పోలీసు అమరవీరుల యాదిలో కవిత

by Ravi |   ( Updated:2022-10-20 18:30:13.0  )
పోలీసు అమరవీరుల యాదిలో కవిత
X

అద్దంలో చూసుకుంటూ

అలిగిన నీ యవ్వనాన్ని

అద్దంలో చూసుకుంటూ

ఎన్నో ఆశలను, ఆశయాలను చిలకొయ్యకు తగిలేసి

అందమైన నీ ప్రపంచాన్ని అదిమి పెట్టుకొని

బాధను పిడికిలి గుండెలో దాచిపెట్టి

బీటు డ్యూటీలో నైటంతా గస్తీ చేస్తే

ఈ నగరమంతా హాయిగా నిదురపోయే

ఎగలివారే పొద్దున అలిగిన నీ యవ్వనాన్ని అద్దంలో చూసుకుంటూ

కానరాని కలవరాన్ని కెమెరా కన్నుతో రెక్కి చేస్తే

కల్లొలిత ప్రాంతమంత కనుల నిండ పండుగాయే

రాత్రంతా ఒంటరిగా సెంట్రీ డ్యూటీ చేస్తే

ఒల్లంత దద్దర్లతో దోమల జాగారమాయే

ఆదివారం తెలియని నీ యవ్వనాన్ని అద్దంలో చూసుకుంటూ

అక్కెరకచ్చే సుట్టమల్లే హైవేపై

ఆగిపోయే ప్రాణానికి నీకు ఆయువయ్యే

చైన్​స్నాచర్ల చేజింగ్‌లో

ఆ దొంగల కత్తిపోటుకు నువ్వు రక్తపు మడుగయ్యే

ఫోన్​రింగ్‌తో రంగుల కలను వదిలి

చెమ్మగిల్లిన కండ్లను తడుచుకుంటూ

ఆలి మీద ప్రేమను ఖాకీ చొక్కా వేసుకొని

ఆ ప్రేమను నీ పర్సులో ఫొటోగా దాచుకొని

ఆదర బాధరగా అందరి బాధలు నీవయ్యే

అలిగిన నీ యవ్వనాన్ని

అద్దంలో చూసుకుంటూ

తూర్పు కొండల్లో తీవ్రవాదులకు సింగమై

ఎదురు కాల్పులలో తూటలకు ఒళ్లు తూట్లయి

ల్యాండ్​ మైనుల్లో లేనువు తునకలై

ఎవరూ లేని అనాధ శవమై ఎందరికో సుఖమై

ఆరిన నీ యవ్వనాన్ని గుర్తు చేస్తూ

గోడ మెకుకు తగిలేసిన ఫొటోపై

ప్రతీ వసంత గీతాన నీ మెడలో

నా కవిత పూల మాలై నిలిచి ఉండేనా?

నీ త్యాగాల పునాదులపై

ఎప్పటికీ చెరుగలి సింగిడయ్యేనా!

సెల్యూట్ పోలీసన్నా

ధ్రువ ఎల్. తిరుపతి

అసిస్టెంట్ పీపీ,​దుబ్బాక కోర్టు

99634 02437

Advertisement

Next Story

Most Viewed