ఏకాత్మ మానవవాదంతోనే దేశాభివృద్ధి

by Ravi |   ( Updated:2023-02-10 19:01:15.0  )
ఏకాత్మ మానవవాదంతోనే దేశాభివృద్ధి
X

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25న అతి సామాన్య కుటుంబంలో పుట్టి అసమాన్య వ్యక్తిగా ఎదిగారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో ప్రచారక్ జీవితాన్ని ప్రారంభించి, 1951లో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కోరిక మేరకు ఆర్ఎస్ఎస్ నుండి రాజకీయ క్షేత్రమైన జన‌సంఘ్ ప్రచారకులుగా నియమితులయ్యారు. అఖిలభారత అధ్యక్షులుగా పాట్నాకు రైలులో ప్రయాణిస్తున్న సమయంలో 1968 ఫిబ్రవరి 11న మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం వద్ద విగతజీవిగా పడి ఉన్నారు. అయితే వారి మరణం గురించి ఇప్పటివరకు అసలు నిజాలు వెలుగులోకి రాలేదు.

దేశాభివృద్ధి సిద్ధాతం..

పాశ్చాత్య దేశాలకు చెందిన తత్వవేత్తల ద్వారా జాతీయవాదం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సోషలిజం, కమ్యూనిజం మొదలైన ఆదర్శవాదాలు పెల్లుబికాయి. కానీ కాలక్రమంలో ఇవి తొందరగానే పతనం చెందాయి. మధ్యయుగాల లోనే చర్చి ప్రాబల్యం పెరిగి జాతీయ రాజ్యాలు ఏర్పడి, పాలించే రాజులు నిరంకుశంగా మారిపోతే ప్రజాస్వామ్య వాదం తెరపైకి వచ్చి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయితే ప్రజాస్వామ్యం ఇచ్చిన పౌర స్వేచ్ఛ వలన ధనవంతులు పేదవారిని దోచుకోని పెట్టుబడిదారితనాన్ని ఆచరణలోకి తేవడంతో సంపద కొందరి చేతుల్లోనే మిగిలి మిగతావారు పేదవారిగా మారారు. అప్పుడు సామ్యవాదం తెరపైకి వచ్చి, సమానత్వం, సమన్యాయం కోసం పోరాటాలు జరిగాయి. సామ్యవాదాలలో కార్ల్ మార్క్స్ ప్రవచించిన ఆధునిక సామ్యవాదం(కమ్యూనిజం) ప్రసిద్ధి చెంది రష్యా, యూరప్ లోని కొన్ని దేశాల్లో కమ్యూనిష్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ కమ్యూనిష్టు ప్రభుత్వాధినేతలు నియంతులుగా మారి ప్రజలకు స్వేచ్ఛ లేకుండా అణిచివేయడంతో 1991 లో సోవియట్ యూనియన్ కుప్పకూలి అనేక దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా అవతరించాయి.

మనదేశంలోనూ స్వాతంత్య్రానంతర కాలంలో నెహ్రూ పాశ్చాత్య సామ్యవాదానికి ప్రభావితుడై పంచవర్ష ప్రణాళికలు, సామ్యవాద తరహా ఆర్థిక నమూనాను స్వీకరించడంతో దేశం అనేక నష్టాలు చూసి 1991 నాటికి ఆర్థిక నమూనా కుప్పకూలిపోయింది. దీంతో వరల్డ్ బ్యాంకు, డబ్ల్యూటీవో వద్ద రుణాన్ని తీసుకోవలసి వచ్చింది. నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు నూతన ఆర్థిక విధానాలను ప్రారంభించడం అనివార్యమైంది. అయితే భారతీయ ఆలోచన అధారంగా స్వాతంత్ర్య అనంతర కాలంలో దేశ భద్రత, సంక్షేమం, మానవత విలువల అభివృద్ధి కోసం భారతీయ జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేసిన దీన్ దయాల్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవవాదం సిద్ధాంతాన్ని తన 60వ దశకంలో రూపొందించారు. ఇది వ్యక్తి నిర్మాణం, అభివృద్ధితో పాటు సమాజ నిర్మాణం, సమాజ అభివృద్ధిని ధర్మమార్గంలో నడిపిస్తుంది. ఈ సిద్ధాంతం ఆధారంగా వ్యక్తి శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మల కలయిక. సమాజం కూడా ప్రజలు అనే శరీరం, సంకల్పం అనే మనస్సు, ధర్మం అనే బుద్ధి, ఆదర్శాలు అనే ఆత్మను కలిగి ఉంటుంది. వ్యక్తితో పాటు సమాజం కూడా చతుర్విధ పురుషార్దాలను (ధర్మ, అర్ధ, కామ, మోక్షం) ఆచరించినప్పుడు వ్యక్తి, సమాజం పరస్పర సహకారపూరకాలుగా ఉండి, పరస్పరం అభివృద్ధి చెంది, మానవత్వం పునాదిగా దేశం సమగ్రాభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు.

ఆయన సిద్ధాంతం ఆధారంగా 740 పథకాలు

దీన్ దయాల్ సూచించిన ఏకాత్మ మానవవాదాన్ని నాటి జనసంఘ్ నుంచి నేటి బీజేపీ వరకు ఆచరిస్తూ వచ్చాయి. ఏకాత్మ మానవవాదం తాత్విక సిద్ధాంతం ఆధారంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్బర్, అంత్యోదయ భావనలతో అనేక పథకాలు రూపకల్పన చేసి పేదవారికి సంక్షేమ ఫలాలు అందాలని వారు ఆర్థిక స్వావలంబన సాధించాలని కృషి చేస్తుంది. అందులో భాగంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ విధానాన్ని అమలు చేయడంలో భాగంగా ఉజ్వల యోజన, జన్ ధన్ ఖాతా, ప్రధాని ఆవాస్ యోజన, సడక్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్, దీన్ దయాల్ గ్రామ జ్యోతి యోజన, దీన్ దయాల్ కౌశల్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావో బేటీ పడావో వంటి పథకాలతో సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో అందరికీ తను నిర్దేశించిన లక్ష్యాల ఫలాలు అందించాలని భారత ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుంది. అలాగే ఆత్మనిర్భర్ భారత్ పేరుతో 20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి స్వయం ఆధారిత భారత్ స్వశక్తిగా ఎదగడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ ఇంటిగ్రల్ హ్యూమనిజం ఆధారంగా దేశంలో సుమారు 740 సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.

అలాగే రాబోవు 25 ఏళ్ల అమృతకాలం లక్ష్యంగా రూపొందించిన మొదటి బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు, కలలను నెరవేర్చే విధంగా ఉంది. పీఎం వికాస్ యోజన ద్వారా కుల వృత్తుల జీవితాల్లో వెలుగులు నింపారు. అలాగే మహిళల రక్తహీనత సమస్యను నివారించేందుకు మిషన్ ప్రకటన, అలాగే పీవీటీజీ( ప్రధానమంత్రి నిర్దిష్ట దుర్భల గిరిజన తెగల) అభ్యున్నతి మిషన్ ప్రకటన, యువతకు అంతర్జాతీయ సూక్తులు అందిపుచ్చుకునేలా 30 స్కిల్ ఇండియా కేంద్రాలను అభివృద్ధి పరచడం, రైతుల టార్గెట్‌ను 20 కోట్లకు పెంచడం, టూరిజం అభివృద్ధి కోసం 'దేఖో అప్నా దేశ్'ను రూపొందించడంతో దేశం 2047 నాటికి ఆత్మనిర్భర్, స్వదేశీ, స్వశక్తి, స్వాభిమానం, స్వావలంబనతో సమృద్ధ భారత్, సమర్థ భారత్, సంపన్న భారత్‌గా మారడానికి కృషి చేయడమే దీనదయాల్ ఉపాధ్యాయకు ఘన నివాళి.

(నేడు దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్థంతి)

శ్రీశైలం వీరమల్ల

ఉస్మానియా యూనివర్సిటీ.

80748 26986

Advertisement

Next Story

Most Viewed