రాజ్యాధికారమే మాస్టర్ కీ

by Ravi |   ( Updated:2024-04-14 01:15:58.0  )
రాజ్యాధికారమే మాస్టర్ కీ
X

అంబేడ్కర్ అంటే సాంఘిక సంక్షేమ హాస్టల్స్, స్కాలర్‌షిప్పులు కాదు. అంబేడ్కర్ అంటే రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందడం కాదు. అంబేడ్కర్ పేరు పలుకుతున్నామంటే భారతదేశంలో సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరివర్తన తీసుకురావడమని అర్థం. రాజకీయ సాంస్కృతిక దోపిడీ కులాలకు, ఈ దేశ జనాభాలో 10 శాతం కూడా లేని అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా 90 శాతానికి పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజకీయ యుద్ధం చేస్తూ సకలరంగాల్లో సమూల పరివర్తన తీసుకురావడమే అంబేడ్కర్‌కి ఇచ్చే ఘనమైన నివాళి. అంతే తప్ప, ఆయన విగ్రహాలు పెడుతూ, ఆయన జయంతులు వర్ధంతులని ఆ ఒక్కరోజే పండగ వాతావరణం సృష్టించి, స్వీట్లు పంచుకుని, నిత్యం తనకు వ్యక్తి పూజ చేయడం అంబేడ్కర్ కోరుకోలేదు. బలహీన వర్గాల బతుకులు మారాలంటే అంతిమంగా రాజకీయాలు చేయడమే వృత్తిగా స్వీకరించాలని, అసలు రాజకీయాలు చేయడమే నిమ్న కులాల వృత్తి అని బలంగా చెప్పారాయన. తన ముందు ఎలాంటి అవకాశాలు లేనప్పటికీ, తనకు తానుగా అవకాశాలు సృష్టించుకుని, అగ్రవర్ణాల రాజకీయ పెత్తనం తీసేయాలంటే అణగారిన ప్రజలకి కూడా ఓటు వేసే హక్కు ఉండాలని భావించి ఓటు అనే వజ్ర ఆయుధాన్ని ఇచ్చాడు.

వారే తన వారసులంటూ…

ప్రపంచ చరిత్రలో భారతదేశ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే అంబేడ్కర్ కి ముందు అంబేడ్కర్ తర్వాత అని చెప్పుకోక తప్పదు ఎందుకంటే 2000 సంవత్సరాలుగా ఉన్న సామాజిక అసమానతలని, రాజకీయ సాంస్కృతిక వివక్షతలను రూపుమాపి, మనుషులందరూ సమానమనే భావనని భారత రాజ్యాంగం అనే గ్రంధాన్ని రాయడం ద్వారా అంబేడ్కర్ ఎవరు చెరిపివేయలేని శాసనాన్ని నిర్మించి తనువు చలించాడు. చాలామంది, మేధావులు కూడా అంబేడ్కర్ ఒక అంటరాని నిమ్న కులంలో పుట్టి ఎన్నో కష్టాలను పడి జీవితాన్ని సర్వస్వం కోల్పోయి భారత రాజ్యాంగాన్ని రాసి భారతదేశానికి ఒక దిక్సూచిగా మారిపోయాడు అనే వ్యాఖ్యలతో అందరికి తెలిసిన చరిత్రను మాత్రమే చెబుతుంటారు. కానీ ఇవాళ మనం అంబేడ్కర్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే విప్లవాత్మక సైద్ధాంతిక భావజాలం ప్రాతిపదికన యుద్ధం చేయించాలని అర్థం. ఎందుకంటే అంబేడ్కర్ తన తదనంతరం తన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే అనుచరులని కోరుకున్నారు తప్ప తన రక్తం పంచుకుని పుట్టిన వారిని వారసులుగా ప్రకటించుకోలేదు, తన సైద్ధాంతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే వారిని అంబేడ్కర్ తన వారసులుగా చెప్పుకున్నారు.

శాంతియుత విప్లవ ప్రబోధకుడు

సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరివర్తన అనే తన లక్ష్య సాధనలో భాగంగా 'ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్', 'ఇండిపెండెంట్ లేబర్ పార్టీ', 'రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా'లని అంబేద్కర్ స్థాపించి 90% పైగా ఉన్న బీసీ,ఎస్సీ, ఎస్టీలకు రాజ్యం, రాజకీయాలు, రాజ్యాధికారం ప్రాముఖ్యతను గురించి చెప్పారు. భారతదేశంలోని అంటరాని వారికీ, వెనుకబడిన వర్గాలకూ, స్త్రీలకీ అగ్రవర్ణాల వలె సామాజిక రాజకీయ హక్కులను కల్పించి ప్రజలందరూ కలిసి మెలిసి ఉండేలా స్వేచ్ఛ సమానత్వ సోదరభావంతో కుల మతాలకతీతంగా అందరూ జీవిస్తూ ఉండాలని, దానికి అనుగుణంగా భారత రాజ్యాంగం అనే విప్లవాత్మక గ్రంథాన్ని రాశాడు. రాజ్యాంగమే భవిష్యత్తులో ఎలాంటి రక్తపాతం జరగకుండా దేశ ప్రజల్లో మానసిక, భౌతిక పరివర్తనతో కూడిన సామాజిక రాజకీయ సాంస్కృతిక విప్లవాన్ని శాంతియుతంగా తీసుకొస్తుందని చెప్పాడు.

మార్పు సంకేతం రాజ్యాధికారమే..!

రాజ్యాధికారం అనే ప్రక్రియతో ఎలాంటి మార్పుని ఐనా తీసుకురావచ్చు అని అంబేద్కర్ చెప్పిన సూత్రాన్ని ఆధారంగా చేసుకొని భారతదేశంలో స్పష్టమైన మార్పులు తీసుకొచ్చి నిరూపణ చేసిన వ్యక్తి ఒకే ఒక్కరు. వారే కాన్షీరాం. రాజకీయేతర ఉద్యమం లేకుండా రాజకీయ పార్టీని నడపడం, సాంస్కృతిక రాజకీయ పరివర్తన తీసుకురావడం అసాధ్యమని భావించి అంబేద్కర్ కోరుకున్న విధంగా ఒకే సమయంలో సాంస్కృతిక, రాజకీయ విప్లవాన్ని సృష్టించి సామాజిక ఫలితాలు సాధించి కాన్షీరాం విజయాన్ని సాధించాడు. అంబేద్కర్ తదనంతరం అంబేడ్కర్ ఆలోచనలకు కాన్షీరాం కొనసాగింపునివ్వడం, కాన్షీరాం తదనంతరం అదే అంబేడ్కర్ ఆలోచనలు పట్టుకొని కాన్షీరాం శిష్యుడైన ధర్మ సమాజ్ పార్టీ అధినేత డా. విశారదన్ మహారాజ్ వంటివారు తెలంగాణ కేంద్రంగా అంబేడ్కర్ కోరుకున్న సాంస్కృతిక పరివర్తనతో కూడిన ఉద్యమాన్ని చేపడుతూ సామాజిక రాజకీయ పరివర్తన కోసం అంబేడ్కర్ కాన్షీరాంల ఆలోచనల ప్రాతిపదికన క్షేత్రస్థాయిలో యుద్ధం చేయిస్తున్నారు. రాజ్యాధికారమే మాస్టర్ కీ అన్న అంబేడ్కర్ సూత్రాన్ని ఆచరణలో పెడుతున్నారు.

- పుల్లెంల గణేష్

95530 41549

Advertisement

Next Story

Most Viewed