- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలు కరెక్టేనా?
తెలంగాణ సీఎం కేసీఆర్ తాజా రాష్ట్ర బడ్జెట్ ముగింపు ప్రసంగం సందర్భంగా 1 గంట 40 నిమిషాలు మాట్లాడారు. కానీ తన కంఠంలో సహజంగా ఉండే కేసీఆర్ ట్రేడ్ మార్క్ వాయిస్ లేదు, సబ్జెక్టులో బేస్ లేదు. విమర్శించక తప్పదు కాబట్టి మోడీ మీద విమర్శ తప్ప, మనసులో ఏదో బెంగ ఉంది. పార్లమెంటులో మోడీ స్పీచ్‌లో ఒక ఛాలెంజ్ కనిపిస్తే, కేసీఆర్ స్పీచ్‌లో ఆత్మస్థైర్యం లోపించింది, విమర్శిస్తూనే, విజ్ఞప్తి చేస్తున్నట్లు ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి, మధ్యమధ్యలో ఈటల రాజేందర్‌కు ఒక స్నేహ హస్తం ఇస్తున్నట్లుగా కన్పిస్తుంది. ఇక కమ్యూనిస్టుల కథ మునుగోడుతో తీరినట్లు ఉంది. తెరాసను భరోసాగా చేసి, రెంటికి చెడ్డ రేవడిగా మారామా అన్న సందేహం మొదలైనట్లు ఉంది.
తెలంగాణ బడ్జెట్‌ను సత్యం రామలింగరాజు లెక్కల లాగ ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి మోడీపై ఆరోపణలు చేసే నైతిక హక్కులేదు. ఉదాహరణకు 2022 - 2023 బడ్జెట్లో దళిత బంధుకు ప్రకటించిన బడ్జెట్ రూ.17,000 కోట్లు అయితే, ఖర్చు పెట్టింది కేవలం రూ.3,300 కోట్లు మాత్రమే. ఈ లెక్క తప్పు అని కేసీఆర్ నిరూపించగలరా? ఎంబీసీలకు ఎంతో ఘనంగా రూ. 2,507 కోట్లు బడ్జెట్లో పెట్టి, చివరకు రూ. 7 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన ప్రభుత్వం లెక్కలు, ఎక్కాల గురించి మాట్లాడటం విడ్డూరం.
వృద్ధిలో రికార్డు
భారత్ ఆర్థిక వ్యవస్థ 3.5 ట్రిలియన్ డాలర్ల నుండి 5 ట్రిలియన్ డాలర్లకు చేరడంలో గొప్ప ఏముంది? ఈ లక్ష్యం చాలా చిన్నది, అది జోక్ అఫ్ ఇండియా అనే వ్యంగ్యాస్త్రం? మన్‌మోహన్ సింగ్ హయాంలో వృద్ధి రేటు ఎక్కువ ఉండె అంటున్నారు. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే వృద్ధి రేటు ఎలావుంది అనేది ముఖ్యం. కరోనా కారణంగా అనేక అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి రేటు తగ్గినా, భారత్ వృద్ధి చెందుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ 1 ట్రిలియన్ డాలర్ చేరటానికి 60 ఏండ్లు పట్టింది, 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి 12 ఏండ్లు పట్టింది (2014 లో భారత్ 11 రాంక్ ), అదే 3.5 ట్రిలియన్ డాలర్ చేరటానికి కేవలం 5 ఏండ్లు పట్టింది. అది మోడీ ఘనత. 2027 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని, ప్రపంచంలో 3వ అతి పెద్ద జీడీపీని నమోదు చేసే లక్ష్యం చిన్నది కాదు, ఇవి కేసీఆర్‌కిలాగా అలవి కాని హామీలు కావు. అయినా భారత్ ఆ లక్ష్యం చేరుకుంటుంది.
తలసరి ఆదాయం
పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక మనకంటే అద్భుతంగా ఉన్నాయ్ అని కేసీఆర్ అంటుంటే అసలు తన మానసిక పరిస్థితి మీద ప్రజలకు సందేహం కలుగుతుంది. తలసరి ఆదాయం ఎంత ఉన్నా పీపీపీ (పర్చేసింగ్ పవర్ పారిటీ) అంటే కొనుగోలు శక్తి ప్రకారం ఇండియా జీడీపీ 11.5 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థగా ఉంది. అంటే ప్రపంచంలో 3 రాంక్. క్లుప్తంగా చెప్పాలంటే అమెరికాలో ఒక కోటి రూపాయలతో వచ్చే సదుపాయాలు ఇండియాలో 22 లక్షలతో సాధ్యం అవుతుంది. భారత్ రూపాయికి కొనుగోలు శక్తి ఎక్కువ అని దీనర్థం. ఈ అంశంపై కేసీఆర్ తమ ఆస్థాన ఆర్థిక నిపుణులతో ఒక్కసారి చర్చించాలి.
అసందర్భ వ్యాఖ్యలు?
ప్రభుత్వ సంస్థల సొమ్ము అమ్ముతున్నారు అని కేసీఆర్ అనడం విడ్డురం. ఉన్న ప్రభుత్వ భూములు, దళితుల, బీసీల అసైన్డ్ భూములు, పట్టాలు భూములను లేఔట్ల పేరు మీద అమ్ముకునే కేసీఆర్ నోటి వెంట ఆ మాట విడ్డురం. రైల్వేలకు 2 లక్షల కోట్ల బడ్జెట్ ఇచ్చిన ఘనత మోడీది. అలానే 1947 నుండి 2014 వరకు 70,000 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారులు నిర్మించగా, కేవలం 8 ఏండ్లలో అదనంగా 60,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 70 ఎయిర్‌పోర్టుల నుండి 140 ఎయిర్‌పోర్టులు, బొగ్గు కొరత లేకుండా తీర్చిన ఘనత, మోడీ పాలనది. 2014 లో 387 ఉన్న మెడికల్ కాలేజీలు ఇప్పుడు 596 , అలానే 7 ఎయిమ్స్ ఆసుపత్రులు ఉండగా ఇప్పుడు 22, ఇది పబ్లిక్ సంస్థలను శక్తివంతం చేయటం మోడీకి ఉన్న తపన. క్లుప్తంగా చెప్పాలంటే మోడీ అభివృద్ధిలో హీరో, అవినీతిలో 0. ఒకప్పుడు కేసీఆర్ నోటనే ఆ మాట బహిరంగ సభలో మనం వినలేదా!
నీళ్లు, నిధులు, నియామకాలు
వీటి గురించి కేసీఆర్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక పోచంపాడు (SRSP), కాళేశ్వరం గురించి మాట్లాడితే 1.5 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం చెక్ డాం (ప్రాజెక్ట్ కాదు, డాం అసలే కాదు) వలన గత 6 ఏండ్లలో ఎన్ని టీఎంసీ నీళ్లు ఎత్తారు, లేదా srsp కాల్వలలో పారే నీళ్లు లేదా కాళేశ్వరం నీళ్ల సరఫరా గురించి ఒకసారి నిపుణులతో బహిరంగ చర్చకు సిద్ధమా?
జోక్ ఇన్ ఇండియానా?
కేసీఆర్ పదే పదే ఇండియాను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదు. అక్కడ టార్గెట్ చేసేది మోడీని కాదు భారత్‌ను అని మర్చిపోరాదు. ఇక మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం సాధించిన కొన్ని విజయాలు పరిశీలిస్తే, భారత్ ప్రపంచంలో అతి పెద్ద పాల ఉత్పత్తి చేసే దేశం. ఫోన్ల తయారీలో 2వ రాంక్, టీ తయారీలో 2వ రాంక్, కార్ల తయారీలో 4వ రాంక్ , నూతన యూనికార్న్‌లలో 3వ రాంక్ , మోడీ వచ్చాక 90,000 నూతన ఆవిష్కరణలు, యుద్ధ నౌక విక్రాంత్ , యుద్ధ విమానం తేజస్ , యుద్ధ హెలికాప్టర్ ప్రచండ , నూతన సూపర్ సోనిక్ జెట్ వంటివాటితో పాటు ఇస్రోలో ప్రైవేటు కంపెనీలు దూసుకెళ్తున్నాయి, మొదటిసారి ఆయుధాల ఎగుమతులపై 60,000 కోట్లను లక్ష్యంగా పెట్టుకున్నాం. తాజాగా వందే భారత్ రైళ్లు సంచలనం గొల్పుతున్నాయి. ఇలా ఎన్నో విజయాలు సాధించిన ఇండియాను జోక్ ఇన్ ఇండియా అని అభివర్ణించడం కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకులకు విజ్ఞత కాదు.
కరెంట్, బొగ్గు ఉత్పత్తి, నీళ్లు
2009లో బొగ్గు ఉత్పత్తి 556 మిలియన్ టన్నులు ఉండగా, 2014 లో 557 టన్నులకు మాత్రమే పెరిగింది. అదే మోడీ ప్రధాన మంత్రి అయ్యాక 2022లో దేశీయ బొగ్గు ఉత్పత్తి 911 మిలియన్ టన్నులు అంటే 63% వృద్ధి నమోదు చేసింది. ఇక కరెంట్ విషయానికొస్తే 2014లో 2,37,743 మెగావాట్లు ఉత్పత్తి అయితే అదే 2022లో 4,10,200 మెగావాట్లు ఉత్పత్తి అయింది. ఆ కరెంట్‌నే కేసీఆర్ కొని తెలంగాణకు ఇస్తున్నారు. ఇక పదేపదే దేశంలో 40,000 టీఎంసీ నీళ్లు సముద్రం పాలు అవుతున్నవి అనే ఆరోపించే కెసిఆర్, అదే 2022లో తెలంగాణ దాటి గోదావరి నీళ్లు 4,200 టీఎంసీలు సముద్రంలో కలిస్తే ఎందుకు ఎత్తిపోయలేదు ? ప్రవచనాలు చెప్పే ముందు పాటించడం కూడా ముఖ్యం.
అంతిమంగా భారత దేశ ప్రజలు గుర్తించవలసిన అవసరం భారత్ ఎదుగుదలలో మోడీ గారి పాత్ర కీలకం. మొన్నటి దాకా సరిహద్దుల మీద ఉద్రిక్తత పెంచుతున్న చైనా, మోడీ ఇమేజ్ దెబ్బతీయడం ద్వారా భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీయవచ్చు అని పన్నిన కుట్రలో భాగంగా.., బీబీసీ డాక్యుమెంటరీ , హిండెన్ బర్గ్ రిపోర్ట్. చైనా, వాహబ్బీతో పాటు కొన్ని పాశ్చాత్య దేశాలు చేసే కుట్రలో భాగంగా తెలిసో లేదా మోడీ మీద అక్కసుతో భాగం అవుతున్నారు. కాలమే జవాబు చెబుతుంది, అందులో తెలంగాణ నాయకత్వం భాగం కావొద్దని నా ఆకాంక్ష ! ఇక కేసీఆర్ శక్తి,యుక్తులు హరించుకు పోయినట్టు కనిపిస్తుంది,. ఒకప్పుడు వారే తెరాసకు అండ, కానీ ఇప్పుడు వారే భారంగా మారినట్లు కనిపిస్తుంది. శక్తి సామర్ధ్యాలు ఉన్న నూతన నాయకత్వాన్ని ముందు పెట్టి, కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో అన్నట్లుగా ఈ పెంట నుండి దూరం ఉండటం, విశ్రాంతి తీసుకోవడం మంచిదేమో!
డా. బూర నర్సయ్య గౌడ్
మాజీ ఎంపీ
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672