- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయ యోధుని అస్త్ర సన్యాసం
రాజకీయాల్లో కురువృద్ధుడు, మహారాష్ట్ర రాజకీయాల్లో ఆ మాట కొస్తే, దేశ రాజకీయాల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కున్న స్థానం ప్రత్యేకం. 27 ఏళ్లకు ఎమ్మెల్యే, 38 ఏళ్లకే సీఎం.. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన శరద్ పవార్ రాజకీయ ప్రస్దానం. గ్రామీణ నేపథ్యం నుంచి రావడం, గ్రామీణ వ్యవస్థ, వ్యవసాయం మీద పట్టు ఉండడంతో ఈ శాఖ ఆయనకు బాగా సహాయపడింది. ఆ సమయంలో భారతదేశం ఆహార ధాన్యాలలో మిగులును సాధించడంలో సంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత శరద్ పవార్‌దే. రాష్ట్ర సామాజిక-ఆర్థిక అభివృద్ధి విషయంలో తనకు తాను దూరదృష్టి గలవాడని నిరూపించుకున్నాడు. సైద్ధాంతిక వ్యత్యాసాలను అధిగమించి అధికార, ప్రతిపక్ష నాయకుల నుంచి సద్భావనను సంపాదించడం, దాన్ని కొనసాగించడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ అనుభవం జాతీయ రాజకీయాల్లో సైతం బాగా పనికి వచ్చింది. 1991-1996 మధ్య ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ప్రభుత్వంలో మొదటిసారి కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో కేంద్ర రక్షణ మంత్రిగా అవకాశం లభించింది. అనంతరం 1998-1999లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష నాయకుడిగా పగ్గాలు నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం
పవార్ పూర్తి పేరు శరద్ గోవిందరావు పవార్. ప్రస్తుతం ఆయన వయసు 82. పూణెకు సమీపంలోని బారామతిలో ఆయన జన్మించారు. పూణేలో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఆయన.. కేవలం 27 సంవత్సరాల వయస్సులోనే (1968) బారామతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 1990 వరకు అదే స్థానం నుంచి నిరాటంక విజయ పరంపర కొనసాగించారు. అప్పట్లో పిన్న వయస్క ఎమ్మెల్యేల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 1978లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి, అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా రికార్డు సాధించారు. అప్పుడు ఆయన వయసు 38 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత రాష్ట్రానికి మరో మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మహారాష్ట్రకు అతి ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా రికార్డ్ సాధించినప్పటికీ, ఒక్కసారి కూడా పూర్తి స్థాయి (ఐదేళ్ల పాటు) ప్రభుత్వాన్ని నడపలేదు.
కాంగ్రెస్ నుంచి ఉద్వాసన... ఎన్సీపీ స్థాపన
1999లో సోనియా గాంధీతో ఆయనకు విభేదాలు తలెత్తాయి. సోనియాను వ్యతిరేకించారు. అందుకు ఆమెను విదేశీ మూలాలు కలిగిన వ్యక్తంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇది ఆయనకు సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్‌లను సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి తనతో పాటు తీసుకెళ్లి ఎన్సీపీని స్థాపించారు. పార్టీ స్థాపించిన ఏడాదిలోనే మహారాష్ట్రతో పాటు గోవా, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో మంచి ఫలితాలు రాబట్టారు. దీంతో ఆ పార్టీలో జాతీయ పార్టీ గుర్తింపు లభించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురై సొంత పార్టీని స్థాపించాక ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నారు. మధ్య మధ్యలో విభేదాలు వచ్చినప్పటికీ చాలా కాలం పాటు ఇరు పార్టీలు కలిసే పోటీ చేశాయి.
జాతీయ రాజకీయాలపై తనదైన ముద్ర
2004-2014 మధ్య మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాల్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. శరద్ పవార్‌కు ఈ పదవి బాగా సరిపోతుందని చాలా మంది నేతలు ప్రశంసించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు ఉమ్మడి అభ్యర్థి గా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌ను తమ అభ్యర్థిగా ఎంపిక చేయాలని ప్రతిపక్ష పార్టీలు భావించాయి ఓటమి చెందే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు తాను సుముఖంగా లేనని శరద్ పవార్ ప్రకటించడం అయనలోని రాజకీయ అనుభవం లోతును సూచిస్తుంది. 1999 జూన్ 10న పార్టీని స్థాపించినప్పటికీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన 24 ఏళ్ల అనంతరం 2023 మే 2వ తేదీని తన రాజీనామాను ప్రకటించారు.
నిస్పృహా లేక మాస్టర్ స్ట్రోక్?
తీవ్ర విమర్శలు, ఎత్తు-పల్లాలు ఉన్నప్పటికీ 63 ఏళ్ల పాటు సాగిన శరద్ పవార్ రాజకీయ జీవితం ఆచరణాత్మక రాజకీయాలకు నిదర్శనం. తొలినాళ్లలోనే రాజకీయాలతో పాటే సామాజిక కార్యకలాపాల్ని కొనసాగిస్తానని చెప్పిన ఆయన.. ఎప్పుడూ వెనకడుగు వేయకుండా, మాట మీద నిలబడ్డారు. రాజకీయ ఎత్తుగడల్లోనే కాదు, రాజకీయాల్ని ఎప్పుడు ఆపాలో కూడా ఆయనకు బాగా తెలుసు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని పార్టీని ముందుకు నడిపించారు. బీజేపీపై పోరాటంలో విపక్షాలను ఒకే తాటి మీదకు తెచ్చేందుకు పవార్ ఎంతో కృషి చేస్తున్నారు. ఇలాంటి ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా ప్రజాజీవితంలో తనదైన ముద్రవేస్తారా లేక దూరంగా ఉంటారా అన్నది అభిమానులను కలవరపెడుతున్నది. వయోభారానికి తోడు నిస్పృహతో రాజీనామా చేశారా లేక మాస్టర్ స్ట్రోక్ ప్లే చేసారా అనేది త్వరలో తేలవచ్చు కూడా.
వి. సుధాకర్
7382083094