ఎవరు ధీర పోలీస్?

by srinivas |   ( Updated:2024-04-03 23:30:26.0  )
ఎవరు ధీర పోలీస్?
X

నిరక్షరాస్యులు, నిరుపేదలు ఎక్కువ శాతం గల భారత దేశంలో చట్టం విలువను అర్థం చేసుకొనగలగడం కష్టతరమైన విషయమే! అర్ధం చేసుకోగలిగిన కుత్సితులు, ధనికులు చట్టాన్ని దుర్వినియోగ పరుస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతూ ప్రజాస్వామ్య పాలనకు ప్రశ్నార్థకమవుతున్నారు. సుపరిపాలనను అందించడానికి పోటీపడుతున్న పోలీసు శాఖకు కొన్ని అరాచక శక్తులు అసాంఘిక శక్తులు ప్రశ్నార్థకంగా తయారైనాయి. కుత్సిత రాజకీయ పోకడల మూలంగా పోలీసుశాఖ అతలాకుతలమైపోతోంది. సమాచార వ్యవస్థను పటిష్టపరచి నేరాలను అరికట్టడానికి చేస్తున్న ప్రయత్నాలకు అవినీతి ఒక సవాలుగా మారింది. నిస్తేజంగా నిలిచిన పాలనా వ్యవస్థ మూలంగా బీదలు బీదలుగానే ఉన్నారు. ధనికులు మాత్రం అధిక ధనవంతులుగా ఎదుగుతూ సామాజిక అంతరాలకు ప్రతీకగా నిలిచారు.

ఆకలి నేరం, వ్యాపార నేరం

నేటి కాలంలో జరుగుతున్న నేరాల శైలిని ప్రస్ఫుటింపజేసే విషయాలు రెండు. ఒకటి ఆకలి నేరం, మరొకటి వ్యాపార నేరం. మొదటిది బాధితునికి, నేరస్టునికి సంబంధించిన విషయం. దానివల్ల సమాజానికి, దేశానికి ప్రభావపూరిత నష్టం చేకూరే అవకాశాలు చాలా అరుదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్మగ్లింగ్‌, హవాలా, నకిలీ పాస్‌పోర్ట్‌, బంగారం అక్రమ రవాణా, ఆర్థిక నేరాలు, డిజిటల్‌ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా తదితర నేరాలను వ్యాపార నేరాలుగా అర్థం చేసుకొనవచ్చు. అటువంటి నేరాలకు ఒక “బాస్‌” ఉంటాడు. అతనొక ప్రణాళికను సిద్ధం చేసుకుంటాడు. అదొక చట్టవిరుద్ధమైన సంపాదనగల వ్యాపార నేరాల కార్యకలాపంగా గోచరిస్తుంది. దానికి పెట్టుబడులుంటాయి. ఉద్యోగులుంటారు. వాహన సంపత్తి ఉంటుంది. సమాచార సేకరణ విధానముంటుంది. దాడులు, ప్రతి దాడులు తదితర కార్యకలాపాలన్నో జరిగిపోతుంటాయి. ఆ గొలుసు కట్టులోనున్న అన్ని ప్రభుత్వ శాఖలతో సత్సంబంధాల నేర్చరచుకోవడమంటే డబ్బును ఎరగా వేయడమే! డబ్బు డబ్బును సంపాదిస్తుంది అనటానికి ఇదో మంచి ఉదాహరణ. మరికొందరిదేమో శత్రు దేశాలు రచించిన ప్రణాళికలను అమలు చేస్తూ దేశ భద్రతకు విఘాతం కలిగించడం, దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడం. అలాగే డ్రగ్స్‌ అక్రమ రవాణా, అక్రమంగా ప్రజల వాడుకకోసం పంపిణీ చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం; డబ్బు సంపాదించుకుంటూనే దేశ యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చి మానవ శక్తి సామర్థ్యతలను పూర్తిగా బలహీన పరుస్తూండడమే.

పోలీసులకు స్వీయ నియంత్రణ తప్పదు

దేశ భవిష్యత్తును మృగ్యంగా మార్చతలపెట్టే అలాంటి నేరగాళ్ళు, స్వార్థ చింతన గల రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలను ఏర్చచుకుంటుంటారు. నేటి రాజకీయ నాయకులకు కావలసిందల్లా డబ్బు, అధికారంతో వెలిగిపోవడం. అలా సునాయసంగా డబ్బు వచ్చే అవకాశాన్ని వారెప్పుడూ చేజార్చుకోరు సరికదా, ఇవ్వజూపే వారికి తగినంత ప్రోత్సాహకాన్నిస్తారు కూడా! అందువల్లేనేమో, “నేరమెరుగని రాజకీయం మనజాలదు, రాజకీయ వత్తాసులెరుగని నేరం నిలబడజాలదూ'' అనే నానుడి వాడుకలోనికి వచ్చి ఉంటుంది. అదొక విడదీయరాని, విడదీయలేని బంధంగా రూపాంతరం చెందిన విషయాన్ని ప్రతి పోలీసు అధికారి గుర్తెరిగి, తన కదలికలు, రాజకీయ నాయకులకు విధేయంగా మెలగడం విషయంలో స్వీయ నియంత్రణను ప్రధానాంశంగా ఎంచుకోవాల్సి ఉంటుంది.

వీగిపోతున్న కేసులతో నిరాశ

దేశం మూలాలను దెబ్బతీసే ఆర్థిక నేరాలకూ, యువత శక్తి సామర్థ్యాలను హరించి వేస్తున్న డ్రగ్స్‌ నేరాలకూ అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. అందులో భౌతిక దాడులుండవు, హింస ఉండదు. అన్నీ మోసపూరితంగానే జరిగిపోతున్నాయి. ఇక న్యాయ స్థానాల్లో ఎక్కువ శాతం కేసులు వీగిపోతుండడంతో చట్టం, దాన్ని అమలు పరచే పోలీసు పరిశోధనలు రాజకీయ ఒత్తిళ్ళకు లోనై తమ ప్రభావాన్ని ఏ మాత్రం చూపలేక అసహాయంగా చూస్తుండిపోతున్నాయి. పర్యవసానంగా, ప్రజాస్వామ్య పాలనాధికారాలను ప్రసాదించిన రాజ్యాంగం పరిహాసానికి లోనవుతున్నది. ఆర్థిక నేరాల సంఖ్య పెరగడం పటిష్టమైన పరిపాలనకు లోపంగా పరిగణించవచ్చు. దాని ప్రభావం వలన ప్రజాధనం లూటీకి గురవుతోంది. ధనవంతులు, చట్టాన్ని చదువుకున్నవారు, చట్టాన్ని దురుపయోగం చేయడం ఒంటబట్టించుకున్న వారి దుశ్చర్యల వల్లనే దేశంలో బీదరికం, వెనుకబాటుతనం నెలకొని ఉందని చెప్పుకోవడం అనివార్యమైపోయింది.

ఆర్థిక నేరాల పరిశోధన చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాని ప్రభావంతో సంబంధిత శాఖల దైనందిన కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలగడం మూలంగా ద్రవ్యరూపంలోనే కాకుండా, సిబ్బంది పనిగంటల ద్వారాను ప్రభుత్వం నష్టపోవలసి వస్తున్నది. అభివృద్ధి కుంటుబడటంతో పౌరులు అనేక అసౌకర్యాలకు, ఆర్థిక పరమైన కష్టనష్టాలకు గురికావలసి వస్తున్నది. అన్నింటినీ మించి డ్రగ్స్‌ మహమ్మారి యువత శక్తి సామర్థ్యాలను కబళించి వేస్తున్నది.

పాలనలో పేరుకున్న నిర్లిప్తత

ప్రస్తుతం పాలకులు నడుం బిగించవలసిన సమయం ఆసన్నమైనట్లుగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. విపరీతమైన అప్పులు, ఆపై వడ్డీలు, అన్ని శాఖల్లో పేరుకుపోయిన అవినీతి జాడ్యం, పరిపాలనలో పేరుకుపోయిన నిర్లిప్తత అనేవి రాష్ట్ర పాలన నడ్డి విరిచే దశకు చేరుకున్నాయి. అన్ని అవసరాలను తీర్చగల మార్గమొక్కటే! పోలీసు శాఖలో నీతి, నిజాయితీ, అంకిత భావస్ఫూర్తిని పునరుజ్జీవింపజేయడం. ఆ తర్వాతే అన్ని ప్రభుత్వ శాఖల్లో నీతిమయ వాతావరణం నెలకొంటుంది. తద్వారా ప్రభుత్వ పరిపానలతో నీతి నిజాయితీతో కూడిన సమర్థత వెల్లివిరుస్తుంది. అయితే అది పోలీసు అధికారుల సాధారణ బదిలీల వల్ల సాధ్యపడే విషయం కాదని గుర్తించాలి.

అలాంటి సంస్కరణల ప్రభావంతో తన వృత్తి నిపుణతపై దృష్టి పెట్టి వ్యవహరించాలనుకునే పోలీసు స్టేషను అధికారి, శాసన సభ్యుల ముడుపులకు సంకేతంగా స్థిరపడిపోయిన ఉత్తరాల విషయవలయం నుండి నిష్కృతిని పొంది, సమర్థ పోలీసుగా పరిణతిని పొంది ప్రజలు, ప్రభుత్వం మన్ననలకు పాత్రుడై ప్రజాస్వామ్య పాలనకు ప్రతీకగా నిలువగలుగుతాడు. అతని సేవా వ్యవహార విధానంలో తగు స్వేచ్చనిచ్చే మార్పులను ప్రవేశపెట్టడానికి పోలీసు ఉన్నతాధికారగణం ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించడం తమ గురుతరమైన బాధ్యతగా ఎంచి పోలీసు సేవా వ్యవస్థను నిజాయితీపరంగా సుస్థిరపరచి, నిజమైన మార్గదర్శకులుగా నిలువాలని పౌర సమాజం గంపెడాశతో ఎదురు చూస్తున్నది. పోలీసు వ్యవస్థపై ప్రజలుంచిన విశ్వాసాన్ని నిలుపుకోవడం ధీర పోలీసు నాయకుల లక్షణం.

పెద్దిరెడ్డి తిరుపతి రెడ్డి

94400 11170

Advertisement

Next Story

Most Viewed