- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ టెకీల చావు పాపం ఎవ్వరిది..?
పదిహేడున్నర సంవత్సరాల కుర్రాడు. నూనూగు మీసాలు కూడా సరిగా రాని వయస్సు. రియల్ ఎస్టేట్ సంపన్నుడైన తండ్రి విలాసవంతమైన పోర్షే కారును డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని ముద్దుల కొడుకుకు గిఫ్టుగా ఇచ్చాడు. దాన్ని తీసుకుని రెస్టారెంట్‌కి వెళ్లాడు. పూటుగా తాగి పుణే రోడ్డుకెక్కి ముందు వెళుతున్న బైక్‌ని గుద్దాడు. దీంతో ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల అనీష్ అవధియా, అశ్విని కోష్టా అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు చనిపోయారు. ఒకటి కాదు రెండు కాదు.. వరుసగా జరుగుతూ పోయిన ఈ నేరాలు మనదేశంలోనే ఎందుకు జరుగుతాయి?
మైనర్ బాలుడు చేసిన ఈ ఘాతుక చర్య తీవ్రతను గుర్తించిన పుణే పోలీసులు ఆ అబ్బాయి తండ్రి మీద, మైనారిటీ తీరని కుర్రాడికి మందు సప్లై చేసిన రెస్టారెంట్ నిర్వాహకుడి పైనే కాకుండా అబ్బాయిపై కూడా తీవ్ర ఆరోపణలతో కేసులు పెట్టారు. ఈ ముగ్గురూ చేసిన నేరం సామాన్యమైంది కాదు. కానీ సంపన్నులకో న్యాయం, సామాన్యులకో న్యాయం బ్రహ్మాండంగా అమలు చేసే మన ఘనమైన దేశంలో కోర్టు పోలీసుల ఆరోపణలను కొట్టిపడేసింది. ఘటన జరిగిన 15 గంటలలోనే ఆ అబ్బాయికి బెయిల్ ఇచ్చింది. అతనికి మైనర్ అని వెసులుబాటు ఇచ్చింది. పైగా ఈ ప్రమాద ఘటనలో తన పాత్ర గురించి వ్యాసం రాయమని ఆదేశించింది. తాము పైకోర్టుకు వెళతామని పోలీసులు పేర్కొన్నా.. అవన్నీ తాటాకు చప్పుళ్లే అవుతాయి.
ఈ నేరాలను ఎవరూ అడ్డుకోలేరా..?
అంతా జరిగిపోయాక ఇప్పుడు చేయవలసిన శల్యశోధన ఎలా జరిగింది అని కాదు.. ఈ గడ్డమీదే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అనే..! ఆ సంపన్నుడైన రియల్ ఎస్టేట్ వ్యాపారిని, రెస్టారెంట్ యజమానిని మహా అయితే అరెస్ట్ చేస్తారేమో.. ఒక వారం రెండు వారాలు చాలు వారు బెయిల్‌పై బయటకు రావడానికి. (వాళ్లను అరెస్టు చేయకపోతే కూడా మనం ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.) స్టేషన్ ఎస్సై, సీఐ, డీఎస్పీ ఎవరో ఒకరికి చేయి తడిపితే చాలు.. లేదా సంపన్నులకు అండగా ఉండటంలోనే తరించే పై వాళ్ల నుంచి ఆదేశాలు వస్తే చాలు...ఈ ఘోర నేరాలు, కేసులూ దూది పింజల్లా తేలిపోతాయి. చిన్న చిన్న నేరాలు చేసి అరెస్టుల పాలైన పేదవాళ్లు బెయిల్ పై బయటకు రావడానికి మన దేశంలో ఎన్ని ఇబ్బందులు పడతారో.. డబ్బులుంటే 15 గంటల్లో బెయిల్ ఎలా పొందారో స్వయంగా చూశాం.
చట్టం, న్యాయం ఉన్నాయా?
మనం ఒక ప్రశ్న వేసుకుందాం.. మైనర్లకు కార్లను గిఫ్టుగా ఇచ్చే తండ్రులూ, మైనర్ తీరకుండానే పూటుగా తాగేందుకు అవకాశమిచ్చే రెస్టారెంట్లూ, కనీసం డ్రైవింగ్ లైసెన్సు కూడా లేకున్నా ధనమదంతో మృత్యు శకటాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చే కుర్రాళ్లను యూరప్, అమెరికాల్లో కానీ మరే అభివృద్ధి చెందిన దేశంలోనైనా కానీ మనం వినగలమా చూడగలమా? నాటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ జూనియర్ కుమార్తెలు మోతాదుకు కాస్త మించి డ్రైవ్ చేశారని అప్పట్లోనే వాళ్ళిద్దరినీ అరెస్టు చేసిన వైనం విని ఔరా అనుకున్నాం. కానీ మనదేశంలో పొరపాటున ఇలాంటి ఘటనల్లో, ప్రమాదాల్లో సంపన్నుల పిల్లలు దొరికి జైళ్ల పాలయినా వాళ్లను ఏదో ఒకరకంగా కాపాడటానికి చట్టం.. న్యాయం, పోలీసు వ్యవస్థలు సహస్ర బాహువులు చాచి మేమున్నాం అంటూ పరుగులు తీస్తాయి. ఇప్పుడు దుర్మరణం పాలైన ఆ టెకీల కుటుంబాలకు ఎవరు న్యాయం చేస్తారన్నదే పెద్ద ప్రశ్న.
కండకావరమే కారణమా?
బాలుడికి మద్యం అందించిన రెస్టారెంట్, అతనికి కారును అందజేసిన మైనర్ తండ్రిపై నమోదైన నేరాలపై దర్యాప్తు చేయడానికి క్రైమ్ బ్రాంచ్‌కు బాధ్యత అప్పగించారు. పోలీసు దర్యాప్తులో, ఆ బాలుడు శనివారం రాత్రి సుమారు 10-12 మంది స్నేహితుల బృందంతో రెండు రెస్టారెంట్లను సందర్శించినట్లు కనుగొన్నారు. వారికి రెండు రెస్టారెంట్లలో ఆహారంతో పాటు వోడ్కా, విస్కీ, బీర్‌తో సహా మద్యం అందించినట్లు కూడా బయటపడింది. కానీ ఆల్కహాల్ టెస్ట్‌లో నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. ఇలాంటి సంఘటనలు రెండు రోజులపాటు వార్తలుగా మాత్రమే మిగిలి ప్రపంచమే మర్చిపోయే ఇలాంటి సంపన్నుల నేరాలకు శిక్ష ఈ దేశంలో పడుతుందా? సమాధానం మనందరికీ తెలుసు. ప్రతి నేరంలోనూ, ప్రాణాలను నిలువునా చీరేసే ప్రతి ఘాతుక చర్యలోనూ సంపన్నుల కండకావరానిదే అంతిమ గెలుపు అని ఎప్పుడో రుజువైపోయింది. ఏమీ చేయలేని మనం వికసిత్ భారత్ చెక్క భజనలు చేసుకుంటూ రోజులు గడిపేద్దాం.. మనకూ, ఈ దేశానికి కూడా చివరకు మిగిలేది అదే..!
రాజశేఖరరాజు
73964 94557