ఓజోన్ పరిరక్షణ మనందరి బాధ్యత!

by Ravi |   ( Updated:2023-09-15 00:15:51.0  )
ఓజోన్ పరిరక్షణ మనందరి బాధ్యత!
X

భూమి మీద ప్రతి ప్రాణి బ్రతకడానికి ముఖ్య కారణం సూర్యుడు. సూర్యుని నుండి వెలుతురు, వేడి, భూమికి చేరుతున్నాయి. దీని వలన రాత్రి పగలు ఏర్పడి జీవులు మనుగడ సాగిస్తున్నాయి. సూర్యుడి నుండి వచ్చే సూర్యరశ్మి వల్లే ఈ భూమిపై ప్రకృతి గమనం సాగుతోంది. వెలుతురు వేడితో పాటుగా సూర్యుని నుండి జీవులకు హాని కలిగించే అతి నీలలోహిత కిరణాలు భూమిపై నేరుగా పడితే సకల జీవరాశుల మనుగడకు ప్రమాదమే. అలా జరగకుండా మనందరినీ కాపాడుతోంది భూమి చుట్టూ వాతావరణంలో ఆవహించి ఉన్నది ‘ఓజోన్ పొర’.

భూమిపైన వ్యాపించి వున్న గాలి పొరను వాతావరణం అంటారు. ఇది సుమారు 1000 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. దీనిని ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం , ఉష్ణ ఆవరణం, ఎక్సో ఆవరణం, అనే ఐదు పొరలుగా వర్గీకరించారు. స్ట్రాటో ఆవరణంలోని 17 నుంచి 48 కిలోమీటర్ల ఎత్తులో సహజంగా తయారైన ఓజోన్‌ ‌పొర ఉంటుంది. ఇది లేత నీలి రంగులో ఉండి, సూర్యుని నుండి వెలువడే ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలను భూమిపైన పడకుండా జీవులను కాపాడుతూ, ఓజోన్‌ ‌పొర జీవావరణానికి ఒక ‘రక్షక కవచం’లా పని చేస్తుంది.

పారిశ్రామిక విప్లవం కారణంగా..

మొదటగా 1839లో జర్మన్‌ ‌శాస్త్రవేత్త క్రిస్టియన్‌ క్రిస్టియన్ ఫ్రెడరిక్ స్కోన్‌బీన్ ఓజోన్‌ ‌వాయువును కనుగొన్నాడు. ఓజోన్ పొరను మాత్రం 1913లో ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్తలు చార్లెస్ ఫాబ్రీ, హెన్రీ బ్యూసన్ కనుగొన్నారు. మొదటగా 1975లో అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ పొర దెబ్బతినడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. నానాటికీ అది పలుచన అవుతూ, 1987 నాటికి తీవ్రంగా దెబ్బతిందని, మనుషులు చేసే చర్యల వల్ల ఉత్పత్తి అవుతున్న ప్రమాదకర వాయువులు, రసాయనాలే ఓజోన్ పొరను దెబ్బతీశాయని గుర్తించారు. అందుకే దీనిని రక్షించుకునేందుకు ఏటా సెప్టెంబర్ 16న ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవంను నిర్వహిస్తున్నాయి. ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న వంద రకాల ఉత్పత్తులను వాడకుండా చేసేందుకు ప్రపంచ దేశాల మధ్య మాంట్రియల్ ప్రోటోకాల్ అనే ఒప్పందం 1987 సెప్టెంబర్ 16న కుదిరింది. అప్పటి నుంచి ఏటా సెప్టెంబర్ 16న ఓజోన్ పొరను ఎలా కాపాడాలనే అంశంపై ప్రపంచ దేశాలు అవగాహన కలిగిస్తున్నాయి.

19వ శతాబ్దంలో మొదలైన పారిశ్రామిక విప్లవం ఓ రకంగా ‌ప్రకృతిని దెబ్బతీసింది. ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంకు తోడు మనిషి తన సుఖవంతమైన జీవితానికి తయారు చేసుకున్న చాలా వస్తువులు ప్రకృతికి వ్యతిరేకంగా తయారయ్యాయి. దీనికి తోడు అడవుల విస్తీర్ణం తగ్గుతోంది. ఫలితంగా ప్రకృతి గతి తప్పి, రేడియేషన్‌, ‌కాలుష్యం, ఈ- ‌వేస్టేజ్‌, ‌గ్లోబల్‌ ‌వార్మింగ్‌, ‌గ్రీన్‌ ‌హౌస్‌ ‌గ్యాసెస్‌, ‌ప్లాస్టిక్‌ ‌వాడకం ఇలా పలు రకాలుగా భూమిని మానవులు కలుషితం చేస్తూనే ఉన్నారు. దీని వలన ఓజోన్ పొర దెబ్బతిని సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూమిని చేరి మొక్కలకు తెగుళ్లు పడే అవకాశముంది. అలాగే రోజురోజుకి మానవులలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే దృష్టి లోపాలు ఏర్పడి కంటి జబ్బులు వస్తాయి. వేడికి సముద్రపు జీవులు నశించిపోతాయి. ఇలా అనేక రుగ్మతలు అన్ని రకాల జీవులపై ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నాయి.

అందరం క‌ృషి చేయాలి!

మానవ చర్యలే ప్రకృతిని అధికంగా నష్ట పరుస్తున్న నేటి ఆధునిక కాలంలో మనం చేసే ప్రతి పనీ పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుందనే స్పృహ అందరిలో ఉండాలి. అప్పుడే ఓజోన్ పొరకి నష్టం వాటిల్లదు. అందుకోసం ప్రతి ఒక్కరు విధిగా పలు పర్యావరణ హిత పనులని ఆచరించాలి. ముఖ్యంగా ప్రజలు వారి దగ్గర్లో ఉన్న వస్తువులనే వాడాలి. చుట్టుపక్కల లభించే వాటినే కొనుక్కోని వాడితే, దాని వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. వీలైనంతవరకూ సేంద్రియ ఉత్పత్తులు, పర్యవరణ హిత వస్తువులను కొనాలి. ఏసీల వాడకం తగ్గించాలి, లెడ్ బల్బులు వాడాలి. మన ఇళ్లలో తడి చెత్తను పెరట్లో వేసి ఎరువుగా మార్చొచ్చు. పాలిథిన్ కవర్లు, బాటిల్స్, ఫుడ్ ప్యాకేజింగ్, స్ట్రాలు ఇలా ఒకసారి వాడి పారేసే వాటి వాడకం ఎంత తగ్గిస్తే ఓజోన్‌కు అంత మేలు. పాలిథిన్ కవర్ల, వాటర్ బాటిళ్ళు, రసాయనిక ఎరువులు తగ్గించాలి.

ఉన్నత విద్యలో డిగ్రీ స్థాయి నుండి పలు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో కూడా పర్యావరణ విద్య అనే ఒక సబ్జెక్టుని నేటి విద్యార్ధులకు బోధిస్తున్నారు, స్కూల్ స్థాయిలో కూడా నేర్పిస్తున్నారు కానీ ప్రతి విద్యార్ధి అందులోని అంశాలని తప్పకుండా ఆచరించాలి. కోవిడ్ లాక్ డౌన్ కొంతవరకు పర్యావరణ కాలుష్యం తగ్గడానికి, ఓజోన్ పొరకు కొంత వరకు నష్టం తగ్గించినా మళ్ళీ నేడు కాలుష్యం పెరుగుతోంది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్'లో స్విస్ సంస్థ - 2022లో ఇచ్చిన నివేదిక ప్రకారం, భారతదేశం ప్రపంచంలో ఎనిమిదవ అత్యంత కాలుష్య దేశంగా ఉంది. ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయని పేర్కొంది. ఈ కాలుష్యాలు మన జీవన ప్రమాణాలు తగ్గిస్తూ, ఓజోన్ పోరనే కాకుండా మానవాళికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఓజోన్‌ను మనం కాపాడితే, అది మనల్ని కాపాడుతుంది. ఇది మనందరి బాధ్యత. కలసికట్టుగా కృషి చేస్తేనే ఈ భూమి పది కాలాలపాటూ పచ్చగా ఉంటుంది. ఆ దిశగా మనం చేపట్టే ప్రతి చర్యా, తీసుకునే ప్రతి నిర్ణయం సమస్త జీవరాశికీ మేలు చేస్తుంది.

(రేపు అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం )

డా. ఈర్ల రాకేష్

ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్, రీజనల్ సైన్స్ సెంటర్,

99129 87077

Advertisement

Next Story

Most Viewed