- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చట్టసభల్లోకి.. నేరగాళ్లను ఆపండి!
ప్రజాస్వామ్యానికి పునాదిగా చెప్పుకునే చట్టసభల్లో నేరగాళ్లు ప్రవేశించి చాలా కాలమైంది. ఈ పరిణామాన్నే నేరమయ రాజకీయాలంటున్నారు విశ్లేషకులు. 1980 లోక్‌సభ ఎన్నికల సందర్భంలో దీనికి పునాది పడింది. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై కొన్ని వేల కేసులున్నాయి. అయితే ఈ కేసులపై విచారణ జరపడానికి ఉన్న కోర్టులు సరిపోవడం లేదు. వేలాది కేసులను ఏడాదిలోపు తేల్చేయడానికి ప్రస్తుతం ఏర్పాటు చేసిన కోర్టులు సరిపోవు. దీనిపై సుప్రీంకోర్టు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన విచారించడానికి కోర్టుల సంఖ్య పెంచాలి.
పార్టీలకు ఆ చిత్తశుద్ధి లేదు!
రాజకీయాలు నేరమయమయ్యాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు చట్టసభల్లోకి నేరగాళ్లు ప్రవేశించారు. 1980 లోక్‌సభ ఎన్నికల నుంచి ఈ దుర్మార్గపు ట్రెండ్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అలనాటి జనతా పార్టీ ప్రభుత్వంపై పోరాడటానికి కొంతమంది అసాంఘిక శక్తులను అప్పటి యూత్ కాంగ్రెస్ రంగంలోకి దించిందన్న ఆరోపణలున్నాయి. కండలవీరులైన ఈ అసాంఘిక శక్తులకు ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో సంజయ్ గాంధి టికెట్లు ఇప్పించారు. లోక్‌సభలోకి ప్రవేశించడానికి వారికి మార్గం సుగమం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమైన ఈ ధోరణిని ఆ తరువాత మిగతా పార్టీలన్నీ అనుసరించాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని 2020లో సుప్రీంకోర్టు అన్ని పార్టీలనూ ఆదేశించింది. ఈ ఆదేశాలను అనేక పార్టీలు పాటించడం లేదు. అంతేకాదు, తమపై నమోదైన కేసు వివరాలను టాంపరింగ్ కూడా చేస్తున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు తమ పలుకుబడిని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, తమ మీద నమోదైన కేసులను ఉపసంహరించుకునేలా ఆదేశాలు ఇప్పించుకుంటున్నారు. హైకోర్టు అనుమతి లేకుండా కేసులను ఉపసంహరించరాదని న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలు కూడా అమలుకు నోచుకోవడం లేదు. ముందుగా అధికార పార్టీకి నేర రహిత రాజకీయ వ్యవస్థ అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలి. చట్టసభల్లో నేరస్తులను అడ్డుకునే విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు, ఆదేశాలను అలాగే సుప్రీంకోర్టు సూచనలు నూటికి నూరుశాతం అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు రాజకీయ పండితులు.
నేర చరిత్రవున్నా టికెట్లు !
కొన్ని దశాబ్దాలుగా రాజకీయ పార్టీలకు గెలుపు గుర్రాలే ముఖ్యమవుతున్నాయి. కేవలం ఎన్నికల్లో గెలవడం, అధికారంలోకి రావడమే రాజకీయ పార్టీలకు పరమావధిగా మారింది. నేరచరితులకు, రకరకాల కుంభకోణాల్లో చిక్కుకున్న వారికి, టికెట్లు ఇచ్చి బరిలో నిలుపుతున్నాయి రాజకీయ పార్టీలు. కానీ ఇవేవి పట్టించుకునే పరిస్థితిలో పార్టీలు లేవు. ఇది ప్రజాస్వామ్యంలో దురదృష్టకర పరిణామం. ఈ ధోరణి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు! రాజకీయ పార్టీలు కూడా నేర చరిత్ర లేని వారికే టికెట్లు ఇస్తామని చెప్పే ధైర్యం చేయడం లేదు. దీంతో నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. తమది భిన్న రాజకీయ సంస్కృతి అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన వారిలో 205 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 39 శాతం మందిపై హత్య, అల్లర్లు. మహిళల పట్ల అసభ్య ప్రవర్తన వంటి తీవ్రమైన కేసులున్నాయి. అంతేకాదు ఈ 205 మందిలో ఎక్కువ మంది బీజేపీ తరఫున గెలిచిన వారే కావడం విశేషం.
భారతదేశ రాజకీయాల డైనమిక్స్ కొంతకాలంగా మారుతోంది. ఒకప్పుడు రాజకీయాల్లో ప్రవేశించిన నేరగాళ్లు చాలా సైలెంట్‌గా ఉండేవారు. తమ నేరమయ జీవితం గురించి ప్రస్తావించడానికి సిగ్గుపడేవారు. అయితే కొంతకాలంగా నేరగాళ్ల వైఖరిలో మార్పు వచ్చింది. రాజకీయ నాయకులు తమపై ఉన్న క్రిమినల్ కేసుల గురించి బాహాటంగా వెల్లడిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను బెదిరించడానికి తమకు నేర చరిత్ర ఉన్న విషయాన్ని కూడా అదేదో పెద్ద కిరీటంలా..గొప్పగా చెప్పుకుంటున్నారు. నేరగాళ్లను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవడంలో ఎన్నికల సంఘం బలహీనంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నేరరహిత రాజకీయాలకు పొలిటికల్ పార్టీలు ముందుకు రావాలి. రాజకీయాల్లో నేరగాళ్లకు కళ్లెం వేసే దిశగా రాజకీయ పార్టీలు అడుగులు వేయాలి. అప్పుడే చట్టసభల్లో నేరగాళ్ల ఎంట్రీకి ఫుల్ స్టాప్ పడుతుంది.
- ఎస్. అబ్దుల్ ఖాలిక్
సీనియర్ జర్నలిస్ట్
63001 74320