రంగస్థల నటరత్నం.. చందాల కేశవదాసు

by Ravi |   ( Updated:2023-06-20 00:15:39.0  )
రంగస్థల నటరత్నం.. చందాల కేశవదాసు
X

తెలంగాణ సాహితీ వనంలో వికసించిన అక్షర పుష్పం, రంగస్థల నటరత్నం, తొలి తెలుగు సినిమా పాటల రచయిత, హరికథ భాగవతాలు, అష్టావధాని బహుముఖ ప్రజ్ఞాశాలి, మానవతా మూర్తి చందాల కేశవదాసు. తెలుగునాట ఏ తెలుగు నాటక సమాజం వారైనా తమ నాటక ప్రదర్శన ప్రారంభంలో ‘పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ’ అంటూ పాడుకునే ప్రసిద్ధ ప్రార్థన గీతం ఆయన రాసిందే. అట్లాగే శ్రీకృష్ణతులాభారం సినిమాలో ‘భలే మంచి చౌక బేరము ఇది సమయము మించినన్ దొరకదు, త్వరన్ కొనుడు సుజనులారా!’ అంటూ నాటికి నేటికి మనకు వినిపిస్తున్న ప్రసిద్ధమైన పాట రాసింది కూడా కేశవ దాసే.

నాటక రంగ ప్రస్థానమిలా..

చందాల కేశవదాసు 1876 జూన్ 20న ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి ప్రజా వైద్యం నిర్వహించి, వ్యవసాయం కూడా చేసేవాడు. కేశవదాసు తండ్రి మరణించడంతో, అన్న పోషణలో పెరిగాడు. కేశవదాసు కూడా తన అన్న బడిలో చదువుతూ సంస్కృత అమరకోశాన్ని కంఠస్థం చేశాడు. దానితోపాటు చందస్సు, వ్యాకరణం, అవధానం మొదలైన ప్రక్రియలన్నింటిని అభ్యసించి, పాండిత్యాన్ని సంపాదించాడు. ఆ తర్వాత కేశవదాసే అక్కడి పిల్లలకు విద్య నేర్పేవాడు. ఆ విద్యార్థులను ప్రుచ్చకులుగా చేసుకొని అవధాన విద్యను సాధన చేశాడు. కేశవ దాసుకు చిన్నతనం నుండి సంగీతం అంటే ఎంతో ఇష్టం. పాటలు, పద్యాలు అద్భుతంగా పాడేవాడు. హరికథాగానం చేపట్టి హరికథలు చెప్పడంలో గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించి జనహృదయాన్ని ఆకర్షించి హరికథా భాగవతారుగా ప్రసిద్ధి చెంది, తెలుగు నాట హరికథా భాగవతారుగా ప్రత్యేక స్థానాన్ని పొందాడు. దీనితో పాటు అష్టావధానాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకున్నాడు. అలాగే ఆయుర్వేద వైద్య వృత్తిని వారసత్వంగా స్వీకరించి ప్రజలకు ఉచిత వైద్యం చేస్తూ ప్రజావైద్యుడిగా ఖ్యాతి పొందాడు. నాడు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సాహిత్య సేవాతత్పరుడు నాటక సమాజ హితవరీ అయిన లక్ష్మీకాంతయ్య గారు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో చందాల కేశవదాసు అష్టావధానం చేశాడు. అతని ప్రతిభాపాటవాలను గుర్తించిన లక్ష్మీకాంతయ్య కేశవదాసుని తమ నాటక సమాజంలో చేరవలసిందిగా ఆహ్వానించాడు. ఆ విధంగా కేశవ దాసు నాటక ప్రస్థానం మొదలైంది.

మొదటి పాటల రచయితగా..

కేశవ దాసు రాసిన 'పరబ్రహ్మ, పరమేశ్వర, పురుషోత్తమ' అనే పాటకు లక్ష్మీకాంతయ్య గారు బాణీ కూర్చి స్వరపరచడమే కాకుండా ఆ పాటను నాటక ప్రదర్శనకు ముందు ప్రార్థన గీతంగా ఆలపించాలని నాటక సమాజాలకు సూచించారు. నాటక సంస్థలకు పెద్దదిక్కుగా, ఆప్తుడుగా ఉన్న లక్ష్మీకాంతయ్య సూచనను నాటక సమాజం వారు చిత్తశుద్ధితో అమలుపరిచారు. నాటినుండి తెలుగునాట నాటక ప్రదర్శనకు ముందు కేశవ దాసు రాసిన పాటను ప్రార్ధన గీతంగా ఆలపించడం ఆనవాయితీగా మారింది. ఇప్పటికీ సురభి నాటక సమాజం వారు తమ నాటక ప్రదర్శన ప్రారంభంలో ఈ పాటను పాడడం విశేషం. కేశవదాసు ఎన్నో నాటకాలు రాశారు వాటిలో బలి బంధనం, కనకతార ప్రసిద్ధి పొందాయి. తర్వాత కాలంలో కనకతార నాటకాన్ని చలనచిత్రంగా తీయడం జరిగింది. కేశవదాసు నాటకాలు రాయడమే కాకుండా వాటిలో నటించడం కూడా జరిగింది. ఆయన నటనకు తెలుగు ప్రేక్షక లోకం నీరాజనం పట్టింది. కేశవదాసు కొన్ని నాటకాలకు దర్శకత్వం వహించాడు.

కేశవదాసుకు సినిమా రంగం కూడా ఆహ్వానం పలికింది. 1931లో తీయబడిన తొలి తెలుగు టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’. ఆ చిత్రానికి పాటలు రాసే అవకాశం కేశవదాసుకు లభించింది. ఆ సినిమాకు పాటలు రాయడం ద్వారా చందాల కేశవదాసు తొలి తెలుగు సినిమా పాటలు రచయితగా గుర్తింపు పొందాడు ఆ తర్వాత సతీసక్కుబాయి, శ్రీకృష్ణతులాభారం, సతీ అనసూయ, లంకా దహనం, కనకతార, రాధాకృష్ణ , బాలరాజు వంటి చిత్రాలకు పాటలు రాశాడు. అలాగే పానుగంటి లక్ష్మీనరసింహారావు రాసిన ‘రాధాకృష్ణ’ నాటకానికి కేశవదాసు 21 పాటలు రాశారు.

నిజాంపై నిరసన గళంతో..

కేశవదాసు తనకు వచ్చిన ఆదాయాన్ని ప్రజాసేవకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించేవాడు. ప్రస్తుత సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని తమ్మర గ్రామంలోని సీతారామాలయం పునరుద్ధరణకై తన భార్య నగలు అమ్మి ఖర్చు చేశాడు.108 సార్లు భాగవత సప్తాహ కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు అన్నదానం, వస్త్రదానం చేశాడు. ఆ రోజుల్లో భద్రాచలం యాత్రకు వెళ్లే భక్తుల విశ్రాంతికై సత్రాలను ఏర్పాటు చేశాడు. నీటి అవసరాల కోసం తిరువూరులో పెద్ద బావి తవ్వించాడు. అది ఇప్పటికీ దాసుగారి బావిగా పిలవబడుతూనే ఉన్నది. కేశవదాసు అనేక గ్రంథాలయాలకు పుస్తకాలు, బీరువాలు కొనిచ్చి ఎటువంటి ప్రచారానికి నోచుకోని గుప్తదాతగా మిగిలిపోయాడు.

నాటి స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై ఎన్నో దేశభక్తి పాటలు రచించి, రికార్డు చేయించి స్వాతంత్రోద్యమ సభలలో వినిపించేవాడు. ఆ ఉద్యమంలో తాను ప్రత్యక్షంగా పాల్గొన్నారు. నిష్కలంక దేశభక్తికి నిదర్శనం చందాల కేశవ దాసు. ఇలా కేశవదాసు శతకాలు, హరికథలు, నాటకాలు,పద్యాలు, దండకాలు,మంగళహారతులు, జోల పాటలు మొదలైన ప్రక్రియల్లో ఎన్నో రచనలు చేశారు. ఆయనకు ఆంధ్రసూత, నటనావతంస, కలియుగ దశరథ వంటి బిరుదులు కలవు. అలాగే నాటి నిజాం నిరంకుశ పాలనలో రజాకారుల అరాచకాలపై కేశవ దాసు నిరసన గళమెత్తారు. తత్ఫలితంగా రజాకార్ మూకలు ఆయన గ్రామంపై విరుచుకుపడి గ్రామంలోని ఇండ్లను ధ్వంసం చేసి, దోచుకోవడమే కాక ఆయన రచనలను నాశనం చేశారు. తత్కారణంగా చందాల కేశవదాసు అమూల్య రచనలు చాలా వరకు నేటి తరానికి అందుబాటులోకి లేకుండాపోయాయి. కొన్ని రచనలు నేటికీ ముద్రితం కాకుండా అలాగే ఉన్నాయి. వీటి గురించి సాహితీ సంస్థలు, ప్రభుత్వం కృషి చేసి రచనలను ముద్రింపజేసి తెలంగాణ సాహిత్యాన్ని పరిపుష్ఠం చేయడమే కాకుండా కేశవదాసు రచనలు భావితరాలకు అందేలా చర్యలు చేపట్టాలి.

కేశవదాసు సంస్కరణవాది. ఆయన ఏనాడు కుల వివక్షను పాటించలేదు. మనుషుల్లో హెచ్చుతగ్గులు కులాన్ని బట్టి కాదు వారి సంస్కారాన్ని బట్టి ఉంటాయని వాదించేవాడు. ఆధ్యాత్మిక చింతన, భగవత్ భక్తి, ప్రజాసేవలకు దీటైనవి ఏమీ లేవని భావించిన కేశవదాసు తన చివరి రోజుల్లో నాయకన్ గూడెం చేరి అక్కడ ప్రజలకు ఉచిత వైద్య సేవ చేశాడు. అక్కడే ఒక తపస్విలా జీవితాన్ని గడిపి 1956 మే 14న మరణించాడు.

(నేడు చందాల కేశవదాసు జయంతి)

సుధాకర్.ఏ.వి

అసోసియేట్ అధ్యక్షులు,STUTS

90006 74747

Advertisement

Next Story

Most Viewed