం, ఆదరణ, మనసు. మా అమ్మ నాకు జన్మ రీత్యా అమ్మ- జీవితం రీత్యా ఫ్రెండ్. భయం లేకుండా బతకడం నేర్పిన గురువు. తెచ్చుటలో కన్నా ఇచ్చుటలో ఉన్న హాయిని రుచి చూపిన దైవం’ అని రాశారు (ఏమో). వారిద్దరూ తూ.గో, ప.గో.లలో పుట్టినా విడదీయలేని ‘ఏక వచన’ రూపం. ‘బాపూ రమణ’ అనేది ఐక్యతామంత్రం.. ఏకతా సూత్రం. ‘కోతికొమ్మచ్చి’ అంటే ఇదే. జీవితం కూడా ఇలాగే ఉంటుంది. సుఖాల మధ్య కష్టాలు, కష్టాల్లో నంజుకోవడానికి సుఖాలు అర్థం లేకుండా, లాజిక్ లేకుండా వచ్చేస్తుంటాయి. కన్నీరూ పన్నీరూ కలిసి పప్పుచారు అయిపోతూ ఉంటుంది.’ అంటారాయన. అమ్మ చెప్పిన జీవిత సత్యం ‘నాయనా- మనం ఎవరికన్నా మేలు చేస్తే వెంటనే మరిచిపోవాలి గాని మనకి మేలు చేసిన వాళ్లని మాత్రం మనం మర్చిపోకూడదు.. లక్షలు గడిస్తున్నప్పుడు ఒకట్లు, పదులు గడించిన రోజులు కూడా గుర్తు పెట్టుకోవాలి’ అనేది కూడా గుర్తుందంటారు రమణగారు.

భరించడం.. సహించడమే జీవితం

బాపుగారి గురించి ప్రస్తావించుకోకపోతే ‘రమణ’గారి రచనలకు, జీవితానికి సమగ్రత లేదనిపిస్తుందం’టారు ఓ సినీ విశ్లేషకుడు. బాపు పుట్టినది పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం (కంతేరు). ‘తూర్పు పడమర ఎదురెదుర’ని సినారే గారు పాట రాసినా ‘వీరిద్దరూ’ పట్టించుకోలేదు. వారి థియరీ ఒక్కటే… “ఆలుమగలయినా ఆప్త మిత్రులైనా అన్నదమ్ములైన చిరకాల బాంధవ్యాన్ని నిలబెట్టి నడిపే సూత్రం- భరించడం. ఒకరి సుగుణాలు నచ్చినప్పుడు ప్రేమించడం సహజం. కానీ.. నచ్చని గుణాలు కనిపించినప్పుడు వాటిని సహించడం, భరించడం.. అదే ప్రత్యేకత… మనకి నచ్చని గుణాలన్నీ చెడ్డవి అనుకోవడం చాలా పెద్ద తప్పు. అది తెలుసుకుంటే స్నేహదీపం అఖండంగా వెలుగుతుంది… ‘కోతికొమ్మచ్చి’ ప్రతి పేజీలోనూ ఈ ‘ఆత్మ సూత్రం, ఆత్మీయత గుణం’ కనిపిస్తుంది.

- భమిడిపాటి గౌరీ శంకర్

94928 58395

Advertisement

Next Story

Most Viewed