ప్రీతిది సమాజం చేసిన హత్య

by Ravi |   ( Updated:2023-03-02 19:00:52.0  )
ప్రీతిది సమాజం చేసిన హత్య
X

వారం రోజులుగా ఎక్కడ చూసినా ఒకటే చర్చ. పాపం ప్రీతి అన్యాయంగా బలైంది. ఇంట్లో, ఆఫీసులో, బస్టాండుల్లో ఎక్కడ ఉన్నా అందరి నోట ఇదే ఇష్యూ. రోజూ పదుల సంఖ్యలో ఆత్మహత్యలు జరుగుతున్నా.. తన తప్పు లేకున్నా ఓ మెడిసిన్​ పీజీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేయడం అందరినీ కలచివేసింది. నిజానికి కోటి మంది విద్యార్థుల్లో లక్ష మంది మెరిట్​ విద్యార్థులు ఉంటే అందులో కేవలం వేలమందికే మెడిసిన్​ సీటు వస్తుంది. ఆ సీటు సాధించడమే నిజంగా ఓ పెద్ద అచీవ్‌మెంట్. అలాంటి కళాశాలల్లో కూడా ర్యాగింగ్ ​లాంటి వ్యవహారాలతో విద్యార్థులు ప్రాణాలు తీసుకునే పరిస్థితికి దిగజారడం అత్యంత దారుణం.

చాపకింద నీరులా బాసిజం..

వైద్య కళాశాలల్లో బాసిజం నిలువునా పాతుకుపోయింది. సీనియర్లందరినీ జూనియర్లు సార్​అని పిలవాల్సిందే. వాళ్లు ఎక్కడ కనిపించినా విష్​చేయాల్సిందే. వాళ్లని దాటుకుని వెళ్లడం.. క్యాంటీన్‌లో సీనియర్లు భోజనం చేస్తుండగా అందులోకి వెళ్లడం అత్యంత కఠినమైన నేరంగా భావిస్తారు. పైగా సీనియర్లు ఎవరూ నోట్స్​రాయరు. తమకు నచ్చిన జూనియర్‌ని పిలిచి నోట్స్ రాయిస్తారు. ఓ వైపు అప్పుడే కొత్తగా కాలేజీకి వెళ్లిన జూనియర్లు తమ క్లాసులపై ఫోకస్​పెట్టాల్సిన సమయంలో సీనియర్లు రాత్రికి రాత్రికి నోట్స్ పూర్తి చేయమని బెదిరించడంతో చాలామంది విద్యార్థులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొని సున్నిత మనస్కులు చదువులో వెనకబడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే వైద్య కళాశాలల్లో హాస్టల్ విద్యార్థులే ప్రధానంగా ర్యాగింగ్‌కు గురవుతుంటారు. రాత్రిళ్లు వాచ్మెన్లను పెట్టినా వారు ఒకటి రెండు రౌండ్లు వేసి డ్యూటీ ముగించేస్తున్నారు. మరోవైపు సీనియర్లను ఎదిరిస్తే తమ ఉద్యోగాలు పోతాయేమోనని భయం ఉంటుంది. దీనిని ఆసరాగా తీసుకొని జూనియర్ల గదులలోకి వెళ్ళి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు కాలేజీలు మినహా అంతటా ఇదే పరిస్థితి ఉంది.

హెచ్‌వోడీలకూ పరిమితులు

ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులపై ఆంక్షలు విధించడం, వారిపై ఆంక్షలు పెడితే మేధోమథనం చేయించలేమని చాలామంది అధ్యాపకుల అభిప్రాయం. ఈ అంశంలో ముఖ్యంగా హెచ్‌వోడీలు కత్తిమీద సాము చేస్తుంటారు. గ్రూప్​ డిస్కషన్స్​, సీనియర్లతో ఇంటరాక్షన్స్ ​ఇవన్నీ విద్యాబోధనకు అదనపు విలువలు జోడిస్తాయనేది అధ్యాపకులందరిలో ఏకాభిప్రాయం ఉన్నది. కానీ, ఎవరి మానసిక స్థితి ఎలా ఉన్నది.. అనుకున్న ప్రయోజనాలు నెరవేరుతున్నాయా లేదా.. దారి తప్పుతున్న విద్యార్థులను దారిలోకి తెచ్చే ప్రయత్నాలు ఎంతమంది చేస్తున్నారు అన్న ప్రశ్నకు మాత్రం ఎవరూ సమాధానం చెప్పే సాహసం చేయడం లేదు. ఈ సన్నటి రేఖ కారణంగానే ప్రీతి లాంటి సున్నిత మనస్కులు ప్రాణాలు తీసుకుంటున్నారు. విద్యార్థుల మానసిక స్థితిని అంచనా వేయడంలో అధ్యాపకులు విఫలం కారణంగానే ఇలాంటి సమస్యలు విద్యా వ్యవస్థకు రాచపుండులా మారాయి.

అందరూ హై ప్రొఫైల్సే..

వీధి బడిలో అడ్మిషన్ కోసమే చోటామోటా లీడర్ల వద్దకు తల్లిదండ్రులు క్యూ కడుతుంటే.. ఇక మెడిసిన్​ లాంటి సీట్లకోసం ఏ స్థాయిలో నాయకుల జోక్యం ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. దీంతో సహజంగా ఏ విషయంలోనైనా విద్యార్థులపైనా వారి ప్రభావం ఎంతో కొంత ఉండకమానదు. అది కూడా అధ్యాపకులు, ర్యాగింగ్​ ఫిర్యాదులపై పోలీసులపైనా ఒత్తిడి పెంచుతున్నది. దీంతో యాంటీ ర్యాగింగ్ ​కమిటీలు నిరుపయోగంగా మారుతున్నాయి.

తల్లిదండ్రులకు చెప్పుకోలేక

తమ చదువులకు తల్లిదండ్రులు పడుతున్న కష్టం చూస్తున్న విద్యార్థులు వారికి తమ ఇబ్బందులు మరో సమస్య కాకూడదని తమలో తాము కుమిలిపోతున్నారు. కౌమరదశలో ఈ విద్యార్థులు తమ సమస్యలను తాము పరిష్కరించుకోలేక అటు తల్లిదండ్రులతో విషయాలను పంచుకోలేక విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనివల్ల అటు తమ భవిష్యత్తును నాశనం చేసుకోవడంతోపాటు తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చుతున్నారు.

ఇది సమాజం చేసిన హత్య

కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టు సమాజానికి రెండు నాల్కల ధోరణి ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు విషయం మూలాలకు వెళ్లకుండా పైపై పరిష్కారాలకు డిమాండ్లు చేస్తుంది. ఫలితంగా సమస్యకు అసలైన పరిష్కారం ఎప్పటికీ అందకపోతే విపరీత ధోరణులకు కారణమవుతుంది. ఇప్పుడు ప్రీతి విషయంలో చర్చించాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. అసలు ప్రీతికి- సైఫ్‌కి మధ్య ఏ విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ అంశం కాలేజీ వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు ఎందుకు చొరవ తీసుకోలేదు. సీనియర్లు, జూనియర్లకు మధ్య నడుస్తున్న బాసిజాన్ని ఎందుకు నియంత్రించలేదు? యాంటీ ర్యాంగింగ్​ కమిటీలు కళాశాలలో నిర్వహిస్తున్న పాత్ర ఎంత? రిజర్వేషన్​ అంశంపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నా సైఫ్​ బృందంపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇంకా మరెన్నో ప్రీతి మరణానికి అసలు కారణాలు. నిజానికి ఈ ఘటన సామాజిక జీవన ప్రమాణాల సైద్ధాంతిక వైఫల్యంగా చెప్పవచ్చు. సమాజానికి సేవ చేయాల్సిన వైద్యుల ఎంపికకు ప్రవర్తనా నియమావళి కూడా ఒక ముఖ్యమైన పాఠ్యాంశంగా మార్చాలన్న అవసరాన్ని గుర్తు చేస్తున్నది. కేవలం వాహనం నడిపేందుకు లైసెన్స్​ లేకపోవడమూ, ఇతరులకు ఇబ్బందులకు గురి చేసేలా వాహనాన్ని నడిపినందుకు డ్రైవింగ్​ లైసెన్స్​రద్దు చేసే ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఈవ్​టీజింగ్​లాంటి వ్యవహారాలను మాత్రం తేలిగ్గా తీసుకుంటున్నది. ర్యాగింగ్​ చేసినట్టు తేలితే సదరు విద్యార్థిని ఒక సంవత్సరం సస్పెండ్​ చేయడం, పద్ధతి మార్చుకోకపోతే రెస్టిగేషన్​వంటి తీవ్ర చర్యలు తక్షణమే అమలు చేయాలి. లేకపోతే ప్రీతి లాంటి మరెందరో బంగారు తల్లులు బలిపీఠం ఎక్కాల్సిన దుస్థితి దాపురిస్తుంది.

ఎస్.పీ హరీష్

95059 15550

Advertisement

Next Story

Most Viewed