విశ్రాంతీయులను విస్మరిస్తున్న పార్టీలు

by Ravi |   ( Updated:2023-11-21 00:16:18.0  )
విశ్రాంతీయులను విస్మరిస్తున్న పార్టీలు
X

రాష్ట్రంలో జీవించే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల్లో ఏదో ఒకటి వర్తింపజేస్తున్నారు. కానీ సింగరేణి విశ్రాంత కార్మిక కుటుంబాలు ఎటువంటి లబ్ధి పొందడం లేదు. సింగరేణిలో 80,000 మంది, కోల్ ఇండియాలో ఐదు లక్షల మంది విశ్రాంతి కార్మికులకి కోల్ మైన్స్ పెన్షన్ స్కీం-1998 ప్రకారం నెలకు 350 రూపాయలు పెన్షన్ పొందుతున్నారు. వీరికి 25 సంవత్సరాలు గడిచినా పెన్షన్‌లో పెరుగుదల లేదు. సింగరేణిలో 1,000 రూపాయలు పెన్షన్ పొందేవారు దాదాపు 20,000 మంది. వీరికి రాష్ట్ర ప్రభుత్వం అందించే వృద్ధాప్య ఆసరా పెన్షన్, తెల్లరేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్స్ వంటివి ఉండవు. 40,000 రూపాయలు కట్టి తీసుకున్న కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్డ్ మెడికల్ స్కీం మెడికల్ కార్డ్ ఉన్నా, అక్కడ కూడా కార్డ్‌లో కోత విధిస్తున్నారు. నేటి ధరలకు అనుగుణంగా కరువు భత్యంతో కూడిన పెన్షన్ వీరికి సరిపోవడం లేదు. దారిద్ర్య రేఖకు దిగువున నివసిస్తున్న వీరికి ప్రభుత్వ పథకాలు ఏవీ అమలు కావడం లేదు.ఈ పెన్షన్ స్కీం కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఉన్నా, సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎక్కువ ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వానిదే పైచేయి. రాష్ట్ర ప్రభుత్వానికి వీరిపై చిత్తశుద్ధి ఉంటే సింగరేణి రిటైర్ కార్మికులకు ఎన్నో సౌకర్యాలు కల్పించవచ్చు. కానీ ప్రభుత్వాలు ఇప్పటివరకు వీరి సంక్షేమానికి ఏం చేయలేదు.

ఎన్నికల సీజన్లో ప్రతి రాజకీయ పార్టీ నాయకులు బొగ్గు గనుల ప్రైవేటీకరణ, ఆదాయ పన్ను రద్దు, ఆసరా పెన్షన్ ఆరోగ్యశ్రీ పెంపు, జనాకర్షణ గ్యారంటీ స్కీంల హామీల వర్షం కురిపిస్తున్నారు. కానీ బొగ్గు వెలికితీసి జాతికి వెలుగు నిచ్చిన సింగరేణి విశ్రాంత కార్మికుల బాగోగులు గురించి పట్టించుకోలేదు. గాలి, వెలుతురు లేని చీకటి బొగ్గు గనులలో దాదాపు 30,40 సంవత్సరాలు కష్టపడ్డ సింగరేణి విశ్రాంత కార్మికులు తెలంగాణలో దాదాపు 11 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రాజధాని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ పట్టణాల్లో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఏ అభ్యర్థి మెజారిటీనైనా మార్చగల సామర్థ్యం వీరికి ఉంది. అందుకే ఈ సారి సింగరేణి విశ్రాంత కార్మికులకు పెన్షన్ పెంపు, అన్నిరకాల వైద్య సేవలు ఉచితంగా ఇచ్చే రాజకీయ పార్టీకి ఓటు వేయాలనే ఆలోచనలో వారు ఉన్నారు.

ఆళవందార్ వేణు మాధవ్

సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్

86860 51752

Advertisement

Next Story

Most Viewed