- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉన్నది ఉన్నట్టు:వారు కదలరు.. వీరు కదిలించరు
ఒకప్పుడు ప్రజలకు కష్టాలొస్తే ఠక్కున గుర్తుకొచ్చేది కమ్యూనిస్టు పార్టీలే. ఏ ఆందోళనలో చూసినా ఎర్ర జెండాలే కనిపించేవి. ఇరవై ఏళ్ల కింద చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలను పెంచినందుకు ఆ పార్టీల నాయకత్వంలో ప్రజలు వీధులలోకి వచ్చారు. తగ్గించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. చివరకు బషీర్‌బాగ్ దగ్గర పోలీసు కాల్పులలో ముగ్గురు చనిపోయారు. ప్రజల తలలో నాలుకలాగా గుర్తింపు పొందాయి వామపక్షాలు. ఇప్పుడు ఉనికి లేకుండా పోయాయి. ప్రజా సంఘాలు ఉన్నా ప్రజలను కదిలించడంలో విఫలమయ్యాయి. పార్టీ కేడర్ మాత్రమే పాల్గొంటూ మొక్కుబడి ఆందోళనలతో సరిపెట్టక తప్పడంలేదు. చివరకు దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు జరిగిన సార్వత్రిక సమ్మెలోసైతం కార్మిక సంఘాల నేతలు, కార్యకర్తలే పాల్గొన్నారు.
అన్ని పార్టీలదీ అదే తీరు. ప్రజా సమస్యల పేరుతో రోడ్డెక్కుతున్నాయి. ప్రజా పోరాటాలను నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్నాయి. కానీ, ఆ పోరాటాలలో, నిరసనలలో, ఆందోళనలలో ప్రజలను మాత్రం భాగస్వాములను చేయడం లేదు. కేవలం పార్టీ కార్యక్రమంగానే నిర్వహిస్తున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులకే పరిమితం చేస్తున్నాయి. ప్రజలు లేని ప్రజా పోరాటాలు గా మార్చేశాయి. ఆ పార్టీల దృష్టిలో ప్రజలు కేవలం ఓటర్లు మాత్రమే. వారి ఓట్లను పొందడం ఎలా అన్నదే వాటి ధ్యాసంతా. తాజాగా పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా టీఆర్ఎస్ నిర్వహించిన ఒక రోజు ఆందోళనలో ప్రజలెవ్వరూ పాల్గొనలేదు.
విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ బీజేపీ నిర్వహించిన ఆందోళనా అదే తీరులో జరిగింది. వడ్ల కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ధోరణి సైతం అందుకు భిన్నంగా ఏమీ లేదు. పొలిటికల్ మైలేజీ కోసమే పార్టీలు పాకులాడుతున్నాయి. ప్రజలతో సంబంధం లేకుండా వారి పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నాయి. ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారంటూ అన్ని పార్టీలూ ఆరోపిస్తున్నాయి. కానీ, ఆ సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలను మాత్రం కదిలించలేక పోతున్నాయి. వారిని ఆ ఆందోళనలలోకి రప్పించలేకపోతున్నాయి. సమస్యలు ప్రజలవే అయినా వారు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. పెట్రోలు, డీజిల్ ధరలు, విద్యుత్ చార్జీల పెంపుతో బాధితులవుతున్నది ప్రజలే. కానీ, గతంలో లాగా వారు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రోడ్లెక్కే పరిస్థితి లేదు. వారిని చైతన్యపర్చి పోరాటాలలోకి తీసుకొచ్చే పరిస్థితి అంతకన్నా లేదు.
రాజకీయ ఆధిపత్యం కోసమే
వడ్ల కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ తీరు స్పష్టంగా అర్థమవుతున్నది. ఇంతకాలం వడ్లను కొంటున్నది తామేనంటూ టీఆర్ఎస్ నేతలు గొప్పగా చెప్పుకున్నారు. కొనేది లేదంటూ కేంద్రం క్లారిటీ ఇవ్వడంతో టీఆర్ఎస్ గొంతులో వెలక్కాయ పడినట్లయింది. కొనాల్సింది కేంద్రమేననే కొత్త పాటను అందుకున్నది. ఇదంతా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న డ్రామా అని ప్రజలకు అర్థమైంది. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రెండు పార్టీలు వాటి వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. రెండింటినీ తూర్పార పట్టాల్సిన కాంగ్రెస్ సైతం ప్రకటనలకు, విమర్శలకు మాత్రమే పరిమితమైంది.
వరి రైతులను స్వయంగా కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే దిశగా చేపట్టిన కార్యాచరణ శూన్యం. అన్ని పార్టీలదీ అదే ధోరణి. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల ఓట్లను కొల్లగొట్టడం, అధికారంలోకి రావడమే వాటి అంతిమ లక్ష్యం. ప్రజల సమస్యలపై పోరాడుతున్నది తామేనంటూ క్రెడిట్ కొట్టేయడానికే ఈ తపనంతా. ప్రజల తరఫున పోరాడేది తామంటే తాము అంటూ బిల్డప్ ఇచ్చుకోడానికి పోటీ పడుతున్నాయి. ఒక పార్టీపై మరొకటి రాజకీయ విమర్శలు చేసుకుంటున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు విషయంలో బీజేపీని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ రోడ్డెక్కింది. విద్యుత్ ధరల విషయంలో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా బీజేపీ కూడా అదే పనిచేసింది. ఈ రెండు పార్టీలూ ప్రజలను పక్కన పెట్టేశాయి. పార్టీల కార్యక్రమాలు గానే నిర్వహించాయి. ప్రజల కోసం కొట్లాడేది మేమంటే మేము అంటూ క్లెయిమ్ చేసుకుంటున్నాయి. ప్రజలను అప్రాధాన్యం చేశాయి.
పరస్పర ఆరోపణలతోనే సరి
వాస్తవాన్ని కప్పిపుచ్చుతూ సమస్యల నుంచి ప్రజలను రాజకీయ పార్టీలు పక్కదారి పట్టిస్తున్నాయి. తప్పు ఎవరిదో బైటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఒక పార్టీపై మరొకటి విమర్శలు చేసుకుంటున్నాయి. విద్యుత్ చార్జీల పెంపు అంశంపై ప్రజలలో వ్యతిరేకత పెల్లుబుకుతుందని టీఆర్ఎస్ ముందుగానే పసిగట్టింది. ఇది ప్రజాందోళనకు దారితీయకుండా జాగ్రత్త పడింది. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు అంశాన్ని తెరపైకి తెచ్చి దానికి వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. అంశాన్ని డైవర్ట్ చేయడమే ఏకైక లక్ష్యం కావడంతో ప్రజలతో సంబంధం లేకుండా పార్టీ కార్యక్రమంగానే నిర్వహించింది. అనుకున్నది సాధించింది.విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజలలో చర్చకు తావులేకుండా చేయగలిగింది.
పెట్రోలు, డీజిల్ ధరల పెంపు అంశంలో కార్నర్ కాకుండా ఉండేందుకు బీజేపీ సైతం విద్యుత్ చార్జీల ఇష్యూను టేకప్ చేసింది. పార్టీ కార్యకర్తలతో ఒక రోజు హడావుడి చేసింది. కేంద్ర ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరగకుండా, దృష్టి పడకుండా చూసుకున్నది. ఈ రెండూ ప్రజల జీవితాలపై నేరుగా ప్రభావం చూపేవే. వారిని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేవే. కానీ వాటికి పరిష్కారం చూపాల్సిన పార్టీలు నిర్లజ్జగా వ్యవహరిస్తున్నాయి. 'తప్పు నీదంటే నీది' అంటూ తప్పించుకుంటున్నాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ప్రజలను ఎడాపెడా వాయిస్తున్నాయి. సంక్షేమం పేరుతో ఒక చేత్తో విదిలిస్తూ మరో చేత్తో వసూలు చేస్తున్నాయి. వాస్తవాలను అర్థం చేయించాల్సిన బాధ్యత నుంచి తప్పుకున్నాయి. అడపాదడపా ఇష్యూ బేస్డ్ గా బహిరంగ సభలను నిర్వహిస్తూ ప్రజలను తరలించడం వరకే పరిమితమవుతున్నాయి. బలప్రదర్శనకు వేదికగా వాడుకుంటున్నాయి.
కనుమరుగైన కమ్యూనిస్టులు
ఒకప్పుడు ప్రజలకు కష్టాలొస్తే ఠక్కున గుర్తుకొచ్చేది కమ్యూనిస్టు పార్టీలే. ఏ ఆందోళనలో చూసినా ఎర్ర జెండాలే కనిపించేవి. ఇరవై ఏళ్ల కిందట చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలను పెంచినందుకు ఆ పార్టీల నాయకత్వంలో ప్రజలు వీధులలోకి వచ్చారు. తగ్గించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. చివరకు బషీర్‌బాగ్ దగ్గర పోలీసు కాల్పులలో ముగ్గురు చనిపోయారు. ప్రజల తలలో నాలుకలాగా గుర్తింపు పొందాయి వామపక్షాలు. ఇప్పుడు ఉనికి లేకుండా పోయాయి. ప్రజా సంఘాలు ఉన్నా ప్రజలను కదిలించడంలో విఫలమయ్యాయి. పార్టీ కేడర్ మాత్రమే పాల్గొంటూ మొక్కుబడి ఆందోళనలతో సరిపెట్టక తప్పడంలేదు.
చివరకు దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు జరిగిన సార్వత్రిక సమ్మెలోసైతం కార్మిక సంఘాల నేతలు, కార్యకర్తలే పాల్గొన్నారు. బ్యాంకింగ్ రంగం మాత్రమే పాక్షికంగా ప్రభావితమైంది. ప్రజా రవాణా సహా రోజువారీ కార్యకలాపాలన్నీ యధావిధిగానే జరిగాయి. ప్రభుత్వాల విధానాలు ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో వామపక్షాలు సైతం అర్థం చేయించలేక పోతున్నాయి. చైతన్యం రగిలించి ఉధృతంగా ఉద్యమాల దిశగా డ్రైవ్ చేయించడంలో ఫెయిల్ అవుతున్నాయి. వారికి నాయకత్వం వహించలేక పోతున్నాయి. ప్రజలు సైతం ఎర్రజెండాలు అండగా ఉంటాయన్న భరోసాను కోల్పోయారు.
వారికి కావలసింది అదే
ప్రజలు వాస్తవాలను గ్రహించకుండా ఉండడమే ప్రధాన రాజకీయ పార్టీలకు కావాల్సింది. ఆ పరిస్థితి కొనసాగినంతకాలం అవి సేఫ్ జోన్‌లో ఉన్నట్లుగానే భావిస్తుంటాయి. అందుకే పెట్రో ధరలు పెరిగినా, రిజిస్ట్రేషన్, విద్యుత్ చార్జీలు ఎంతగా పెంచినా, విత్తన, ఎరువుల, ఇన్‌పుట్ సబ్సిడీలాంటివి నిలిపేసినా, రైతుబంధు, ఉచిత వ్యవసాయ విద్యుత్ లాంటి సంక్షేమాలతో ఆదుకుంటున్నామన్న భ్రమలను కల్పిస్తున్నాయి అధికార పార్టీలు. ప్రజలు కూడా ఉచిత పథకాలకు అలవాటుపడ్డారు. అందుకే ఉద్యమాల్లో భాగస్వాములు కావడంలేదు. ఓట్లు పడితే చాలన్నది పార్టీల భావన. తమ తలరాతను డిసైడ్ చేసేది పార్టీలు కాదని, తామేనని గ్రహించప్పుడే ప్రజలు వారి బతుకులను వారు మార్చుకోగలుగుతారు. కదలాల్సింది ప్రజలే అయినా కదిలించాల్సింది మాత్రం సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులు, శక్తులు.
ఎన్. విశ్వనాథ్
99714 82403