భారతీయ విద్యా ఉద్యమ ఆదర్శ ధృవతార

by srinivas |   ( Updated:2024-08-05 23:30:29.0  )
భారతీయ విద్యా ఉద్యమ ఆదర్శ ధృవతార
X

కొన్ని దశాబ్దాలుగా వివక్షకు, అసమానతకు గురై, అన్యాయాన్ని ఎదుర్కొలేక ఒక ప్రత్యేక రాష్ట్ర జన సమూహపు బతుకులు ఆందోళన చెందుతూ తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఉద్యమిస్తుంటే ఆ నాలుగు కోట్ల జనం భవిష్యత్తు కోసం, వారి బతుకు రాతలను మార్చడం కోసం, నీళ్ళు, నిధులు, నియామకాలే ఎజెండాగా 1952 నుంచి 2011 వరకు తన యావత్ జీవితాన్ని ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన మహానుభావుడు, భారతీయ మేధావి, మన తరాలకు భవిష్యత్తు యువతరాలకు ఆదర్శవ్యక్తి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్. తను చదువుకోవడానికి వరంగల్‌లో డిగ్రీ కళాశాల కావాలని పోరాటం చేసిన ఓ యువకుడిగా 30 సంవత్సరాల తర్వాత అదే వరంగల్‌లోని ప్రతిష్టాత్మక కాకతీయ విశ్వవిద్యాలయం‌కు వైస్ ఛాన్సలర్‌గా విద్యా రెక్కలతో ఆకాశమే హద్దుగా ఎదిగిన తీరు కొన్ని కోట్ల మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకం, అనుసరణీయం.

తొలి నుంచి తిరుగుబాటుదారుడే...

వరంగల్ లోని అక్కంపేట వంటి చిన్న గ్రామంలో 1934 ఆగష్టు 6న ఉదయించిన జయశంకర్ చదువు అనే ఆయుధంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పిహెచ్.డి పట్టా పొందారు. ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా, ప్రొఫెసర్‌గా ఇలా ఎన్నో బాధ్యతలతో తన విద్యార్థులకు అందమైన భవిష్యత్ ఇవ్వడమే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్మాణమే తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుక అయ్యేలా తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్తగా తన జీవితాంతం మేధో మథనం చేసారు. తను ఇంటర్ చదువుకునే రోజుల్లోనే నిజాంను కీర్తించడాన్ని వ్యతిరేకిస్తూ వందేమాతరం అంటూ స్ఫూర్తి శంఖం పూరించాడు. 1952 ముల్కీ ఆందోళనలో పాల్గొన్న ఆయన 1969 మలి ఉద్యమానికి నాయకుడు అయ్యారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి వుండి, ప్రత్యేక రాష్ట్ర విభజన జరగాలంటే మొదట తెలంగాణ ప్రజల్లోకి తెలంగాణ భావజాల వ్యాప్తి జరగాలని విశ్వసించి తెలంగాణ వివిధ అంశాలకు సంబంధించిన వివిధ సమస్యలపై ఎన్నో వ్యాసాలు రాశారు. పట్టుమని పదిమంది తన వెంట లేకున్నా నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా, ఓ ఆదర్శం కోసం వెనుకడుగు వేయకుండా కొన్ని కోట్ల మంది ఆకాంక్షల కోసం ఉద్యమించారు. ఉపన్యసించారు. తన ఆఖరి శ్వాస అస్తమించే జూన్ 21, 2011 వరకు జై తెలంగాణను తన గుండె శబ్దంగా యావత్ ప్రపంచానికి తెలిసేలా ప్రతిధ్వనించారు.

దశాబ్దాల నిరీక్షణ

1999లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు ప్రాంతీయ అసమానతలపై అనర్గళంగా ఉపన్యసించారు. నదీజలాల అసమాన పంపిణీ వల్లే తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎలుగెత్తి చాటారు. ఆర్థికంగా ఇక్కడి ప్రజలు ఎదగాలని, విద్య ద్వారే అది సాధ్యమవుతుందని నమ్మారు."తెలంగాణ ప్రజల గురించి ఎట్టికైనా, మట్టికైనా మనోడే వుండాలంటే చితి వెలిగించాలన్నా, వ్యవసాయం చేయాలన్నా మన వాళ్ళే కావాల''న్న తన దృక్పథానికి కేవలం ఇక్కడి బలమైన రాజకీయ ప్రాంతీయ పార్టీ వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని విశ్వసించారు. అలాంటి వ్యక్తుల కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షించారు తన పోరాటపటిమను ఆపకుండానే...ఎన్ని అవాంతరాలు ఎదురైనా తను ఎక్కడ ఆగకుండానే...!

తెలంగాణ వాదాన్ని వదిలేదే లే..

అలాంటి తరుణంలో కేసీఆర్ లోని తెలంగాణపై వున్న కమిట్‌మెంట్, రాజకీయ చతురత, వాక్చాతుర్యం, పోరాట స్ఫూర్తి తదితర అంశాలు జయశంకర్ సార్‌ను ఆకర్షించాయి. కొన్ని వ్యక్తిగత అభిప్రాయాల్లో కేసీఆర్‌తో ఆయన విభేధించినా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజకీయంగా కేసీఆర్ నాయకత్వమే సరైనదని బలంగా విశ్వసించి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు దగ్గరి నుంచి 2009 డిసెంబర్ కేసీఆర్ నిరాహారదీక్ష విరమణకు నిమ్మరసం ఇచ్చేవరకు కెసిఆర్‌కు మార్గదర్శిగా ఆయన వెంటే వున్నారు. శనివారం ఉపవాసాన్ని, తెలంగాణ వాదాన్ని విడిచిపెట్టేదే లేదంటూ తన ఆత్మవిశ్వాసాన్ని తరుచుగా ప్రకటిస్తుండేవారు జయశంకర్. కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసిన జయశంకర్ సార్ పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు ను తనకు స్ఫూర్తి ప్రదాతగా, గురువుగా భావించేవారు."కాళోజీ ఒకవిధంగా ఉద్యమాలలో ఆయనే నాకు గురువు. స్టూడెంట్ లైఫ్ నుంచి దాదాపు ఆయన్ను ఉద్యమాలలో చూసిన, పెద్దయినంక ఆయనతోని కలిసి పనిచేసిన.. తెలంగాణ ఉద్యమం దాక. నిజాం వ్యతిరేక పోరాటం రోజుల్నుంచి ఆయన చనిపోయే వరకు ఏ ఉద్యమాలలో అయినా ఒక కార్యకర్తగా ఆయనతోనే పాల్గొన్న. ఆవిధంగా ఉద్యమ స్ఫూర్తి నాలో నాటింది కాళోజీ గారే"అంటారు జయశంకర్.

పునర్నిర్మాణమే లక్ష్యంగా

సార్ తన కల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూడకుండానే అస్తమించారు. ఓ సందర్భంలో ఆంధ్ర ప్రజలనుద్దేశించి "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల ఆంధ్రప్రజలకు అన్యాయమైతే మళ్ళీ వెంటనే నేను మీతరపున ఉద్యమం చేస్తా. నా పోరాటం అసమానతలు, వివక్షతలు, అన్యాయాలు, సమస్యల పైనే కానీ మనుషులు మధ్య విద్వేషాలు సృష్టించడంలో కాదు" అన్న మాటలు ఆయనలోని విశ్వమానవీయతకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై దశాబ్ది వేడుకలు కూడా జరిగాయి. మరి మన జయశంకర్ సార్ కలలుగన్న తెలంగాణ పునర్నిర్మాణంలో ఇంకా మనం చాలా సాధించాల్సింది వుంది. తెలంగాణ యావత్ దేశానికి అభివృద్ధి ముఖచిత్రంగా వుండాలంటే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు బాధ్యతతో సార్ ఆశయాల కనుగుణంగా పనిచేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ సార్ జీవితానికి సంబంధించి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఆయన జయంతి, వర్థంతి సందర్భంగా నిర్వహించాలి. వీలైతే హైదరాబాద్లో ట్యాంక్ బండ్‌పై జయశంకర్ సార్ విగ్రహాన్ని ప్రతిష్టించి, ఆయన జయంతి రోజును తెలంగాణ ఉపాధ్యాయ, అధ్యాపక దినోత్సవంగా ప్రకటించాలి. ఆయనస్ఫూర్తిని దేశం గుర్తించేలా కేంద్రప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించాలి. జయశంకర్ సార్ భౌతికంగా మన మధ్యలో లేకున్నా ఆయన అక్షరాలు, ఆలోచనలు ఇంకా కొన్ని దశాబ్దాలు మనందరిలో ఆదర్శపు వ్యక్తిత్వానికి మార్గదర్శనం చేస్తూనే వుంటాయి.మనల్ని భావి భారత పౌరులుగా మారుస్తూనే వుంటాయి.

(నేడు జయశంకర్ సర్ జయంతి)

ఫిజిక్స్ అరుణ్ కుమార్

తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి

93947 49536

Advertisement

Next Story

Most Viewed