- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రైవేటు విద్య వ్యాపారం కాదు
ప్రైవేటు బడులు తల్లిదండ్రులను పీడించి రకరకాల ఫీజుల పేరిట వసూలు చేస్తున్న డబ్బంతా పన్ను రహితమే. ఇన్ని కట్టుదిట్ట చట్టాలున్నా ప్రైవేటు విద్యను ప్రభుత్వాలు గాలికొదిలేస్తున్నాయి. తాజాగా 20-50 శాతం ఫీజులు పెంచి జబర్దస్తుగా వసూలు చేస్తున్నా అడిగే నాథుడు లేదు. తెలంగాణాలో ఫీజుల నియంత్రణ కోసం 2017 లో ప్రో. తిరుపతిరావు అధ్యక్షతన వేసిన కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందినా ఇప్పటికీ అది రహస్యంగానే ఉంది. మార్చిలో మంత్రివర్గ ఉపసంఘం ప్రతి పాఠశాల ఫీజుల నియంత్రణ కమిటీ వేసి అందులో ఐదుగురు పేరెంట్స్‌ని సభ్యులుగా నియమించాలని చెప్పింది. ఇదేదీ కార్యరూపం కాకుండానే యథావిధిగా ప్రైవేటు చదువు ప్రజలను నిలువు దోపిడీ చేస్తుంటే ఎలాంటి చర్యలకు ఉపక్రమించని విద్యా శాఖ చెడు చూడగూడదని కండ్లు మూసుకున్నట్లుంది.
జూన్ నెల రాగానే ప్రైవేటు స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక రకమైన జ్వరం పట్టుకుంటుంది. బడి ఫీజు ఎంతని వినాల్సి వస్తుందోనని వారికి నిద్ర పట్టదు. పిల్లలు చదివేది రెండో, మూడో తరగతే అయినా మధ్యతరగతి జనాలకు స్కూల్ గేటు దాటాలంటే కాళ్లు వణుకుతాయి. అభివృద్ధి, సంక్షేమం పేరిట రకరకాల పథకాలు వేస్తున్న సర్కారు ఈ ప్రయివేటు స్కూళ్ల దోపిడీని, ఇష్టారాజ్యాన్ని కట్టడి చేయడం తమ ఎజెండాలో లేని అంశంగానే భావిస్తోంది. పేరెంట్స్ సంఘాల ఒత్తిడికి ఓ జీఓ వచ్చినా స్కూల్ యాజమాన్యం దాన్ని చూశారో లేదో అన్నట్లుగా ఉంటుంది. డీఈఓ, ఎంఈఓ లాంటి విద్యాధికారులు వీటిని తప్పించుకొని తిరుగుతుంటారు. రాజకీయ పలుకుబడి గల 'ప్రైవేటు' పెద్దల ముందు వీరు మరుగుజ్జులవుతారు. మొక్కుబడి తనిఖీలలో కూడా వారు చూపించే దొంగ లెక్కలకు రైటు కొట్టక తప్పదు. ఈ అధికారులు ఇలాగే ఉండాలని సర్కారు కూడా కోరుకుంటుంది.
అక్కడే విద్యార్థులు ఎక్కువ
2021 లెక్కల ప్రకారం తెలంగాణాలో 26,800 ప్రభుత్వ పాఠశాలలలో 23 లక్షల విద్యార్థులుంటే 11 వేల ప్రయివేటు బడులలో 32 లక్షల మంది చదువుతున్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో కరోనా దెబ్బకు ఆర్థికంగా చితికి ప్రై'వేటు'ను తట్టుకోలేక 1.25 లక్షల పిల్లలు సర్కారు బడులలో అనివార్యంగా చేరారు. అయినా, రాష్ట్రంలో పాఠశాల విద్య ప్రైవేటు హస్తగతమే అని భావించాలి. 1980వ దశకం నుంచి పట్టణాలలో తెలుగుపై 'ఆంగ్ల' దండయాత్ర మొదలైంది.
అప్పటికే రాష్ట్రంలో అక్కడక్కడా ఇంగ్లిష్ మీడియంలో బోధించే క్రైస్తవ మిషనరీ స్కూళ్లు ఉండగా, ప్రైవేటులో ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు అప్పుడే వచ్చాయి. ఎన్నడూ లేనిది పిల్లలకు స్కూల్ యూనిఫారాలు, బెల్టు, టై, బ్యాగు, బూట్లతోపాటు నడిచి బడికి వెళ్లేవాళ్లను ఇంటి నుండే తీసికెళ్లే బస్సులు వచ్చి ఓ హంగామాను సృష్టించాయి. ఆ తతంగం ఎంత దాకా వచ్చిందంటే ఒకే వీధిలో ఉండే పిల్లలు మామూలు బట్టలతో సర్కారు బడికెళ్లడం నామోషీగా అనిపించేది. పిల్లలు ఏ బడిలో, ఏ మీడియంలో చదువుతున్నారని ఎవరైనా అడిగితే సర్కారు బడి, తెలుగు మీడియం అని చెప్పుకోవడానికి పేరెంట్స్ ఇబ్బంది పడేదాకా వెళ్లింది. వీటి దెబ్బకు అప్పటి దాకా ఇచ్చింది తీసుకొని ఒకటి, రెండు తరగతుల దాకా చెప్పే పంతుళ్ల కానీ,బడులు కానీ మూతబడ్డాయి.
యాజమాన్యాల దోపిడీ
1983 వరకు స్కూల్ చదువులో ప్రభుత్వ వాటా 80 శాతం ఉంటే, 1999 నాటికీ అది 67 శాతానికి దిగజారి, ఇప్పుడు సగానికి తక్కువగా ఉంది. ప్రయివేటు విద్యలో పెట్టుబడి ఈ 15 ఏళ్లలో 11 వంతులు పెరిగింది. మొదట ప్రైవేటు స్కూళ్లు విద్యార్హతలు గల వ్యక్తులు ఆరంభిస్తే ఇప్పుడు ఆ వ్యవస్థ డబ్బున్నవారి ఆదాయ మార్గంగా మారింది. ఇలా విద్య చివరకు కిరాణా దుకాణాల మాదిరి వ్యాపారంగా రూపాంతరం చెందింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఏ ప్రకారం దేశంలోని బాలబాలికలందరికి 6 నుండి 14 ఏళ్ల వయసు దాకా ప్రభుత్వం ఉచిత, తప్పనిసరి విద్యను అందించాలి. 2001లో చేపట్టిన 93 వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆడపిల్లలకు, దళిత, గిరిజన పిల్లలకు 18 ఏళ్లు వచ్చే దాకా ఉచిత విద్యా సదుపాయం కల్పించాలి.
అయితే, బడ్జెట్ లో నిధుల కేటాయింపు సరిపోక, ఆర్థికంగా ప్రభుత్వాలకు అంత స్థోమత లేదనే కారణంగా ప్రైవేటు విద్యను అన్ని ప్రభుత్వాలు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చి ప్రోత్సహించాయి. 2009లో పార్లమెంట్ ఆమోదించిన బిల్లు ప్రకారం విద్యా హక్కు చట్టం కింద 1 ఏప్రిల్ 2010 నుండి ప్రైవేటు పాఠశాలలు 25 శాతం సీట్లు బలహీన వర్గాల విద్యార్థులకు కేటాయించాలి. వారికి సంబంధించిన బోధనా రుసుము ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ నిబంధనను పాటిస్తున్నారా లేదా అనే తనిఖీ జరగడం లేదు. అలా సీట్లు ఇచ్చినా పాఠశాలలు రకరకాల ఫీజుల పేరిట విద్యార్థుల నుండి డబ్బులు రాబడుతున్నాయని తెలుస్తోంది.
చట్టం విడిచి దాదాగిరి
ప్రైవేటు పాఠశాలలు పిల్లలను చేర్చుకొనే సమయంలో ఎలాంటి అడ్మిషన్ టెస్ట్ పెట్టరాదని, తల్లిదండ్రులను పరీక్ష పెట్టినట్లు ప్రశ్నించరాదని ఆ చట్టంలో ఉంది. స్కూలులో చేరే సమయంలో పిల్లలను తయారు చేయించడమే కాక పేరెంట్స్ కూడా ఎదురయ్యే ప్రశ్నలకు జవాబులు సిద్ధం చేసుకోవడం, వారి కన్నా ముందు అడ్మిషన్ పొందినవారిని ఏమడిగారని తెలుసుకోవడం చూస్తుంటాం. స్కూలులో సీటు ఉంటే 14 ఏళ్ల లోపువారిని చేర్చుకొనేందుకు నిరాకరించే అధికారం దేశంలో ఏ పాఠశాలకు లేదు. కానీ అడ్మిషన్ విషయంలో ప్రైవేట్ల దాదాగిరి చాలా మందికి అనుభవమే అయి ఉంటుంది. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలో 75 వాతం మేరకు విద్యార్థుల తల్లిదండ్రులే ఉండాలి. ఇవన్నీ కాగితాలకే పరిమితమై ప్రయివేటు విద్య వాటి యజమానులు సొంత వ్యవహారమే పోయింది.
కంపెనీస్ యాక్ట్, 2013 లోని సెక్షన్ 135 ప్రకారం దేశంలో రూ.1000 కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు తమ నికర ఆదాయంలో రెండు శాతం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఖర్చు చేయాలి. బిర్లా మందిర్ లాంటి కట్టడాలు అలాంటి చట్టాల కారణంగానే నిర్మించబడుతున్నాయి. అంతమేరకు వారికి పన్ను రాయితీ లభిస్తుంది. అయితే ఇప్పుడు కొందరు పారిశ్రామికవేత్తలు తెలివిగా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత విద్య పేరిట రకరకాల అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు. వాటి నిర్వహణ, నియంత్రణ వారి చేతిలోనే ఉంటుంది. పైకి సామాజిక బాధ్యతలా చూపెడుతూ పన్ను రాయితీ పొందుతూ ఆ విద్యా వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. భారీ నిర్మాణాలతో నగరం చుట్టూ విస్తరించిన కార్పొరేట్ విద్యా సంస్థల్లో చాలా మటుకు ఈ బాపతే.
కండ్లు మూసుకున్న సర్కారు
మన దేశంలో ఒక వ్యక్తి తన పేరిట పెద్ద హోటల్ లేదా భారీ సినిమా హాల్ కట్టవచ్చు కానీ ప్రైవేటు బడిని పెట్టలేడు. ప్రైవేటు బడి ఒక వ్యక్తికి సంబంధించిన వ్యాపారం కాదు. ప్రైవేటుగా విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలంటే దానికి ఒక ట్రస్ట్ లేదా సొసైటీ అవసరం. వాటి లక్ష్యం విద్యాదానం చేసే లాభాపేక్ష లేని సేవా సంస్థను నడపడమే. స్కూల్ నిర్వహణ, అవసరాల మేరకే అవి విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయాలి. చట్టం దృష్టిలో సేవకు వినియోగంగా లెక్కింపబడే ఆ సొమ్ముకు జీఎస్టీ, ఆదాయపు పన్నులు వర్తించవు. ప్రైవేటు బడులు తల్లిదండ్రులను పీడించి రకరకాల ఫీజుల పేరిట వసూలు చేస్తున్న డబ్బంతా పన్ను రహితమే. ఇన్ని కట్టుదిట్ట చట్టాలున్నా ప్రైవేటు విద్యను ప్రభుత్వాలు గాలికొదిలేస్తున్నాయి.
తాజాగా 20-50 శాతం ఫీజులు పెంచి జబర్దస్తుగా వసూలు చేస్తున్నా అడిగే నాథుడు లేదు. తెలంగాణాలో ఫీజుల నియంత్రణ కోసం 2017 లో ప్రో. తిరుపతిరావు అధ్యక్షతన వేసిన కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందినా ఇప్పటికీ అది రహస్యంగానే ఉంది. మార్చిలో మంత్రివర్గ ఉపసంఘం ప్రతి పాఠశాల ఫీజుల నియంత్రణ కమిటీ వేసి అందులో ఐదుగురు పేరెంట్స్‌ని సభ్యులుగా నియమించాలని చెప్పింది. ఇదేదీ కార్యరూపం కాకుండానే యథావిధిగా ప్రైవేటు చదువు ప్రజలను నిలువు దోపిడీ చేస్తుంటే ఎలాంటి చర్యలకు ఉపక్రమించని విద్యా శాఖ చెడు చూడగూడదని కండ్లు మూసుకున్నట్లుంది.
బి.నర్సన్
94401 28169