- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సత్యాన్వేషణలో రాహుల్ గాంధీ!
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకై ఎంతో శ్రమించినప్పటికి ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా రాకపోవడంపై అధ్యయనం చేసిన రాహుల్ గాంధీకి బలమైన సైద్ధాంతిక భూమిక అవసరమన్న విషయం బోధపడింది. అందుకే అప్పటి నుండి అంబేద్కర్ ఇజం, మార్క్సిజం, బుద్దిజంపై అవగాహన పెంచుకున్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాటిని ప్రజల్లో ఆచరణలో పెట్టడం ప్రారంభించాడు. అందులో భాగమే భారత్ జోడో యాత్ర.
ఈ ఎన్నికల కోసం రాహుల్ గాంధీ.. ప్రగతిశీల, సామ్యవాద, సిద్ధాంతాల భూమికతో పార్టీని నిర్మాణం చేయాలన్న దృక్పథంతో ముందుకు వెళ్లారు. బీజేపీ హిందుత్వ సిద్ధాంతానికి దేశీయ కోణంలో విరుగుడు కనిపెట్టే పనిలో రాహుల్ గాంధీ రహస్య విప్లవ నిర్మాణానికై అన్వేషణ మొదలు పెట్టాడు. ఈ అన్వేషణ విజయాన్ని ముద్దాడే రోజు ఈ దేశం నూతన రాజకీయ అధ్యాయంలోకి అడుగుపెడుతుంది.
వామపక్ష భావం బలంగా ఉన్నా..
ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని నిలబడటం ఆచరించడం, నిర్మాణం చేయడం అనేది మామూలు విషయం కాదు. భారత సమాజంలో భావజాల ధార అనేది ప్రజలని ప్రభావితం చేసే ప్రధానమైన అంశం. ఇప్పటి ఆధునిక కాలమే కాదు అనాది కాలం నుండి అనేక తర్కల మధ్య ఘర్షణ, చర్చ అనేది చూస్తూనే ఉన్నాం. సనాతన, బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, గాణపత్య, శాక్తేయ, ఇలా శాకోపశాకలుగా అనేక భావజాల జీవదారాలు ఈ నేలను సుసంపన్నం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆధునిక నాగరిక సమాజంలో అనేక రాజకీయ పార్టీలు తన విచారధారను ప్రజల ముందు ఉంచుతున్నాయి. దేశ స్వాతంత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దేశభక్తి, ప్రగతిశీల లౌకిక వాదాన్ని తన సిద్ధాంతాలుగా ప్రజల ముందు పెట్టింది. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా వామపక్ష వాదం బలంగా ఉండటం. అనేక దేశాలు కమ్యూనిజాన్ని ఆశ్రయించడం.. చైనా, రష్యా, యూరప్ అంత వామపక్ష భావజాలంలోకి వెళ్లడంతో సహజంగానే ఆ ప్రభావం భారత్ పైన పడింది. కానీ మనదేశంలో గాంధీ ఇజం బలమైన ప్రభావం చూపడంతో ఇక్కడ వామపక్ష ప్రభావం నిర్ణయాత్మక శక్తిగా ఎదగలేక పోయింది. నెహ్రూ, గాంధీ ఇజానికి తోడు నెహ్రూ ఆధునిక భావజాలం, ప్రగతిశీల సోషలిస్టు భావజాలం దేశ ప్రజలను ఆకట్టుకుంది. గాంధీ దేశీయ ఆలోచన పండిట్ నెహ్రూ అంతర్జాతీయ సోషలిస్టు భావజాలం కలగలిపి భారత పునర్నిర్మాణానికి దోహదపడింది.
మునుపెన్నడూ లేని సైద్ధాంతిక ఘర్షణ..
మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా లాంటి వారు గాంధీ మార్గాన్ని అనుసరించడంతో గాంధేయవాదం అంతర్జాతీయం అయ్యింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నిరసిస్తూ మతపరమైన ఏకీకరణ కోసం సాంస్కృతిక పరమైన సంస్థగా ఏర్పడిన ‘ఆర్ఎస్ఎస్’ అనతికాలంలోనే దేశవ్యాప్తంగా విస్తరించింది. దీనికి అనుబందంగా ఏబీవీపీ, వీహెచ్‌పీ, హిందువాహిని, విద్య, సేవ భారతి లాంటి సంస్థలు వివిధ విభాగాలపై పట్టు సాధించాయి. సంఘ్ మద్దతుదారుల కలయికతో ఆవిర్భవించిన జన సంఘ్ నుండి అనతి కాలంలోనే భారతీయ జనతాపార్టీగా ఆవిర్భవించడం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్తిస్థాయి రాజకీయ విభాగంగా మారి దేశ శక్తి, హిందూత్వ ఎజెండాగా నూతన రాజకీయ సిద్ధాంతాన్ని భారత ప్రజల ముందు ఉంచారు. ఇలా బీజేపీ రాకతో రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్‌ల మధ్య భావజాల ఘర్షణ మొదలైయ్యింది.
అయితే ప్రస్తుతం దేశంలో మునుపు ఎన్నడూ లేని సైద్ధాంతిక ఘర్షణ భారత రాజకీయాల్లో నేడు ప్రధాన చర్చగా సాగుతున్నది. నిజానికి గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఆస్కారం లేకుండా రాజకీయాలు చేయడంతో బీజేపీ బలమైన భావజాలాన్ని ప్రజల్లో ప్రచారం చేసుకుంది. బీజేపీ హిందుత్వ వాదాన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ కొంతమేర నిర్లక్ష్యం చేయడంతో బీజేపీది సైద్ధాంతికంగా పైచేయి సాధించి కాంగ్రెస్ వరుస ఓటములను చవిచూసింది.
బీజేపీ సిద్ధాంతానికి విరుగుడు కోసం..
ప్రతి ఎన్నికల కోసం రాహుల్ గాంధీ ఎంతగా శ్రమించినప్పటికి ఫలితాలు మాత్రం ఓటమి అంచుకే చేరుకునివి. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంక్షోభంలో జారుకోవడం సీనియర్ నేతలంతా దూరం కావడంతో ఆ పార్టీ చతికిలపడింది. అందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ద్వారా దేశంలోని ప్రగతిశీల, సామ్యవాద, సిద్ధాంతాల భూమికతో పార్టీని నిర్మాణం చేయాలన్న దృక్పథంతో ముందుకు వెళ్లారు.
ఈ యాత్రలో రాహుల్ గాంధీ యోగేందర్ యాదవ్, ప్రశాంత్ భూషణ్, ప్రొ.హరగోపాల్, ప్రొ. కంచ ఐలయ్య, ప్రొ.కోదండరాం లాంటి మేధావులతో పాటు ప్రముఖ జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అవగాహన పెంచుకుంటూ ముందుకు సాగుతుండటంతో కాంగ్రెస్ మెరుగుపడుతున్న పరిస్థితి మొదలైనది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని తెచ్చుకోగలిగింది. బీజేపీ హిందుత్వ సిద్ధాంతానికి విరుగుడు కనిపెట్టే పనిలో రాహుల్ గాంధీ రహస్య విప్లవ నిర్మాణానికై అన్వేషణ మొదలు పెట్టాడు. ఇది విజయాన్ని ముద్దాడే రోజు ఈ దేశం, నూతన రాజకీయ అధ్యాయంలోకి అడుగుపెడుతుంది. కాంగ్రెస్‌కి పూర్తిస్థాయి అధికారం కైవసం అవుతుంది. దేశ రాజకీయాల్లో భారి అవమానాలు మోసినా, మొక్కవోని దైర్యంతో ముందుకు సాగిన రాహుల్ గాంధీ గొప్ప తత్వవేత్తగా కనిపించే రోజులు సమీపంలో ఉన్నాయి. దేశ రాజకీయాలలో జరుగుతున్న సైద్ధాంతిక పోరులో ఎవరు విజయతీరాలకు చేరుతారో.. బిన్నత్వంలో ఏకత్వం ద్వారా యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా ఉన్న భారతదేశం భిన్న సిద్ధాంతాల ఘర్షణలో ఎవరిది పై చేయి అవుతుందో కాలానికి వదిలేద్దాం.
-దొమ్మాట వెంకటేష్
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
98480 57274