- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బహిరంగ లేఖ
మిత్రుడు రేవంత్‌రెడ్డి గారికి,
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ మీరు 'రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ' అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలు, వర్గాలు, మతాల కలయిక. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ దేశ స్వాతంత్ర పోరాటంలోనూ, అనంతరం దేశ నిర్మాణంలోనూ చరిత్రాత్మక పాత్ర పోషించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రకులాలనూ, బహుజనులనూ సమానంగా చూసింది. ఏఐసీసీ, పీసీసీ పదవులను కట్టబెట్టింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మంత్రి పదవులు ఇచ్చింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి పదవులతో గౌరవించింది. వ్యక్తికన్నా వ్యవస్థ ముఖ్యం. పార్టీ ముఖ్యం. అన్ని పదవులు పొంది 'రెడ్డి కాంగ్రెస్' ఏర్పాటు చేసి అధినాయకత్వాన్ని బలహీనపర్చాలని చూసినా, వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసినా కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డిలాంటి ఎంతో మంది నాయకులను ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ చేరదీశారు. ముఖ్యమంత్రులు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు, గవర్నర్లు, ఏఐసీసీ, పీసీసీ అధక్షులుగా అవకాశమిచ్చారు.
సోనియాగాంధీకి 1991లోనే ప్రధానమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చినా, తాను తప్పుకుని పీవీ నరసింహారావుగారిని ప్రధానిని చేశారు. మూడుసార్లు ప్రధాని పదవిని త్యజించిన ఏకైక నాయకురాలు సోనియాగాంధీగారు మాత్రమే. త్యాగం, దూరదృష్టితో ప్రతిపక్ష పార్టీలను సమీకరించి, 2004లో యూపీఏ-1 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్‌గారిని ప్రధానిని చేశారు. మీరు కొత్తగా పార్టీలోకి వచ్చి పీసీసీ అధ్యక్షులు అయినా, నేను ప్రచార కమిటీ చైర్మన్ అయినా అది మన గొప్పకాదు. అదంతా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ గారి చలవే.
యూపీఏ-1 లో తీసుకువచ్చిన ఉపాధిహామీ చట్టం, రైతు రుణమాఫీ, సమాచార హక్కుచట్టం, ఐటీ, టెలికామ్ రెవెల్యూషన్, సివిల్ న్యూక్లియర్ డీల్, ఇతర సంక్షేమ పథకాల అమలు వలన సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, యువనాయకుడు రాహుల్‌గాంధీ నాయకత్వంలో యూపీఏ-2 ఏర్పడింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎల్పీ నాయకుడిగా, బీసీ బిడ్డ డి. శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడిగా, రెడ్డి-బీసీ కలయికతో సోనియాగాంధీ నాయకత్వాన 2004-2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. వెలమ సామాజిక వర్గానికి చెందిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 42 లోక్‌సభ స్థానాలకుగాను 41 స్థానాలలో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. 'వైఎస్ రాజశేఖరరెడ్డి మూలాననే యూపీఏ ఏర్పడిందని, ఆయన మరణం తరువాత యూపీఏ ప్రభుత్వం ఏర్పడలేదనడం' సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కించపర్చడమూ, అవమానించడమే. మీరు అప్పుడు పార్టీలో లేకపోవడం వలన ఈ చారిత్రక విషయాలను మీకు తెలియజేస్తున్నాను.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నక్సల్బరీ ఉద్యమం. తొలిదశ, మలిదశ ఉద్యమాలు భూమి కోసం, ఆత్మగౌరవం కోసం, నిజాం పాలన, జమీందారుల దోపిడీలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగాయి. దొరలకు, గడులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలే అవి. రావినారాయణ రెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, కొండపల్లి సీతారామయ్య, సీహెచ్ రాజేశ్వరరావు వంటి అభ్యుదయ భావాలు కలిగిన అగ్రకులాల నాయకులు బడుగులతో కలిసి అణిచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అగ్రవర్ణాల చేతిలో అణగారిన వర్గాలు, బహుజనులు బలవుతున్న విషయాన్ని గుర్తించి, బిడ్డలు ప్రాణాలు అర్పిస్తుంటే, ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ఉండాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సోనియాగాంధీగారు తెలంగాణ ఏర్పాటు చేశారు.
తెలంగాణ ఏర్పడితే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు వనరుల పంపిణీ సమానంగా జరుగుతుందని, ప్రభుత్వంలో భాగస్వామవుతారని ఆలోచన చేశారు. 'డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాలు, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు రిజర్వేషన్లు, దళితులకు ముఖ్యమంత్రి' అని కల్లబొల్లి మాటలు చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాటలు నమ్మిన ప్రజలు ఆయనకు రెండుసార్లు ఓట్లేశారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఈ వర్గాలను మొత్తంగా మోసం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తెలంగాణలోనే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మరింత ఎక్కువగా అణిచివేతకు గురవుతున్నారు. దళితబంధుతో దగా, రైతుబంధుతో మోసం చేశారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలే కాకుండా ఆత్మగౌరవ పోరాటం కూడా. తెలంగాణ రాబందుల సమితి పార్టీ చేతిలో ఆత్మగౌరవం పూర్తిగా దెబ్బతింది.
ఇటువంటి పరిస్థితులలో, ఊసరవెల్లి కేసీఆర్ మోసాలను గ్రహించి, వరంగల్ డిక్లరేషన్, రాహుల్‌గాంధీ సభతో ఉత్తేజితులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలన్నీ కాంగ్రెస్ వైపు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో 'మీరంతా మా రెడ్లకిందనే పనిచేయాలి, రెడ్లకు మాత్రమే రాజ్యాధికారం, మాకు మాత్రమే సత్తా ఉంది' అంటూ చేసి వ్యాఖ్యలు అత్యంత ఆక్షేపణీయం. మీ వ్యాఖ్యలతో ఆయా వర్గాలలో అలజడి చెలరేగింది. అవి అట్టుడికిపోతున్నాయి. తిరగబడుతున్నాయి. ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్‌లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను సైతం మీరు వ్యతిరేకిస్తున్నట్లు మీ వ్యాఖ్యలతో అర్థమవుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 50 శాతం పదవులు కల్పించాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా ఉంది. ఇది అత్యంత దారుణం.ఖండిచతగిన విషయం.
రెడ్డి సామాజిక వర్గంతోనే ప్రభుత్వం ఏర్పడేదంటే, సుమారు ఏడు సంవత్సరాలు పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేతగా జానారెడ్డి, కొత్తగా పార్టీలో చేరిన మీకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినా 2018లో పార్టీ ఓటమి పాలైంది. డీకే అరుణా రెడ్డి, జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మీరు కూడా స్వయంగా ఓటమి పాలయ్యారు. ఉత్తమ్ పద్మావతి రెడ్డి 2018లో కోదాడలోనూ, తరువాత హుజూర్‌నగర్ ఉప ఎన్నికలోనూ, సీనియర్ అయిన కె. జానారెడ్డి 2018 ఎన్నికలలోనూ, ఉప ఎన్నికలోనూ బీసీ యువకుడి చేతిలో ఓటమి పాలయ్యారు. 1999లోనూ ఇదే జరిగింది. సీఎల్పీ నేతగా పి. జనార్దన్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికలకు వెళ్లినా ఓటమి పాలైన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా.
2004-2009లో రెడ్డి-బీసీల కలయికతో ప్రభుత్వం ఏర్పడిన విషయాన్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 2023 లక్ష్యంగా అధికారంలోకి వచ్చేందుకు కొత్తగా వచ్చిన మీకు (రెడ్డి సామాజిక వర్గానికి) పీసీసీ పదవి, దళిత వర్గానికి సీఎల్పీ పదవి అప్పగించింది. ప్రచార కమిటీ ఛైర్మన్‌గా బీసీని, పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీగా మరో దళితుడిని, కన్వీనర్లుగా ఇద్దరు మైనార్టీలతో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీగారు కొత్త కార్యవర్గాన్ని రూపొందించారు. సర్వాయి పాపన్న, మహాత్మా జ్యోతిరావు ఫూలే, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య ఉద్యమ స్ఫూర్తిగా, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుల సాక్షిగా బానిస సంకెళ్లు తెంచుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏకమయ్యాయి. దేశంలో, రాష్ట్రంలో ఉన్న వనరులలో వారి త్యాగం, భాగస్వామ్యం ఉంది.
ఆ వర్గాలన్నీ సమాన అవకాశాల కోసం పోరాటాలు చేస్తున్నాయి. అణిచివేతను, అవమానాలను సహించబోమని చెబుతున్నాయి. సాధించుకున్న సగం తెలంగాణ నుంచి సామాజిక తెలంగాణ సాధించాలని బలంగా కోరుకుంటున్నాయి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ 'మేమెంతో.. మాకంతా' అంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో మీరు చేసిన వ్యాఖ్యలు మీకూ, పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి. మీరు మాట్లాడిన భాష, యాస సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నాయకత్వాలనూ ప్రశ్నించేలా, అవమానపర్చేలా ఉంది. మీరు ఎక్కడ మాట్లాడినా, ఏ వ్యాఖ్యలు చేసినా పీసీసీ అధ్యక్షుడి మాటలుగానే మీడియా, ప్రజలు గుర్తిస్తారు. మీరు మాట్లాడే ప్రతి మాటా ఆలోచనతో ఉండాలి. మీరు వెనువెంటనే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇవ్వడంతో పాటు, అధినాయకత్వానికి విధేయత ప్రకటించాలని కోరుచున్నాను.
మధుయాష్కీ గౌడ్,
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్