ఉద్యమాల ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం

by Ravi |   ( Updated:2024-08-31 00:45:32.0  )
ఉద్యమాల ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం
X

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, ఆ తర్వాత అర్ధశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందిన మొదటి దళిత యువకునిగా రాణించిన నిరుపేద యువకుడు ఇటికాల పురుషోత్తం. ఆయన ఉద్యమాల ప్రొఫెసర్‌గా పేరు పొందారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల భారం వలన బాల్యం తొలిరోజుల్లో పాలేరుగా బతుకు సాగించినోడు కసితో చదివిన తీరు చూస్తే, చెప్పులు కుట్టిన చేతులే చరిత్రను తిర్గరాస్తాయనే జీవన సత్యం కళ్ల ముందు కనబడుతుంది. పురుషోత్తం జీవితాన్ని అధ్యయనం చేసిన ప్రతి ఒక్కరికి జీవితమంతా సమాజానికే ధారపోసి అంకితభావంతో పని చేస్తున్నటువంటి ఆయనకిది ఉద్యోగ విరమణే గానీ ఉద్యమాలకు కాదనేది జగమెరిగిన సత్యం.

ఐదు దశాబ్దాల కిందట తెలంగాణ వివక్షకు గురై అన్ని రంగాల్లో వెనక్కు నెట్టి వేయబడిన భౌగోళిక ప్రాంతం. ఆనాటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో తుర్కపల్లి మండలోని ఓ మారుమూల పల్లె గంధమల్ల. ఈ పల్లెకు ఊరవతల గూడెంలో చెప్పులు కుట్టే మాదిగింట్లో పుట్టినోడు ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం అలియాస్ ఉద్యమాల ప్రొఫెసర్. తండ్రి బాలయ్య, తల్లి లక్ష్మి. కూటికి, గుడ్డకు, గూటికి నోచుకోని వైనం వీరి కుటుంబ జీవనశైలీ. దీనికి తోడు అంటరాని కులం పేరిట వివక్ష. ఇలాంటి విపత్కర పరిస్థితులను దాటుకొని వచ్చి అటు తెలంగాణకు ఇటు తన కుల చైతన్యానికి, మానవ హక్కుల పోరాటాల్లో, ప్రజాస్వామిక ఉద్యమ పంథాల్లో ముందడుగు తనదై నడ్సినోడు ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం.

కోటి వృత్తులు చేపట్టి..

1994 మాదిగ దండోరా హక్కుల సాధనలో చురుకుగా పాల్గొని ఇదే ఉద్యమ స్ఫూర్తితో దళితుల సంక్షేమం కోసం హైదరాబాద్ పట్టణంలో దళితులకు గృహవసతిని ఏర్పాటు చేయడానికి అరుంధతీయ నగర్‌ను ఏర్పాటు చేసి బడుగు-బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేశాడు. బస్సు కండక్టర్‌గా కొద్దికాలం పనిచేసిన ఆయన ఆ సమయంలో ఆర్టీసీలోని కార్మికుల పక్షాన పోరాడి అక్కడ యూనియన్ నాయకుడిగా పలు కార్యక్రమాలు చేపట్టి ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేశారు.

తెలంగాణ స్టడీ ఫోరం ఏర్పరచి

1996లో పురుషోత్తం స్థాపించిన తెలంగాణ పోరాట సమితి, (మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీగా చెలామణి అయినటువంటి టీఆర్‌ఎస్ పార్టీ పేరుగా పరిణమించింది.) 2000 సంవత్సరంలో తెలంగాణ స్టడీ ఫోరం స్థాపించి ప్రత్యేక రాష్ట్రం కొరకు ఇదే స్టడీ ఫోరం తరపున 2001లో పద్నాలుగు రోజుల పాటు ఢిల్లీలో వందల మంది ఉద్యమకారులతో ఆనాటి కేంద్ర ప్రభుత్వ పెద్దలైన సోనియాగాంధీతో పాటు ప్రభుత్వంలో భాగస్వాములైన వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు.

చెప్పుల పని నుండి ప్రొఫెసర్ దాకా...!

అర్ధశాస్త్ర విభాగంలో ఫ్రొఫెసర్‌గా ఉంటూనే మలిదశ తెలంగాణ రాష్ట్రోద్యమంలో చురుకుగా పాల్గొని యావత్ తెలంగాణ ప్రాంతాన్ని చుట్టి తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి తన ప్రసంగాలతో పల్లె-పల్లెను కదిలించాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన ఆయన ప్రస్తుతం టీజేఏసీ చైర్మన్‌గా రాణిస్తున్నారు.

తన స్వీయ రచనలో వచ్చిన పుస్తకాలు బహు ప్రాచుర్యం పొందినటువంటివి. తెలంగాణ ప్రాంతంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలకు సంబంధించిన అనేక ఉద్యమాలలో ఈయన పాత్ర అగ్రభాగాన ఉంటుంది. చెప్పుల పని నుండి ప్రొఫెసర్ స్థాయికి చేరుకున్న పురుషోత్తం ఉస్మానియా నిజాం కాలేజీ అర్ధశాస్త్ర హెచ్‌వోడిగా 2024 ఆగస్టు 31న పదవీ విరమణ చేస్తున్నారు.

జీవితమంతా సమాజానికే అంకితమై అంకితభావంతో పని చేస్తున్నటువంటి ఆయనకిది ఉద్యోగ విరమణే గానీ ఉద్యమాలకు కాదనేది జగమెరిగిన సత్యం. దీని తర్వాత మరింత ఉత్సాహంతో ప్రజా జీవితంలోకి చొచ్చుకు పోయేందుకు ఒక అవకాశమే అవుతుంది! ఇలాంటి పోరాట పటిమ, మేధావి తనమున్న విద్యావంతుల సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోవడం వలన యావత్ తెలంగాణ సమాజానికి ఉపయుక్తంగా ఉంటుందనేది అనేకుల అభిప్రాయం.

(నేడు ఇటికాల పురుషోత్తం పదవీ విరమణ సందర్భంగా)

వర కుమార్ గుండెపంగు,

99485 41711

Advertisement

Next Story

Most Viewed