బడిబాట విజయవంతమవ్వాలి!

by Ravi |   ( Updated:2024-06-15 00:30:18.0  )
బడిబాట విజయవంతమవ్వాలి!
X

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడి బాట కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ రూపొందించిన బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొని ఇంటింటికీ వెళ్లి బడికి వెళ్లే పిల్లల సంఖ్య తెలుసుకుంటూ, స్కూల్‌కు వెళ్లని పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ బాల కార్మిక నిర్మూలనకై కృషి చేస్తున్నారు. రోజూ ప్రతి జిల్లాలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు‌ అవగాహనా ర్యాలీని, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సర్కార్ పాఠశాలల్లో 1వ తరగతి‌ నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన, విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం, డిజిటల్ స్మార్ట్ బోర్డ్, నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామని వారి తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. జూన్ 19 వరకు కొనసాగనున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మౌలిక వసతులకు పట్టం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది ప్రైవేటుపై మోజు తగ్గించేందుకు రాష్ట్రమంతటా ప్రతి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసింది. వీటి ఆధ్వర్యంలో అన్ని పాఠశాలలను కొత్త హంగులతో తీర్చిదిద్దుతోంది. బడి బాట ప్రచారాన్ని, బాగోగులు, బాధ్యతలను ఈ కమిటీలకే అప్పగించారు. వీరు సంబంధిత అధికారులు ప్రైవేట్ మోజు నుంచి తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేయనున్నారు. బడి బాట కార్యక్రమంలో అనేక అంశాలను అధికారులు ప్రచారం చేయనున్నారు. ఈ బడిబాటలో అమ్మ ఆదర్శ కమిటీలతో పాటు, విద్యాశాఖాధికారులు, హెడ్మాస్టర్, యువజన సంఘాలు, ప్రజా ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు.

ఈ సారి పాఠశాలల బాగోగులు, బాధ్యతలు అమ్మ కమిటీలకు అప్పగించిన ప్రభుత్వం, ఈ విద్యా సంవత్సరంలో ఆశించిన స్థాయిలో విద్యార్థుల నమోదు శాతం పెరిగి ఆశించిన ఫలితాలు వస్తాయని భావిస్తోంది. పాఠశాలల్లో తలుపులు, కిటికీలు, బ్లాక్ బోర్డులు, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, మరుగుదొడ్ల తాత్కాలిక మరమ్మతుల పనులన్నింటినీ ప్రభుత్వం పాఠశాల పునఃప్రారంభానికి ముందే మొదలు పెట్టింది.

బడి బాట విజయం పొందాలి

ప్రభుత్వం చేస్తున్న హడావుడి మంచిదే కానీ ఎంత వరకు ఇది అనుకున్న లక్ష్యాలు నెరవేరుస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వానికి సంపూర్ణ అక్షరాస్యతను తీసుకు రావడం ఒక సవాలుగా మారనుంది. కేంద్రం, స్వచ్ఛంద సంస్థలు బాల కార్మికులు నిర్మూలన కోసం పోరాడుతున్నా, పూర్తి స్థాయిలో బాల కార్మికులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అదే విధంగా ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు నియంత్రించలేక పోతున్నాయి. దీంతో చదువు వ్యాపారంగా మారింది. పేద విద్యార్థులకు నాణ్యమైన చదువు అందలేకపోతోంది. ఐఐటీ, సీబీఎస్, ఎస్ఎస్‌సీ వంటి సిలబస్‌లు ప్రభుత్వ పాఠశాలల్లో పెడితే బాగుంటుందని విద్యార్థులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బడి బాట కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిద్దాం

మిద్దె సురేష్

97012 09355

Advertisement

Next Story

Most Viewed