మరో ప్రీతి బలి కావద్దు!

by Ravi |   ( Updated:2023-03-09 19:00:37.0  )
మరో ప్రీతి బలి కావద్దు!
X

లలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని కలాం గారు అన్నట్లు... సమాజంలో అన్ని వృత్తుల కన్నా గొప్పదైన వృత్తి, ప్రాణాలను నిలబెట్టే వృత్తి. అది అందరి చేత గౌరవింపబడే హోదా కలిగినది. ఎంతో ఓర్పు సహనంతో కష్టపడితేనే ఆ స్థాయికి చేరుకునేది, అహోరాత్రులు కష్టపడి పోటీ పరీక్షలలో నెగ్గి వైద్యవిద్యలో చేరి విజయవంతంగా కోర్సు పూర్తి చేసి వైద్యం అందించి సమాజ సేవలో నిమగ్నమై ఉత్తమ వైద్యులుగా మన్ననలు పొందాల్సిన వారు, కీర్తింపబడాల్సిన వారు ఈ మధ్యకాలంలో కీర్తిశేషులు అవుతుండటం అత్యంత బాధాకరం. ఇది సమాజ ప్రగతికి విఘాతం. కన్న తల్లిదండ్రులకు తీరని లోటు.

ఆచరణలో అమలు చేయనందునే

కష్టపడి వైద్యవిద్యను తీసుకొని కోర్సు పూర్తి కావస్తున్న తరుణంలో రేపోమాపో సమాజంలోకి అడుగుపెట్టి డాక్టర్‌గా సేవలందిస్తుంటే చూసి మురిసిపోవాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలను ఆడియాసలుగా చేసి జీవితాంతం కుమిలిపోయేలా తీరని ఆవేదనను బాధను మిగుల్చుతున్నారు. చిన్న చిన్న కారణాలకు, వేధింపులకు, అధిక పనిఒత్తిడి, ప్రేమ వ్యవహారం, విధి నిర్వహణలో తెలిసో తెలియకో తప్పిదానికో, ఇలా ఏదో ఒక కారణంతో క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడటం తీవ్ర అభ్యంతరకరం. సమాజ ప్రగతికి నిరోధం. ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకోవచ్చు. పరిష్కారం లేని సమస్య ఉండదు. అది గ్రహించక, తమకు ఎవరూ లేరని కన్న తల్లిదండ్రులను మరిచి జీవితాన్ని ముగిస్తుండటం ఆందోళనకరం. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 119 మంది మెడికల్ స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు. అందులో ఎంబీబీఎస్ వారు 64, పీజీ చదివేవారు 55 మంది. ఈ వృత్తివారే కాకుండా ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక కాలేజీల్లో కోర్సులు చదువుతున్న వారు కూడా అర్ధాంతరంగా తనవు ముగిస్తున్నారు. అయితే వీరంతా చదువులో చురుగ్గా ఉండి, తెలివైన వారు కావడం ఆశ్చర్యకరం. ఇది భావి సమాజానికి తీవ్ర నష్టదాయకం. వారి మేధస్సును తెలివిని ఉపయోగించి సమాజ ప్రగతికి దోహదపడాలే కానీ వారు మధ్యలోనే ఆత్మహత్యలకు పాల్పడుతుండటం వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికంగా ఎంతో నష్టం. ఒక డాక్టర్‌గా సమాజంలోకి రావాలంటే 20 సంవత్సరాల అవిరల కృషి, పట్టుదల, లక్షలాది రూపాయల ఖర్చు, తల్లిదండ్రుల శ్రమ, విద్యార్థి శ్రమ వంటి అంశాలు ఎన్నో నిగూఢంగా దాగి ఉంటాయి. వాటిన్నింటిని అధిగమించి చివరి దశలో గమ్యం చేరుకునే సమయాన ఆత్మహత్య చేసుకోవడం మిక్కిలి బాధాకరం.

ర్యాగింగ్ పేరిట ఆధిపత్యం

ఈ పూడ్చలేని నష్టాలకు కారణం ఎవరు? వారి మానసిక స్థితినా వారి తల్లిదండ్రులా? కాలేజీ వ్యవస్థా? విద్యార్థులా? ప్రభుత్వ విధానమా? అంటే అందులో అందరి భాగస్వామ్యం ఉంటుంది. ప్రతీ వ్యవస్థ వైఫల్యం చెందుతుంది. కానీ ఆ వైఫల్యంతో పాఠాలు నేర్చుకుని మరోసారి ఆ సంఘటన జరగకుండా చూడాలి కానీ వాటిని పట్టించుకోకుండా ఉండకూడదు. ప్రీతి సంఘటన జరిగినప్పుడు అలా చేయాలి ఇలా చేయాలి అని అనుకోవడం తప్పా అది ఆచరణలో అమలు పెట్టకపోవడం వలనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. విద్యలో సీనియర్, జూనియర్ల పరిచయం కాస్తా విష సంస్కృతిగా మారి నేడు ర్యాగింగ్ పేరుతో ఆధిపత్య ధోరణి ప్రవర్తించడం వలన ఆ బలవన్మరణాలకు దారి తీయడం అభ్యంతరకరం. దీనికి కులం, ప్రేమ, ప్రాంతం రిజర్వేషన్ల వంటి అంశాలు ప్రవేశించి అగ్నికి ఆజ్యం పోసి పెద్దవిగా చేస్తారు.

అసమ సమాజంలో అన్నీ అంతరాలే

అలాగే విద్యార్థులకు, ముఖ్యంగా వైద్య విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా, మానసికంగా కృంగిపోకుండా ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేస్తూ నైతిక మద్దతు స్వాంతన ధైర్యం అందించాలి. వారికి ఏ చిన్న సమస్య వ్యక్తం చేసినా, వెంటనే స్పందించి తగిన చర్య తీసుకోవాలి. నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం వలనే అమూల్యమైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అందరూ సమస్యను ఒకేలాగా స్వీకరించరు. కొందరు ధైర్యంతో ఎంత దూరమైన వెళ్లి ఎదుర్కోవడానికి సిద్ధపడితే, మరికొందరు ప్రతి చిన్న విషయానికి ఆందోళనకు గురవుతారు. వారి మానసిక స్థితిని బట్టి నడుచుకుంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఏ విషయాన్ని అయినా ఒంటరిగా మందలించిన పెద్దగా పట్టించుకోరు, కానీ 10 మందిలో మందలిస్తే హేళనగా భావించి ఆత్మనూన్యత భావానికి లోనవుతారు. విద్యార్థి మూలాలు వెతికి హేళనగా మాట్లాడటంతోనే సమస్య జటిలమవుతుంది. కళాశాలలో ఇటువంటి సంఘటన జరగడం ఆ విద్యార్థులకు, బోధన సిబ్బందికి మాయని మచ్చగా మిగిలిపోతుంది.

వారానికి 36 గంటల నైట్ డ్యూటీలే

డాక్టర్లు మందులిచ్చి రోగికి నయం చేయడమే కాదు, మంచి కౌన్సిలర్లు కూడా.. వారి మాటల ద్వారానే రోగికి సగం నయమవుతుంది. అలాంటివారు తోటి వారి పట్ల కఠినంగా మాట్లాడటం పరుష పదజాలం వాడటం తగదు. ప్రభుత్వాలు విధానపరంగా కల్పించవలసిన వసతులు, సౌకర్యాలు కల్పించకపోవడంతో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. తీవ్రమైన పని ఒత్తిడి మూలంగా వైద్య విద్యార్థులు కలత చెందుతున్నారు. జాతీయ వైద్య మండలి ప్రకారం మెడికల్ పీజీ విద్యార్థులు వారానికి 48 గంటల పని చేయాల్సి ఉండగా ఏకధాటిగా వారానికి రెండు సార్లు 36 గంటల నైట్ డ్యూటీ, నెలకు 8 నుండి 10 సార్లు చేయడం జరుగుతుంది. అక్కడ విధులు నిర్వహించే క్రమంలో ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవు. దీంతో మహిళా డాక్టర్ల పరిస్థితి చెప్పనలవి కాదు. రాష్ట్రవ్యాప్తంగా బోధన ఆసుపత్రులలో1000 పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నందున, ఆ పని భారం తమపై పడటం మూలంగా మెడికోలు తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్నారు. వీరి పని ఒత్తిడి పీజీ విద్యార్థులపై పడి వారు మానసికంగా కుంగిపోతున్నారు. అందుకే ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయాలి. సీనియర్లు ఏదైనా అంటే కూడా మెడికోలు అతిగా బాధ పడకుండా ధైర్యంగా పోరాడాలి తప్ప ప్రాణాలు తీసుకోవడం మంచిది కాదు. అసమ సమాజంలో అంతరాలు ఎన్నో ఉన్నాయి. అంతరాల దొంతరాలలో ఎన్నో రకాల మానవ మనస్తత్వాలు గల సమూహాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకొని తమకు అనుకూలంగా మలుచుకుని, సర్దుబాటు చేసుకుని జీవితాన్ని కొనసాగించాలి. సమస్యలు లేని జీవితం ఉండదు. సమస్యలతో పోరాడడమే జీవితం. ప్రాణాలు కాపాడే డాక్టర్లు ప్రాణాలు తీసుకోవద్దు. మరో ప్రీతి బలి కావద్దు. ఈ సంఘటనను గుణపాఠంగా తీసుకొని వైద్య విద్యార్థులను రక్షించుకునే వ్యవస్థను రూపొందించుకోవాలి.

తండ సదానందం

99895 84665

Advertisement

Next Story

Most Viewed