- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
NDA vs I.N.D.I.A: ఎవరిది అవినీతి పరుల సదస్సు!
బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ అదో కరుడు గట్టిన అవినీతి పరుల సదస్సు గా అభివర్ణించారు. సొంత కుటుంబాల కోసమే కూటమి కట్టారని, అవినీతిని ప్రోత్సహించడానికి ప్రతిపక్షాలు సమావేశం అని ప్రజలు భావిస్తున్నారని, స్వార్థ ప్రయోజనాల కోసం నేతలంతా ఒకే చోట బేటీ కావడాన్ని అవినీతికి చిహ్నంగా ప్రజలు అనుకొంటున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కుటుంబాల అవినీతిని పెంచి పోషించడమే వారి కనీస ఉమ్మడి ప్రణాళిక అని, దేశ దుర్గతికి కారణమైన ఆయా పార్టీల నేతలు విషపూరితమైన కుల,అవినీతి దుకాణాలను మళ్ళీ తెరిచారని ప్రధాని మోడీ ప్రతిపక్షాల భేటీ పై అక్కసు వెళ్ళగక్కారు. సంతోషం.
మీకు ఆరోపించే అర్హత ఉందా?
అయితే, ప్రజలు మీకే మళ్ళీ అధికారం ఇస్తారని మీరు విశ్వాసంతో ఉన్నారు. మరి ప్రతిపక్షాల సమావేశం అంటే ఎందుకు భయపడుతున్నారు మోడీజీ? ఎందుకు వారిపై అక్కసు వెళ్లగక్కుతున్నారు ప్రధాని మోడీ ఆరోపణలు వినే వారికి వినసొంపు గానే ఉన్నాయి. మరి ప్రధాని మోడీ దృష్టిలో ఎవరు అవినీతి పరులు? ఎవరు నీతిమంతులు? బీజేపీకి మద్దతుగా నిలిచేవారు నీతి మంతులా లేక బీజేపీని వ్యతిరేకించే వారు అవినీతి పరులా? ఎవరు అవినీతి పరులో,ఎవరు నీతి మంతులో తేల్చుకునే స్థితిలోకి ప్రజలను నెట్టారు మీరే. అధికారం కోసం, రాజకీయ అవసరాల కోసం అవినీతి పరులను అక్కున చేర్చుకోవడాన్ని ఏమనాలి?
ప్రధాని మోడీ అవినీతిపరుడు అని ఎవ్వరూ అనరు. కానీ రాజకీయ అవసరాల కోసం అవినీతి పరులను ఆదరించడం అవినీతి పరులను కాపాడటం కాదా? అత్యంత అవినీతి పరుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రదర్శిస్తున్న ఔదార్యం దేనికి సంకేతం? రాజకీయంగా తమకు మద్దతు ఇవ్వని ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీ కేసులతో వేధిస్తున్న కేంద్ర ప్రభుత్వం... భయంకరమైన అవినీతి కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయిన వారిపై డజన్లు కొద్దీ సీబీఐ కేసులు నమోదై పన్నెండు ఏళ్ళు దాటినా ముందుకు పోకుండా అడ్డుకుంటున్నది ఎవ్వరు? వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించింది ఎవరో ఇప్పటికే తెలిసినా నిందితులను సీబీఐ అధికారులు అరెస్టు చేయలేకపోవడానికి కారణం ఎవ్వరు? ప్రధాని మోడీ ఆరోపణలకు చేతలకు ఏమన్నా పొంతన ఉన్నదా? బీజేపీకి మద్దతుగా నిలిచిన అవినీతిపరులు గద్దెనెక్కడానికి మద్దతుగా నిలిచినవారికీ ఇతరులపై అవినీతి ఆరోపణలు చేసే అర్హత ఉన్నదా? టన్నుల కొద్దీ పత్రాలు, సాక్ష్యాధారాలు, డజన్ల కొద్దీ చార్జిషీట్లు కళ్ళకు కడుతున్నా, వేల కోట్ల ప్రజాధనం లూటీ జరిగిందని సీబీఐ నిగ్గు తేల్చినా ఆ అవినీతిపరులపై మీరు తీసుకొన్న చర్యలేంటి మోడీజీ!
మీ సుభాషితాలకు.. విలువ ఏది?
ఒక పక్కన అవినీతిపరులని తెలిసి కూడా అవినీతి పరులను పక్కన కూర్చోబెట్టుకుంటూ, వారికి అండగా నిలుస్తూ ప్రతిపక్షాలు అందరూ అవినీతిపరులంటూ ఆరోపణలు ఎలా చేస్తారు? బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచిన వారు, మద్దతు ఇచ్చిన వారు ఎంత అవినీతికి పాల్పడినా పర్వాలేదా? బీజేపీకి మద్దతు ఇస్తున్న అవినీతి పరులందరు నిర్దోషులని ప్రధాని మోడీ నమ్ముతున్నారా అలా భావిస్తే ఆ మాటే ప్రజలకు చెప్పండి, మీకు మద్దతు ఇస్తున్న వారిపై వున్న కేసులు ఎత్తి వెయ్యండి. ఒక పక్క అవినీతి ఆరోపణలు ఉన్న వారి పట్ల ఉదాసీనత చూపిస్తూ, మరో పక్క ప్రతిపక్షాలు అవినీతిపరులని చేస్తున్న ఆరోపణలకు విలువ ఉంటుందా? బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో వున్న రాష్ట్రాల్లో మంత్రులుగా ఉన్నవారు అవినీతికి పాల్పడినా, ఆయా రాష్ట్రాల్లో అవినీతి ఆరోపణలు వచ్చినా మంత్రులపై సీబీఐ, ఈడీ అధికారుల దాడులు జరగనే జరగవు, వారిపై ఈగ కూడా వాలదు. అదే ఇతర రాజకీయ ప్రభుత్వాల మంత్రులపై ఆరోపణలు రావడమే ఆలస్యం వారి ఇళ్లపై సీబీఐ, ఈడీ అధికారులు వాలిపోతారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బీజేపీలో జాయిన్ అవగానే పవిత్రులుగాను, అవినీతి ఆరోపణలు వచ్చిన వారు బీజేపీలో చేరకుండా బీజేపీని అవినీతి పరులుగా చూపిస్తున్నారు. ఇంతటి వ్యత్యాసం చూపుతున్నప్పుడు మీరు చెబుతున్న సుభాషితాలకు విలువ ఏమి ఉంటుంది?
అధికారంలోకి రాగానే రాజకీయ నాయకులపై వున్నఅవినీతి కేసుల లెక్క తేలుస్తామని, విచారణ వేగంగా పూర్తి చేసి రాజకీయాలను ప్రక్షాళన చేస్తామని 2014 ఎన్నికల ప్రచార సభల్లో మోడీ హామీ ఇచ్చి పదేళ్ళు కావస్తుంది. మరి పదేళ్లుగా అవినీతిపరులపై ఈగైనా వాలిందా? అవినీతి పరుల అంతు చూసే బలం, చేవ, ధైర్యం, సమర్ధత ఉండి కూడా చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటి? 2014 ఎన్నికల్లో అధికారం ఇస్తే అచ్చే దిన్ తెస్తాను అన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక ఆర్థిక నేరస్థులకే అచ్చే దిన్ వచ్చింది నిజం కాదా? ఎల్లలెరుగని అవినీతికి పాల్పడి దేశ ద్రోహానికి పాల్పడిన ఆర్ధిక నేరస్థులకు అండగా నిలవడంపై దేశ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?
నేరస్థుల పట్ల.. ఉదాసీనతా?
ఆర్థిక నేరస్థుల కేసులపై విచారణ పూర్తికావడానికి, తీర్పు రావడానికి ఏళ్ళకు ఏళ్ళు పట్టడం దారుణం. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పుకోవడానికి తప్ప ఆచరణలో ఎక్కడ అమలు అవుతుంది? చిన్న చేపల విషయంలో బారెడు సాగే చట్టం బడా తిమింగలాల కేసులకు వచ్చేసరికి చట్టం ఎందుకు ముడుచుకు పోతుంది? దేశంలో అవినీతి కేసులు ఎన్నేళ్లకు తెములుతాయో చెప్పగల నాధుడు లేడు. న్యాయస్థానాల ఆదేశాల మేరకు విచారణ జరుగుతున్న కేసుల్లో కూడా సత్వరం దోషులకు శిక్షలు పడతాయనుకొనే వీలు లేకుండా పోయింది. ప్రభుత్వ సహకారంతో వేలకోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వారిపై విచారణ జరిగే తీరు ఇదేనా టన్నుల కొద్దీ పత్రాలు సాక్షాధారాలు వున్న కేసుల విచారణ నత్తనడక నడవడంలో ఔచిత్యం ఏమిటి? వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేసిన వారి పట్ల కేంద్ర ప్రభుత్వం, సీబీఐ ఉదాసీనంగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి?
అధికారంలోకి వస్తే ఆర్థిక నేరస్థుల అంతు చూస్తానని ఇచ్చిన హామీ కూడా నేతి బీర చందమైంది. ఆ హామీకి విలువ ఇవ్వక పోవడంతో దేశ ప్రజల ఆశలు ఆవిరయ్యాయి. ఆర్థిక నేరస్థులను సహించేది లేదన్న మోడీ విస్పష్ట హెచ్చరిక పసలేనిదిగా మిగిలి పోయింది. ముందు మీకు మద్దతు ఇస్తున్న అత్యంత అవినీతి పరుల అంతు చూడండి, ఆ తర్వాత ఇతరులపై అవినీతి ఆరోపణలు చేయండి మోడీజీ.
నీరుకొండ ప్రసాద్
98496 25610