- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో తగ్గిన పేదలు!
ప్రాచీన కాలంలో ప్రజల పేదరికాన్ని గణించడంలో తిండి, ఇల్లు, బట్టలే ప్రధాన భూమిక పోషించాయి. కాలక్రమేణా మనిషి అవసరాలు పెరగడం వలన ఆధునిక సమాజంలో పేదరికాన్ని అంచనా వేయడంలో మరికొన్ని పరిశీలకాలను చేర్చవలసి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల పేదరికాన్ని లెక్కించడంలో 2010వ సంవత్సరం నుండి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ), ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ (ఓపీహెచ్‌ఐ) సంస్థలు సంయుక్తంగా పేదరిక సూచిక (గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్- ఎంపీఐ) నివేదికలను ప్రతీ సంవత్సరం విడుదల చేస్తున్నాయి. ఈ సంవత్సరానికి సంబంధించి జూలై 11వ తేదీన నివేదికను విడుదల చేశాయి.
10 సూచికలను ఆధారం చేసుకొని..
ఈ నివేదిక ప్రధానంగా ఒక కుటుంబం యొక్క ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలను కొలమానంగా తీసుకొని తయారుచేస్తారు. ఈ మూడింటిలో మరికొన్ని సూచికలు ఉన్నాయి. అవి ఆరోగ్య కొలమానంలో పిల్లల మరణాలు, పోషణ అనే రెండు సూచికలు, విద్యా కొలమానంలో పాఠశాల విద్యా సంవత్సరాలు, పాఠశాల హాజరు అనే రెండు సూచికలు, జీవన ప్రమాణ కొలమానంలో వంట చెరకు, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, గృహం, ఆస్తులు అనే ఆరు సూచికలతో.. మొత్తం 10 సూచికలను ఆధారంగా చేసుకొని కుటుంబం పేదరికాన్ని లెక్కిస్తారు. ఈ పది సూచికలలో మూడింట ఒక వంతు లేదా అంతకంటే ఎక్కువ కోల్పోయినట్లయితే వారు బహుమితీయంగా పేదవారీగా, ఓ సగం లేదా అంతకంటే ఎక్కువ సూచికలను కోల్పోయిన వారు తీవ్ర బహుమితీయ పేదరికంలో జీవిస్తున్నారని లెక్కిస్తారు.
ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న 110 దేశాలలో 92 శాతం అనగా 6.1 బిలియన్ల ప్రజల పేదరిక స్థితిగతులను గణించి నివేదికను విడుదల చేశారు. మొత్తం 6.1 బిలియన్ ప్రజల్లో 1.1 బిలియన్ల (18 శాతం) మంది తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారు. సబ్-సహారా, ఆఫ్రికా దేశాలలో 534 మిలియన్ల (47.8 శాతం) మంది దక్షిణాసియా దేశాలలో 389 మిలియన్లు (34.9 శాతం) మంది, తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంత దేశాలలో 106 మిలియన్లు (9.5 శాతం), అరబ్ దేశాలలో 53 మిలియన్లలు (4.7 శాతం), లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలలో 33 మిలియన్లు (4.7 శాతం), యూరప్, మధ్య ఆసియా దేశాలలో 2 మిలియన్ల (0.2 శాతం) మంది పేద ప్రజలు ఉన్నారు. ప్రతి ఆరుగురిలో ఐదుగురు పేదలు సబ్ సహారా ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలకు చెందినవారు ఉన్నారు. ఈ పేదలలో 387 మిలియన్ల మంది అల్ప ఆదాయ దేశాలకు, 730 మిలియన్ల మంది మధ్య ఆదాయ దేశాలలో ఉన్నారు. వీరిలో 566 మిలియన్లు మంది 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలే..!
మన దేశంలో పేదరికం
భారత్‌లో 84 శాతం మంది పేదలు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. 824 నుండి 991 మిలియన్లు మంది పేదలు తగినంత పారిశుధ్యం, వంటచెరకు లేకుండా జీవిస్తున్నారు. పేదరికం రేటు పిల్లలలో 27.7 శాతం, పెద్దలలో 13.4 శాతం ఉంది. భారతదేశంతో సహా 25 దేశాలు 15 సంవత్సరాలలో తమ గ్లోబల్ ఎంపీఐ విలువలను విజయవంతంగా సగానికి తగ్గించాయి. ఈ దేశాల్లో కంబోడియా, చైనా, కాంగో, హోండురాస్, ఇండియా, ఇండోనేషియా, మొరాకో, సెర్బియా, వియత్నాం ఉన్నాయి. అయితే, కోవిడ్-19 మహమ్మారి కాలంలో సమగ్ర డేటా లేకపోవడం తక్షణ అవకాశాలను అంచనా వేయడంలో సవాళ్లను కలిగిస్తుంది.
2005-06, 2019-21 మధ్య 415 మిలియన్ల మంది భారతీయులు పేదరికం నుండి బయటపడ్డారు. బహుమితీయ పేదలు, పోషకాహారం లేని వ్యక్తుల శాతం 2005- 2006లో 44.3% నుండి 2019- 2021లో 11.8%కి తగ్గింది. పిల్లల మరణాలు 4.5% నుండి 1.5%కి తగ్గాయి. తాగునీటి సూచికలో, బహుమితీయంగా పేదలు, వెనుకబడిన వారి శాతం ఈ కాలంలో 16.4 నుండి 2.7కి, విద్యుత్ (29 శాతం నుండి 2.1 శాతానికి), గృహనిర్మాణం 44.9 శాతం నుండి 13.6 శాతానికి పడిపోయింది. పేదరికం తగ్గుదల సమానంగా ఉంది. ప్రాంతాల సామాజిక-ఆర్థిక సమూహాలను తగ్గించింది. వెనుకబడిన కుల సమూహాలలో పిల్లలు, ప్రజలతో సహా పేద రాష్ట్రాలు, సమూహాలు అత్యంత వేగంగా సంపూర్ణ పురోగతిని కలిగి ఉన్నాయి. ఈ విధంగా మన దేశంలో పేదరికం తగ్గడానికి ప్రస్తుత కేంద్ర, సామాజిక అభివృద్ధి పథకాలు అయిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, గ్రామీణ కౌసల్య యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, మొదలైన కేంద్ర ప్రభుత్వ పథకాలు, వివిధ రాష్ట్రాలలో అమలు చేస్తున్న పేదరిక నిర్మూలనా పథకాలు అమలు చేయడం ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. ఈ సంవత్సరంలోనే మనదేశ జనాభా చైనాను అధిగమించినది. పేదరికం పెరగకుండా ఉండాలంటే మన ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. 2030 నాటికి ప్రతిచోటా పేదరికాన్ని అన్ని రకాలుగా అంతం చేయాలని నివేదికలో తెలిపారు. పేదరికం పెరగకుండా మనమందరం కలిసి కృషి చేసి , వచ్చే నివేదికలో ఇప్పటి కంటే మరింత పేదరికం తగ్గుతుందని ఆశిద్దాం.
డి జె మోహన రావు
94404 85824