- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేటి భారతంలో.. లోపల కంపు.. వెలుపల సొంపు!
బుద్దుడు పుట్టిన దేశంలో బుద్ధుని చిత్రాలు గీయడానికి ప్రపంచ కళాకారులు పోటీ పడడం భారతీయులకు గర్వకారణమే. అతిథులుగా వచ్చిన విదేశీ రాజులను, రాణీలను, ప్రధాన మంత్రులను, ప్రెసిడెంట్‌లను సన్మానించి గౌరవపూర్వకంగా వారికి బుద్దుని చిత్రాలను గిఫ్ట్‌గా ఇచ్చి ఆనందింప చేస్తున్నాం. ముక్కోటి దేవతల విగ్రహాలు ఎందుకు ఇవ్వడం లేదు. వారి దృష్టిలో అవి చెల్లని నాణేలు. ‘యదార్థ వాది లోక విరోధి’ అన్నట్లుగానే ఉంటుంది.
లోపల కంపు.. వెలుపల సొంపు!
నిజానికి బుద్దుడు భారత దేశ ఐకాన్‌గా గుర్తించబడ్డాడు. ఇది గమనించదగిన విషయం. కానీ ఆయన బోధనలకు మణిపూర్‌లో నిప్పు అంటించారు. రాజ్యాంగాన్ని శిలువ వేస్తున్నారు. క్రిస్టియన్ హిందువుల మధ్య చిచ్చు రగిలించారు. జాతీయత రెండుగా చీలింది. సమస్యలను పరిష్కరించవలసిన ప్రభుత్వాలే హింసకు పూనుకోవడం గర్హించదగిన విషయం. మతానితో ముడి పెట్టి మానవీయ విలువలు మంట గలుపుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పేకమేడలా కూలిపోక తప్పదు. జాతీయ చిహ్నంగా నిలిచిన అశోక ధర్మచక్రం ‘సత్యమేవ జయతే’ అని చాటి చెబుతుంటే పాలకులు మాత్రం ‘అవినీతేవ జయితే’ అనే స్లోగన్‌ను ఆచరణలో పెట్టడానికి నడుం బిగించారు. అక్షరాస్యతతో విజ్ఞాన సృహ పెరిగినప్పుడే, అవినీతి అంతం చేయవచ్చు, మూఢనమ్మకాలను తరిమికొట్టొచ్చు. ఓటు ఆయుధాన్ని సరైన రీతిలో వాడుకోకుంటే ‘తోడేలును గొఱ్ఱెల మందలకు కాపలా పెట్టినట్లే’ ఉంటుంది.
హైటెక్ అభివృద్ధి జాబిల్లిని చుంబించి సృష్టి రహస్యాలను చేధిస్తుంటే మీసం మెలేసి మేమే గొప్ప అని భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నారు పాలకులు. ఇస్రో శాస్త్రవేత్తల కడుపులు కాల్చుతున్న మోడీ తీరు ‘లోపల కంపు వెలుపల సొంపు’ అన్న చందంగా ఉంది. ఈ విషయం సోషల్ మీడియా కోడై కూస్తుంటే ప్రభుత్వానికి సోయి, సిగ్గు ఉందా? చట్టాలు చుట్టాలు అయినప్పుడు, ఆచరణలో అసలే లేనప్పుడు రాష్ట్రపతి ఆమోదముద్ర ఎన్నింటికి వేస్తే మాత్రం ఏమి లాభం! ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. చట్టసభల్లో మహిళలకు అవమానాలు తప్పడం లేదు, సామూహిక హత్యాచారాలు ఆగడం లేదు. దేశంలో రేప్‌లు మానడం లేదు. స్త్రీలను దేవతలుగా ఆరాధించాలనే సంస్కృతి ఎక్కడ ఉంది. ఇప్పటికీ వారిని ఆట వస్తువుగానే చూడడం శోచనీయం.
పరిపాలన దక్షత లేని ప్రభుత్వాలు..
సంస్కృత వేద శ్లోకాలు, గాయత్రి మంత్రాలు గ్రంథాలలో బంధించబడి సమాజానికి ఉపయోగం లేకుండా ఉన్నాయి. వాటిని వల్లె వేస్తూ వ్యాపారం చేసే వారి సంఖ్య చికెన్ మటన్ షాపుల్లా వేగాన్ని పుంజుకుంటున్నాయి. చదువుకున్న మృగాలే సృష్టిస్తున్న ఘోరాలు మానవీయ విలువలు మచ్చుకైనా కానరావు. మనుషుల్లో మార్పు రావాలి! అరబ్ కంట్రీ లో అమలుపరిచే కఠినమైన చట్టాలు రావాలి. మానవత్వం పరిమళించే దిశగా అడుగులు వేయాలి. రాజ్యాంగం నవ్వులపాలు కావద్దు. సుపరిపాలన కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకోవాలి. ఆదాయానికి మించి ఖర్చు పెట్టి ఖజానా ఖాళీ చేసి అడ్డగోలుగా అప్పులు చేయడం కాదు. పన్నుల మీద పన్నులు వేసి ప్రజల నడ్డి విరిచడం సరైంది కాదు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడమే ఆర్థిక మాంద్యానికి కారణం! ప్రతి రాష్ట్రంలో ఇదే తంతు జరుగుతోంది. ఆ విషయం నిపుణులకు తెలియదా? సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం బాగా తెలుసు ప్రజలను మోసం చేయడం రాజకీయ చాతుర్యం. దారిద్ర్యానికి దిగువ రేఖలో ఉన్నవారందరికీ సంక్షేమ ఫలాలు అందని ద్రాక్షపళ్ళు అయినాయి. వేలాది కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతోంది. లక్షల కోట్లకు లెక్కలు లేవు. ఆడిట్ అంతకన్నా లేదు. పరిపాలన దక్షత లేని ప్రభుత్వాలు ఎందుకు? నిపుణులు ప్రభుత్వ సలహాదారులు చేసే పనేంటి? విలాసాలు అనుభవించదానికేనా! నిరంకుశ పాలనకు గంగిరెద్దులా తలలు ఊపితే ఆశించిన ఫలితాలు రమ్మంటే మాత్రం ఎలా వస్తాయి?
ఎంత సేపు అధికారం కోసం పాకులాడే వారే తప్ప ఏనాడు కూడా ప్రజా క్షేమం గురించి ఆరాటం లేదు, పోరాటం అంతకన్నా లేదు! ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం తప్ప. దేశ సంపద కుబేరుల చేతికే పోతుంది. ఆకలి చావుల సంఖ్య ఆన్‌లైన్ అమ్మకాలలా పెరుగుతోంది. భిన్నత్వంలో ఏకత్వం చెప్పే తెలంగాణ తత్వం కుల భవనాలలో ఉందా? ప్రార్థనా మందిరాలలో ఏకత్వం ఎక్కడుంది? మన్ కి బాత్‌లో అగుపడదే! ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ప్రజల ఉసురు పోసుకుని ఊపిరులు తీస్తున్నారు. కాయ పండై నేల రాలినట్లు పాలకులను తరిమికొట్టే రోజులు దగ్గర పడుతున్నాయి. శ్రీలంకలో జరిగిన తిరుగుబాటు తప్పదేమో అనిపిస్తుంది. ఊసరవెల్లిలా పార్టీలు మార్చి దొంగలే కలిసి దొంగా దొంగా అని అరచినట్లు గానే ఉంది. ఆకును నలిస్తే గాని దాని వాసన తెలియదు. ప్రజలు కళ్ళు తెరచి ఓటును సద్వినియోగం చేసుకొని నీతి నిజాయితీ గల సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలి. ప్రజాస్వామ్యం చిగురులు తోడుగాలి. మానవీయ విలువలు వికసించాలి. శాస్త్రీయ దృక్పథంతో మనిషి మనిషిగా బతకాలి. అసలే చిన్నది జీవితం మరింత చిన్నదిగా చేసుకోవద్దు. ఆ దిశగా అందరం కలిసి అడుగులు వేద్దాం. కన్న తల్లి కన్నీరు తుడిచి రాజ్యాంగ పీఠంపై కూర్చుండ బెట్టి రక్షణ కవచాలు నిలుద్దాం. అప్పుడే వేడుకలు చేసుకుందాం. ఆ శుభ దినాలు వస్తాయని ఆశిద్దాం.
పూసాల సత్యనారాయణ
హైదరాబాద్
90007 92400