మన బడి చదువులు విలవిల

by Ravi |   ( Updated:2023-12-30 00:45:56.0  )
మన బడి చదువులు విలవిల
X

రాజకీయాలే తప్ప పరిపాలన మీద ధ్యాస లేని గత సర్కార్ నిర్లక్ష్యంతో నాటి కరోనా సంక్షోభం రెండేళ్ళ పాటు చదువుల్ని కునారిల్లేలా చేసింది. నాటి ప్రభుత్వ అవగాహనా రాహిత్యం, అశాస్త్రీయ ఆచరణల ఫలితంగా లక్షల మంది పేద విద్యార్థులు రెండేళ్ళు పాఠశాల విద్యకు దూరమయ్యారు. కరోనా విజృంభణతో అన్ని రంగాలతో పాటు విద్యారంగం కూడా సవాళ్ళను ఎదుర్కొంది. రెండు విద్యా సంవత్సరాల్లో ఒకటి పాక్షికంగా, రెండవది పూర్తిగా నిర్వీర్యమైంది.

కరోనా మళ్ళీ బుస కొడితే!

మళ్ళీ డిసెంబర్ చివరి వారంలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ ముప్పు నుండి బడులను, విద్యారంగాన్ని కాపాడేందుకు ముందస్తు జాగ్రత్తలు, పక్కా కార్యాచరణ రూపొందించాల్సి వుంది. ఆ కార్యాచరణ పేద విద్యార్థుల, ప్రభుత్వ బడుల సంక్షేమం ఆశించేదిగా ఉండాలి. ఆచరణలో విఫలమైన ఆన్‌లైన్ నాడు కొనసాగించిన ఫలితంగా లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగింది. కౌమార దశలోనే వారికి ఇంటర్ నెట్, స్మార్ట్ ఫోన్లు ఇవ్వటం వలన కనీస క్రమశిక్షణ సంస్కృతి దిగజారింది. మళ్ళీ కరోనా విజృంభించకుండా చూడాల్సిన బాధ్యతతో పాటు, విజృంభిస్తే ఆన్‌లైన్ బోధన బడులు, లేదా కరోనా సవాలును ఎదుర్కొనే తరగతి గదులతో బళ్ళను సిద్ధం చేయాలి. కరోనా హెచ్చరికలు లేకుండా దూసుకొచ్చే సునామీ లాంటిదని గత అనుభవాల పాఠం మననం చేసుకోవాలి. కరోనా వైద్యం తీసుకున్న వారిలో ఇమ్యూనైజేషన్ శక్తి సంగతేమో గానీ ఆ వైద్యం తాలూకు ప్రతికూల ఫలితాలు భయాన్ని గొలుపుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కల్గిస్తోంది. ఈ భయం ఇప్పటికే బళ్ళలో విద్యార్థుల హాజరు శాతం తగ్గుదలకు దారి వేస్తున్నది. ఈ నేపథ్యంలో మన సర్కారు బడుల క్షేమం విచారించాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తించాలి.

బడులు సంసిద్దంగా వున్నాయా!

కరోనా మూడవ వేవ్ ప్రభావం పిల్లలపై అధికంగా వుంటుందన్న వైరాలజీ నిపుణుల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోవాలి. పిల్లలపై కరోనా దాడి చేయకముందే వ్యాక్సిన్ ఇచ్చేందుకు గల అవకాశాలను ప్రయత్నించాలి. ఇది సాధ్యమైతే కనుక విద్యార్థులు, తల్లిదండ్రులు పూర్తి ఆత్మవిశ్వాసంతో బడి నిర్వహణకు మరింతగా సహకరించే అవకాశముంది. గత ప్రభుత్వం ఏకపక్షంగా చేసిన ఆచరణ తప్పిదాలను, అశాస్త్రీయ విధానాల అమలును సమీక్షించుకోవాలి.

రాష్ట్రంలో కొత్త సర్కార్ భౌతిక మౌలిక వసతుల ప్రకల్పన వంటి విద్యేతర కార్యాచరణపై మొదట కసరత్తు చేయాల్సిన అవసరాల్ని గుర్తించాలి. ప్రత్యక్ష తరగతులను యధాతథంగా నిర్వహించేందుకు కరోనా నిరోధక సౌలభ్యంతో తరగతి గదులను పునర్వ్యవస్థీకరించాలి. పాఠశాలలపై తల్లిదండ్రులకు, సమాజానికి నమ్మకం కల్గించాలి. ప్రతి పాఠశాలకు ఒక ఆరోగ్య కార్యకర్తను నియమించి ఐసోలేషన్ గదిని నిర్వహించాలి. ప్రతి మండల వనరుల కేంద్రం పరిధిలో ఆక్సీజన్, వెంటిలేటర్ సౌకర్యం గల అంబులెన్స్‌ను నిర్వహించాలి. గత సంవత్సరాల్లో గురుకులాల నిర్వహణలో జరిగిన వైఫల్యం విద్యా సంవత్సరంపై తీవ్ర ప్రభావం చూపింది. పాఠశాల ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలి. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ, ఎంప్లాయిస్ హెల్త్ స్కీంలో చేర్చాలి. ఇరవై మంది విద్యార్థులకు ఒక తరగతిగది అనే భౌతిక దూరం నియమావళి ఆచరించవలసి వుంది.

ప్రత్యామ్నాయం చూడాలి..

ఈ నేపథ్యంలో తరగతి, సెక్షన్ల ఆధారంగా కావల్సిన ఉపాధ్యాయులను తక్షణమే వర్క్ అడ్జస్ట్ మెంట్ ప్రాతిపదికన నియామకం చేయాలి. తక్కువ బడే ఉపాధ్యాయుల స్థానంలో విద్యా వాలంటీర్ల పునర్నియామకం చేయాలి. తరగతి బోధన ప్రణాళికలపై శాస్త్రీయ దృక్పథంతో కార్యాచరణ రూపొందించాలి. ఇందుకు విద్యారంగ మేధావులు,ఉపాధ్యాయులు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. రెండు విద్యా సంవత్సరాల నుండి విద్యార్థులు కోల్పోయిన వివిధ తరగతుల్లో సబ్జెక్టుల వారీ సామర్ధ్యాలను విద్యార్థులకు అందజేయాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తించాలి. క్షేత్రస్థాయిలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అభిప్రాయం మేరకు ఆచరణాత్మకంగా విఫలమై ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తొలిమెట్టు ఎఫ్.ఎల్.ఎన్.ఉన్నతి, లక్ష్య కార్యక్రమాల స్థానంలో ప్రత్యామ్నాయం చూడాలి. అనుభవజ్ఞులైన ప్రధానోపాధ్యాయుల సహకారంతో ఇందు కోసం శిక్షణా కార్యక్రమాల్ని నిర్వహించాలి.

వి. అజయ్ బాబు

ఉపాధ్యక్షుడు, టి.పి.టి.ఎఫ్.

89192 60409

Advertisement

Next Story