- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీటి చరియల పొరల్లో ఈదుతున్న చేపలగుంపులు
మబ్బుల్లో నుండి నదులు భూమికి
ప్రవహిస్తున్నాయా?!
ఏరులు నదులవుతున్నాయి.
నదులు సముద్రాలవుతున్నాయి.
గుండెలు చెరువులవుతున్నాయి.
కన్నీరు మున్నీరవుతుంది.
ముంపులో జనులు
విగత జీవులవుతున్నారు.
మరణానికి ముందు ఒక రణం.
ఆకలితో కేకలేస్తూ మృతి.
వ్యథపూరిత గాథలతో
నిండిన నగరం.
ఆ తల్లి బిడ్డకు పాలు లేక,
ఆ ముదుసలి దాహార్తితో,
ఆ యువకుడు ఉరవడిలో,
ఆ యువతి సుడిలో,
ఆ ముదిత పూజా మందిరంలో
ఊపిరులు అందక
ఆయువులు వదిలారు.
కన్నీటి ధారలో
కరుణార్ధ్రమైన దృశ్యాలు.
కన్నీటి ధారలకు అద్దం
పట్టలేని అక్షర అభాగ్యులు.
రాజకీయ క్రీడలో ప్రజలు పావులు.
వ్యధితుల గుండె చప్పుళ్ళకు
అద్దం పట్టలేని అక్షర వ్యాపారులు.
మనుషులు చస్తున్నా
రాజు చెవికి ఫిడేల్ ధ్వనులు
వినిపిస్తున్న భృత్యులు.
దృశ్యం మసకబారుతుంది.
అబద్దానికి ఆకాశమంత శీర్షిక.
ప్రతి జీవికీ మరణం తథ్యం సుమీ!
ఆ వాచాలుడు జనం ఆర్తనాదాలు
పెద్దతెరల్లో డక్ స్వరాల్లో వింటున్నాడు.
నక్కలు మూల్గినట్టు
మంద్ర స్వరంతో సందేశాలిస్తున్నాడు.
నిన్నటి దాకా 'కులం కులం' అని
అరచినవారే తమ వాడలన్నీ
ముంపులో మునిగిపోతే వీక్షకులయ్యారు.
నినాదాలు కడుపునింపవు కదా!
కులంగోడలు కూల్చమని ఆయన చెబితే
కులం కంచెలను మీరు పాతుతున్నారు.
అతడు అంతఃపురాన్ని
నదీ తరంగాల సడిలో కట్టాడు.
అందులో చతుష్పాదులే ఉన్నాయి.
దాని రక్షణకు భటులు
అగడ్తలు నిర్మించి
నగరాన్ని ముంచారు.
అతని కోటలు పక్క రాజ్యంలో
సురక్షితంగా ఉన్నాయి.
నివాసులకు నీడ లేదు.
ప్రవాసులదే పెత్తనం.
దేశాన్ని దండుకున్న వాళ్లంతా
పిడికెడు భిక్ష వేస్తున్నారు.
మనమంతా ఒకే మతం
అన్నవారెవరూ కంటికి
కనిపించడం లేదు.
వీరికి దృశ్యం ఒక వ్యాపారం.
దేవుడి పేరుతో కోట్లు గడించి
బంగారు శిలువలు మోస్తున్నారు.
పాపం! ఆ వించ్ పేట
పేద పాస్టర్ మాత్రం
బడుగుల్ని రక్షించడానికి వరదలో
దూకి కొట్టుకుపోయాడు.
బుడమేరు నిన్న.. ఈరోజు కొల్లేరు
జడి వానతో ముంపు
జమిలిగా దాడి చేస్తుoది.
ప్రపంచ దేశాల నుండి ఆగమించే
రంగురంగుల పక్షులు
అంతర్థానమవుతున్నాయి.
ఎవరో అడివినంతా నరికి
ఎర్ర దుంగలు అమ్ముకున్నారు.
పులులు మదుగులేక
ఆవాసాల కొరకు ఉరుకుతున్నాయి.
జనావాసాల్లో ప్రజలు దొరక్క
ఆ కోటలో దొరల రక్తం రుచి చూస్తున్నాయి.
ఈ దొరలు ఇంతకుముందే
మనుషుల రక్తం తాగి ఉన్నారని
ఆ పులులు గుర్తించాయి.
ఆ పులి ఆ వీధుల్లోకి వచ్చిన
ఆ విధవరాలు పీక్కుపోయిన
కళ్ళలోకి చూసి వెనుదిరిగింది.
ఆ కామాంధుడు మాత్రం
ఆమెను వేటాడుతూనే ఉన్నాడు!
ఆ ఏనుగులు.. అడవుల్లో
చెట్ల గుంపులు మందగించి
ఆ దేవాలయాల పరిసరాల్లోకి ప్రవేశించాయి.
ఆ విగ్రహాన్ని ధ్వంసించాయి.
ఆ పూజారులు ఆ ఏనుగునే
కొలవడం ప్రారంభించారు.
దేవత పశువైనా, విగ్రహమైనా, వృక్షమైనా
నైవేద్యం ఆ పురోహితునికి దినభిక్ష.
దేశం ఎటు పోతేనేo?!
ఆ పులిహోరలో జీడిపప్పులు
ఎన్ని ఉన్నాయనేదే ప్రశ్న!
ఆ ప్రచార కవి తల్లి
దళితవాడలో ముంపులో
మునిగి ఉంది.
ఆ కవి వాట్సప్‌లో
జలపాతాల దృశ్యాలు చూస్తున్నాడు!
తుఫాను మనిషి అంతరంగానికి
అద్దం పడుతుంది.
రాతి గుండెలపై రాసిన
శాసనాలను బయటకు తీస్తుంది.
కూలిపోయిన గుడిసెల్లోనే కాదు,
కూలిపోయిన కోటల్లో కూడా
చరిత్ర దాగి ఉంది.
ఏది శిథిలమవుతుందో
అది పునర్నిర్మించబడుతుంది.
సూర్యుడు ఆ నిష్కార్యుల ముఖాలు చూడలేక
మబ్బుల వెనుక దాక్కుంటున్నాడు!
ఆ కొండ అంచుల మీద నిలబడిన
పక్షి ఒకటే చెప్తుంది.
"నీతి నిజాయితీ లేని మనుషులు
జీవించినా మరణించినట్టేనని".
ప్రకృతిలో కృతి ఉంది.
అది పునరుజ్జీవనమవుతుంది.
ఆ కొల్లేరు సరస్సులో అంతర్గతంగా
ఈదుతున్న చేపల గుంపు
నీటి చరియల పొరల్లో
దేశ చరిత్రను రాస్తున్నాయి
"మనిషి ప్రకృతి విధ్వంసకుడవుతున్నాడని".
ఆ బిడ్డను పొదిగిట్లో
తుఫాను నుండి రక్షించిన ఆ తల్లి
కన్నుల్లో దాగివున్న త్యాగ చరిత్రే
పోరాట గాథ.
ఎన్నో తుఫానులను ఎదిరించిన
ఆ వీరగాథలే ఈ దేశ చరిత్రకు జీవనిధులు.
(బుడమేరు విలయతాండవం చేసిన వేళ)
డాక్టర్ కత్తి పద్మారావు.
98497 41695