రైల్వే సౌకర్యాలు పెరిగేనా..?

by Ravi |   ( Updated:2024-05-15 00:30:25.0  )
రైల్వే సౌకర్యాలు పెరిగేనా..?
X

రైలులో ప్రయాణించాలంటే స్వల్ప దూర ప్రయాణాలకు సాధారణ టికెట్, దూరప్రాంత ప్రయాణాలకు సాధారణ లేదా ముందస్తు రిజర్వేషన్ ద్వారా టికెట్లను పొందాలి. అయితే ఈ టికెట్ కొనుగోలు నుండి గమ్యం చేరే వరకు సాధారణ ప్రయాణికులు చాలా అవస్థలు పడుతున్నారు. స్టేషన్ కౌంటర్ దగ్గర నుండి ప్రయాణికుల పాట్లు మొదలవుతాయి. స్టేషన్లో సరిపోయినన్ని కౌంటర్లు ఉండవు. దీంతో ఒక్కొసారి టికెట్ తీసుకునే లోపే ట్రైన్ వచ్చి వెళ్ళిపోతుంది. మహిళల, వృద్ధుల పరిస్థితి చెప్పనలవి కాదు. కొన్నిసార్లు రైలు వచ్చే వరకూ ప్లాట్‌ఫారమ్ నంబర్ తెలియపరచరు. కొద్దిసేపు ముందు మాత్రమే అనౌన్స్ చేయడంతో సకాలంలో బోగీ అందుకోని కారణంగా బండి తప్పిపోయిన వారెందరో ఉంటారు.

నాలుగు బోగీలు సరిపోతాయా?

ఇక రైల్వే స్టేషన్‌లో సౌకర్యాల లేమికి కొదువుండదు. కొన్ని స్టేషన్లలో తాగునీరు ఉండదు. ఆకలేస్తే తినడానికి ఏది కొందామన్నా.. ధర ఎక్కువ. పైగా పులిసిపోయిన, పాచిపోయిన ఆహార పొట్లాల నాణ్యతను చూసే వీలు లేకుండా అందమైన ప్యాకెట్లలో విక్రయిస్తారు. ఇలాంటి వారి మీద ఫిర్యాదు ఎవరికి చేయాలో తెలియదు. అయినా అంత తీరుబాటు ఎవరికి ఉంటుంది? స్టేషన్లలో ఉచిత మూత్రశాలల ఉండవు. ఉన్నా అవి ఎంతో అపరిశుభ్రంగా ఉంటాయి. అందుకే చాలా మంది బహిరంగ మల మూత్ర విసర్జన చేస్తుండటంతో.. రైల్వే పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. ఇక సాధారణ బోగీలలోనైతే పరిస్థితులు అస్తవ్యస్తం. ఈ బోగీలు ఇంచుమించుగా రైలింజన్ తరువాత రెండు, చివర్లో రెండు ఉంటాయి. ప్రతి స్టేషన్‌లో పరిమితికి మించి ఈ సాధారణ టికెట్స్ విక్రయిస్తారు. అంతమంది ప్రయాణికులకు ఈ నాలుగు బోగీలు సరిపోతాయా..? వీళ్లందరూ ఈ పరిమిత బోగీల్లో సర్దుకోవాల్సిందే! పైగా రైలు ఆగిన రెండు నిమిషాల్లోనే పరుగు పరుగున వీటిల్లోకి ఎక్కాల్సిందే. కొన్ని రైళ్లల్లో జనరల్ కోచ్ లోపల కనీసం కాలు కదపడానికి కూడా వీలు కాదు. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఇబ్బందికరంగా ప్రయాణం చేయాల్సిందే! రాత్రి వేళయితే బాధలు చెప్పనవసరం లేదు.

ఫిర్యాదు చేయడం తెలియక..

ఇక రైల్వే వారు రిజర్వేషన్ టికెట్స్ 120 రోజుల ముందుగా విడుదల చేస్తున్నారు. అన్ని రోజుల ముందే ప్రయాణాన్ని ఎంతమంది ప్లాన్ చేసుకుంటారు. ముందుగానే టికెట్ ధర చెల్లించడం వలన రైల్వేశాఖ దగ్గర పెద్ద మొత్తంలో టికెట్ అమౌంట్ నిలువ ఉండడం వలన ఆ శాఖకు వడ్డీ బాగానే వస్తుంది. కానీ సామాన్యుల అంత పెద్ద మొత్తంలో ముందుగానే మదుపు పెట్టాలంటే కష్టం. ఒక్కొసారి క్యాన్సిల్ చేయాలంటే కాన్సిలేషన్ ఛార్జీలు ఎక్కువే..! రద్దు చేసిన టికెట్స్ వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి ఎలానూ కేటాయిస్తారు కదా! మరి ఎందుకు రద్దు చార్జీలు వసూలు చేయాలి?

ఇక ప్రతి రైలులో సామాన్యులు ఎక్కువగా ప్రయాణించే ద్వితీయ శ్రేణి బోగీల సంఖ్య తక్కువగా, ఏసీ బోగీల సంఖ్య ఎక్కువగా ఉంటున్నాయి. ఏసీ ప్రయాణికులకైతే టికెట్ ధర ఎక్కువే కానీ సౌకర్యాలు తక్కువ. ఏసీలో రగ్గులు, దుప్పట్ల వాసన బాగోదు.. అడుగుదాం అంటే అటెండెంట్ భాష మనకి రాదు. మన భాష వారికి అర్థం కాదు. అక్కడ ప్రాంతీయ భాషలో మాట్లాడే వారుండరు. ఇలా ఎన్నో సమస్యలపై ఫిర్యాదు చేద్దామని 139 నంబర్‌కి ఫోన్ చేస్తే లైన్ కలవదు. కలిసినా రకరకాల ఆప్షన్స్ అడుగుతుంది. అది దాటి వెళ్తే చివరికి మనకు తెలియని భాషలో అవతలి వారు మాట్లాడుతారు. అందరికీ హిందీ, ఇంగ్లీష్ రాదు కదా..! ఆన్ లైన్‌లో ఫిర్యాదు చేయొచ్చని ఎంతమందికి తెలుసు?

పరిష్కారాలు

అందుకే రైల్వే అధికారులు ఒక్కొక్కటిగా ప్రయాణికుల సమస్యలు తీర్చాలి. ముందుగా వేళకు ట్రైన్ వచ్చేటట్లు చూడాలి. టికెట్స్ కొనుగోలుకు సరిపడినన్ని ఆఫ్‌లైన్ కౌంటర్స్ ఏర్పాటుచేయాలి. జనరల్ బోగీల సంఖ్య పెంచాలి. పరిశుభ్రమైన ఉచిత మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలి. ఆహార ధరలు, నాణ్యతపై నియంత్రణ ఉండాలి. సాధారణ టికెట్ తీసుకున్న వారికి ఉన్నత శ్రేణి కోచ్‌లలో ప్రవేశాన్ని నిషేధించాలి. లగేజీ, సెల్ ఫోన్లు దొంగిలించే వారి నుండి ప్రయాణీకులను రక్షించాలి. ముందస్తు రిజర్వేషన్ 120 రోజుల నుండి 30 రోజులకు తగ్గించాలి. రిజర్వేషన్ చేసేటప్పుడు తక్కువ ధర వసూలు చేసి ప్రయాణ తేదీకి 10 రోజుల ముందు టికెట్ ధర మొత్తం చెల్లించే విధానాన్ని తీసుకురావాలి. తత్కాల్ టికెట్ల సంఖ్య పరిమితం చేయాలి. రిజర్వేషన్ టికెట్ రద్దు చార్జీలు తగ్గించాలి. ఐసిఎఫ్ బోగీల స్థానంలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ప్రవేశపెట్టేందుకు అధికారులు దృష్టి పెట్టాలి.

-డి జె మోహన రావు

82470 45230

Advertisement

Next Story

Most Viewed