ప్యారాచూట్ లీడర్లే.. ప్రజాస్వామ్యానికి హాని!

by Ravi |   ( Updated:2023-11-02 01:38:48.0  )
ప్యారాచూట్ లీడర్లే.. ప్రజాస్వామ్యానికి హాని!
X

ప్రపంచంలో అత్యుత్తమ పాలనా విధానంగా పేరుగాంచిన ప్రజాస్వామ్య వ్యవస్థ మనదేశంలో అమలులోకి వచ్చాక, ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేవారు ఆయా రాజకీయ పార్టీల సిద్ధాంతాలను త్రికరణ శుద్ధిగా గౌరవించేవారు. పదవి ఉన్నా లేకున్నా, ఆఖరి శ్వాస విడిచేంత వరకు అదే పార్టీలో కొనసాగి పార్టీ పట్ల తమ విధేయతను చాటుకునేవారు. రాజకీయ పార్టీలు సైతం ఎంతో నిబద్ధతతో తమ పార్టీల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఆదరించి అందలమెక్కించి అక్కున చేర్చుకునేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. రాజకీయ పార్టీల్లో గానీ, రాజకీయ నాయకుల్లో గాని సైద్ధాంతిక నిబద్ధత టార్చ్ వేసి చూసినా కనపడడం లేదు. అధికారమే పరమావధిగా యధేచ్ఛగా పార్టీలు మారుస్తూ రాజకీయాల్లో నైతిక విలువలకు తిలోదకాలిస్తున్నారు.

స్వార్థ ప్రయోజనాల కోసం

గతంలో ప్రతి రాజకీయ పార్టీ, పార్టీకి చెందిన నాయకులు క్రమశిక్షణ ఉల్లంఘనలతోనో, ఆర్థిక నేరారోపణల కారణంతోనో పార్టీ నుండి బహిష్కరణ చేస్తే, ఇతర రాజకీయ పార్టీలు వారిని ఆదరించేవి కావు. కానీ ప్రస్తుతం అలా ఓ రాజకీయ పార్టీ నుండి బహిష్కరణకు గురైన నేతల కోసం ఇతర పార్టీలు రెడ్ కార్పెట్ వేసి వెల్‌కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. వారికి ఆకర్షణీయమైన ప్యాకేజీలతో ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి ఫిరాయించడానికి చేరికల కమిటీ పేరుతో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ అనైతిక రాజకీయ క్రీడను ప్రోత్సహిస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఓ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో గెలవలేడనుకున్న అభ్యర్థి మరో పార్టీలోకి ఫిరాయించినప్పుడు తాను గెలవడమే కాకుండా తనతో పాటు మరికొంత మందిని గెలిపిస్తాడనే నమ్మకం కలగడానికి కారణాలు బోధపడడం లేదు. ఫిరాయింపుల రూపంలో ఎన్నికల సమయంలో ఆయా పార్టీలలోకి ప్రవేశిస్తున్న కొత్త నీరు సదరు పార్టీలను విజయ తీరాలకు చేర్చే మంత్ర జలంగా ఎలా మారుతుందో తెలియడం లేదు. ఈ ఫిరాయింపుల ఉధృతి పెరగడానికి కారణం వివిధ కారణాల రీత్యా పార్టీల అధినేతలతో సంబంధాలు చెడిపోవడమా? పదవీ వ్యామోహమా? కుల సమీకరణాలా? కారణాలేవైనా జాతీయ పార్టీలు సైతం ఫిరాయింపుల ద్వారా చేరిన అభ్యర్థులకే అధిక శాతం బి. ఫాంలను ఇవ్వడానికి సదరు పార్టీల నిర్మాణంపై, వర్తమాన సైద్ధాంతిక నిబద్ధతపై అనేక ప్రశ్నలను లేవనెత్తేవిగా భావించక తప్పదు. ఒకవేళ ఎన్నికల్లో గెలిచినా ఫిరాయింపుల కలవాటైన ఈ జంపింగ్ జపాంగ్‌లు అధికారం కోసమో, అధిక మొత్తం ప్యాకేజీల చేత ఆకర్షితులవడం ద్వారానో మరో రాజకీయ పార్టీలో చేరరనే గ్యారెంటీ ఎవరిస్తారనే బుద్ధిజీవుల సందేహాలను తీర్చేదెవరు? రాజకీయాలకు పర్యాయ పదంగా మారుతున్న ఫిరాయింపులు పదేపదే జరగడానికి కారణం, తమ స్వార్థ ప్రయోజనాల పరిరక్షణ కోసం కాదని, విశాలమైన ప్రజల సంక్షేమం కోసమేనని ఫిరాయింపులకు పాల్పడుతున్న రాజకీయ నాయకులు వల్లె వేస్తున్నప్పటికీ, ఆచరణలో సదరు ఫిరాయింపులకు ప్రజలు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కారణం కానేకారనే సత్యం లోకవిదితమే.

ఫిరాయింపుదారులకే పెద్దపీట

నిజానికి తాము ఎంతో ఇష్టంతో ఓట్లేసి గెలిపించిన నాయకులు అధికార వ్యామోహంతో ఇతర రాజకీయ పార్టీలలో చేరుతున్న వైనం పట్ల ప్రజలు తీవ్ర అసహనానికి గురౌతున్న మాట పచ్చి నిజం. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో తాము వ్యతిరేకించిన రాజకీయ పార్టీల జెండాలను ప్రస్తుతం మోయాల్సిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావడం అవమానంగా భావిస్తున్నారు. మరోవైపు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగి, పార్టీ సిద్ధాంతాలను ఆకాశానికెత్తి పార్టీలో వివిధ పదవులు అనుభవించిన వాళ్ళు, పార్టీనుండి వైదొలగగానే అప్పటి వరకూ అన్నీ ఇచ్చిన పార్టీలపై దుమ్మెత్తి పోస్తున్న వైనం విస్తుగొలుపుతోంది. దేశంలో, రాష్ట్రంలో ఏక పార్టీల ప్రభుత్వాల ఏర్పాటు అసాధ్యంగా మారి సంకీర్ణాల యుగం ప్రారంభమైన తర్వాత, అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఫిరాయింపులే ఆయుధంగా ఉపయోగపడిన వైనం బహిరంగ రహస్యమే. ప్రత్యక్షంగా ఎన్నికలలో గెలవడం కన్నా, గెలిచిన వారిని ఫిరాయింపులతో ప్రోత్సహించడం ద్వారా మెజారిటీని సాధించి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం సులభమనే భావన అన్ని రాజకీయ పార్టీల మనస్సుల్లోకి రావడం గమనార్హం. నిజానికి ఈ తతంగం గతంలో ఎన్నికలు జరిగాకా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లేనప్పుడు జరిగేది. కానీ నేడది ఎన్నికల్లో గెలిచే శక్తి కలిగిన రాజకీయ నాయకులు తమ పార్టీలో అందుబాటులో లేరనే భావనతో కేవలం గెలుపు గుర్రాల అన్వేషణలో భాగంగా ఇతర రాజకీయ పార్టీల నుండి తమ పార్టీలోకి వలసలను ప్రోత్సహించే స్థితికి మళ్ళిందని చెప్పక తప్పదు. ఫలితంగా రాజకీయ పార్టీల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత నీరుని కాదని ఇతర పార్టీల నుండి వలస వచ్చే ఫిరాయింపుదారులకే పెద్ద పీట వేస్తున్న వైనంతో పాత తరం నాయకులు ఆందోళనకు గురౌతూ మరో రాజకీయ పార్టీలోకి ఫిరాయించడం ఓ విషవలయాన్ని సృష్టిస్తోంది. ఈ పరిణామాలతో రాజకీయ పార్టీల నిర్మాణాలు ఓ అనూహ్యమైన కుదుపుకు లోనౌతున్న వైనం బహిరంగ రహస్యమే. అయితే వివిధ రాజకీయ పార్టీల మధ్య అధికారం కోసం కొనసాగుతున్న ఈ రాజకీయ వైకుంఠపాళిలో నాయకులు మాత్రం ఫిరాయింపుల నిచ్చెనల ద్వారా వారు కోరుకుంటున్న కైలాసాన్ని చేరుకుంటున్నారు. అంతిమ లబ్ధిదారులుగా మారాల్సిన ప్రజలు మాత్రం చిన్నా పెద్ద పాముల చేత మింగబడి అధఃపాతాళంలోకి అనివార్యంగా నెట్టివేయబడుతున్నారు.

సుస్థిర ప్రభుత్వాల ద్వారానే..

ఈ ఫిరాయింపుల సామాన్యుల జనజీవనం అనేక ఒడిదొడుకులకు లోనౌతోంది. క్షేత్ర స్థాయిలో మెజార్టీ ప్రజలు ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల, విద్య, వైద్యంతో పాటు ఉద్యోగ, ఉపాధి రంగాలకు సంబంధించిన సమస్యలను గాని, ప్రజల ఆహార భద్రత మూలంగా మారబోయే వ్యవసాయరంగ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికలూ తయారుచేయలేరు. అంచనాల కందని ఎన్నికల ప్రలోభాలూ, అలవిమాలిన ఉచితాలతో కోట్లాది రూపాయలను ఖర్చుచేయడం ద్వారా ఓటర్లను మభ్యపెడుతూ కోట్ల రూపాయలున్న కోటేశ్వరులే ఫిరాయింపుల ద్వారా ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి చట్ట సభలలోకి వెళ్తాడు. ఇలాంటి ఫిరాయింపులను పార్టీలు ప్రోత్సహిస్తున్నంత కాలం రాజకీయ పార్టీలు ప్రజలకు కావాల్సినవి విస్మరించి పార్టీకోసం, అధికారం ఎక్కడం కోసం ఏం కావాలో అవే చేస్తాయి.

ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యం ఆచరణలో జనస్వామ్యంగా మారి మెజారిటీ ప్రజలు దైనందిన జీవనంలో ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించాలంటే సుస్థిర ప్రభుత్వాల ఏర్పాటు జరగాల్సిందే. అందుకోసం ప్రస్తుతం అమలులో వున్న ఫిరాయింపుల నిరోధక చట్టాలను సవరించడం ద్వారా ఫిరాయింపులకు పాల్పడే ఎన్నికైన ప్రజాప్రతినిధులను తక్షణమే అనర్హులుగా ప్రకటించి వారి తర్వాత స్థానంలో ఓట్లను పొందిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటించాలి. లేదా చైతన్యవంతులైన ప్రజలే మళ్ళీ జరగబోయే ఎన్నికల్లో సదరు ఫిరాయింపుదారులను చిత్తు చిత్తుగా ఓడించాలి. ఎన్నికల చట్ట సవరణలతో ఫిరాయింపులకు పాల్పడుతున్న రాజకీయ నాయకులను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించే వెసులు బాటును కలిగించాలి. ఇవన్నీ జరిగినప్పుడే సుస్థిర ప్రభుత్వాలేర్పడతాయి. ఈ ప్రభుత్వాల ద్వారా ప్రజలు ఆకాంక్షించే సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధ్యమౌతుంది.

డా. నీలం సంపత్

సామాజిక కార్యకర్త.

98667 67471

Advertisement

Next Story

Most Viewed