అర్ధ శతాబ్దపు అరుణోదయ పాట నాగన్న

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-10-19 11:16:33.0  )
అర్ధ శతాబ్దపు అరుణోదయ పాట నాగన్న
X

న పేరే అరుణోదయ నాగన్న. పేరుకు ముందు ఇంటి పేరు లేదు, వెనుక సొంత ఊరు లేదు. కులం, మతంల జాడ దొరకనే దొరకదు. కళా సంస్థ పేరే తనకు కేరాఫ్ అడ్రస్ అయింది. పాటే ప్రాణమైంది. సంచారమే సదా జీవన గమనమైంది. "శ్రీకాకుళం గిరి సింహాల జయహేలా/ వీర గోదావరి గిరిజన చెర బాల" అంటూ కానూరి రాస్తే తాను పాడినట్టు, సిక్కోలు నుండి ఇంద్రవెల్లి వరకు సారవంతమైన పాటల ప్రవాహమై పచ్చని అడవి సిగన ఎర్రని మోదుగుపువై విరభూసినవాడు నాగన్న. పాటతో ప్రశ్నల కొడవళ్లను నూరి దోపిడిదారుల పన్నాగం పట్టే ప్రజా ప్రభంజనమై పోటెత్తినవాడు నాగన్న. ఈ తెలంగాణ నేల మీద పాటను ప్రజా ఆయుధంగా మలిచిన వారిలో నాగన్న మొదలు కాదు చివర కాదు. అట్లాగని పాట ప్రస్థానంలో నాగన్న పాత్ర చిన్నదేమీ కాదు యాభై ఏళ్లుగా జీవితమంతా పాటే.

ఇక్కడ ఆది నుండి పాట కవిత్వమై, ప్రజా చైతన్య ఆయుధమై వర్ధిల్లుతుంది. పాట అన్నామంటే అది చాలా వరకు ప్రజా సాహిత్యంగానే ఉంటుంది. "ప్రజాకవిత్వమంటే అది అనివార్యంగా పాట రూపమే. ప్రజా సాహిత్యమంతా పాటగానే వ్యక్తమవుతుంది." అంటాడు కాశీం. (సి. కాశీం. తెలంగాణ సాహిత్యం, 2015: 11). అలాంటి ప్రజాసాహిత్య పరంపరలో అర్ధ శతాబ్దంగా కంఠాన్ని ఖడ్గంగా మలిచి దోపిడీ శిరస్సును తెగ నరుకుతున్నవాడు ఈ అరుణోదయ నాగన్న. తెలుగు నేల మీద జరిగిన పోడుభూముల ఉద్యమంలో, భూపోరాటాల్లో నాగన్న పాటై నడిచాడు. ప్రజాస్వామ్య రక్షణ కోసం, ప్రజా హక్కుల సాధన కోసం పాటై గొంతెత్తినవాడు నాగన్న. సారా వ్యతిరేక ఉద్యమం, కూలీ రేట్ల పెంపు కొరకు, కుల వివక్ష అంతం కోసం పాటల జెండానెత్తినవాడు నాగన్న. కరెంట్ చార్జీల వ్యతిరేకోద్యమంలో నాగన్న పాటల పదునయ్యినాడు. అడవులను కార్పొరేట్ కంపెనీలు మైనింగ్ చేయడానికి ప్రభుత్వమిచ్చిన అనుమతులకు వ్యతిరేకంగా పాటల కోటై నిలిచి ఆదివాసుల రక్షణకు గొంతెత్తిన పాటల సేనాని నాగన్న. తెలంగాణ సాధన కొరకు సుమారు నాలుగు వందల సభల్లో తనో పాటై, ఉద్యమ ఊటై, పోరాట బాటై నడిచాడు.

తెలుగునాట పాయలు పాయలుగా ప్రజాపాట

ప్రజానాట్యమండలి, జన నాట్యమండలి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ప్రజాకళా మండలి ఇలా తెలుగునాట ప్రజాపాట పాయలు పాయలుగా ప్రవహిస్తుంది. స్థల, కాల, పరిస్థితులను బట్టి ఈ సంస్థలు మారాకు తొడుగుతూ పాటల జీవ వాయువును ప్రజలకు చేరవేస్తున్నాయి. అలాంటి వాటిలో అరుణోదయకు చెందిన కళా సైనికుడే కాదు, అర్ధశాతబ్దపు అరుణోదయ పాట నాగన్న. ఈ అస్తిత్వ ఉద్యమ యుగం నడుమన ఉన్న మనం, మార్క్స్ 1859 లో ప్రచురించిన 'ఎ కంట్రిబ్యూషన్ టూ ది క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ' పుస్తకం ముందుమాటలో "ఎవరి సామాజిక అస్తిత్వం వారి సామాజిక చైతన్యాన్ని నిర్ణయిస్తుంది" అని చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకుందాం. ఎందుకంటే ఇది ప్రస్తావించుకోకుండా నాగన్న గురించి సంపూర్ణంగా ఉండదు. అందుకోసం నాగన్న గురించి తెలుసుకునే క్రమంలో చాలా కొత్త విషయాలు తెలిశాయి.

నిస్వార్థానికి నిలువెత్తు రూపం

అతి కొద్దిమందిని మినహాయిస్తే మన కళ్ళెదురుగా కనిపించే కమ్యూనిస్టు నాయకుల్లోని చాల మంది పేరు చివర తమ కుల అస్తిత్వాన్ని తెలియజెప్పేలా తోకలు ఉంచుకున్నారు. రావు, రెడ్డి, శర్మ అంటూ గొప్పగా, గౌరవంగా కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ కింది కులాల నుంచి కమ్యూనిస్టులైనవారు మాత్రం నాగన్న లాగే తమ అస్తిత్వాల్ని, ఆస్తుల్ని, బంధుత్వాల్ని ఆశయాల కోసం త్యాగం చేశారు. అలా చూస్తే నాగన్న సహచరి లక్ష్మక్క సొంత నియోజకవర్గం అయిన సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిజేసిన ఉప్పల మల్సూర్ చెప్పులు కుట్టుకుంటూ చనిపోయారు. మరో మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య లాంటి వారు అనాధాశ్రమాలలో బతుకుతున్నది నేడు పత్రికల్లో రావడం మనం చూశాం. ఆ విధంగానే నాగన్న కుటుంబం కూడా బడ్డీ కొట్టు నడుపుకుంటూ, చిన్న గుడిసెలో ఉండి జీవనం కొనసాగిస్తున్నారు. అదేమీ నాగన్నకు చిన్నతనం కాదు. ఎందుకంటే నీతి, నిజాయితీ, నిబద్దతతో తన జీవితమంతా ప్రజలకోసం నిస్వార్ధంగా పని చేశాడు. కానీ తనకు నాయకత్వం వహించిన అగ్రకులాలవారెవ్వరు నాగన్నలా బతకడం మనకు ఎక్కడా కనిపించదు. ఇది ఒక్క నాగన్న పార్టీకి సంబంధిన విషయం కాదు ఇంచు మించు అన్ని కమ్యూనిస్టు పార్టీల్లో ఇదే తీరు ఉన్నది.

అరుణోదయ తన అస్తిత్వం

అయితే నాగన్న సామాజిక నేపథ్యం నేడు తెలంగాణా నేల మీద తన సాటి పాటగాళ్ల, వాగ్గేయకారుల సామాజిక అస్తిత్వానికి భిన్నంగా ఉన్నది. నిజానికి గద్దర్, గూడ అంజన్న, గోరటి వెంకన్న, జయరాజు, మాష్టార్జీ లాంటి గొప్ప, బలమైన ఉద్యమ గొంతుకలుగా పుట్టుకొచ్చినవారందరూ దళిత సామాజిక వర్గంవారే. కానీ నాగన్న గౌడ కులం నుంచి వచ్చినవాడని ఇప్పుడే తెలుస్తుంది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజారం గ్రామానికి చెందిన పరకాల లక్ష్మమ్మ, పాపయ్య తన తల్లిదండ్రులు. తాళ్లెక్కి కల్లు గీసిన అనుభవం ఆయనకున్నది. ఆ క్రమంలోనే ఊళ్ళో ఒక కార్యానికి వెళ్ళి రెడ్లు, వెలమలతో సమానంగా బల్లమీద కూర్చొని తిన్నాడనే కారణంతో అవమానించబడ్డాడు నాగన్న. తన ఎదనిండా దాసుకున్న ఆ గాయాల మొరుసు నూరి పాటకు పదును పెట్టుకుంటూ ఎదిగాడు. అలాంటి నాగన్న తన సామాజిక అస్తిత్వాన్ని వదులుకున్నాడు. అరుణోదయనే తన అస్తిత్వంగా మలుచుకున్నాడు. విప్లవాన్ని శ్వాసగా నిలుపుకున్నాడు. విప్లవాన్ని ఆదర్శంగా కాకుండా అవసరంగా భావించాడు. ఇది నాగన్న మార్క్సిస్టు సిద్ధాంత నిమగ్నతకి, నిబద్ధతకి నిదర్శనం. నాగన్నలోని ఈ గొప్పతనాన్ని అన్ని కమ్యూనిస్టు పార్టీల అగ్రకుల నాయకత్వం ఆదర్శంగా తీసుకోని నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కుల ఆధిపత్య భావాల నుండి పూర్తిగా బయటపడలేని వారు నాగన్న స్పూర్తితో కులతత్త్వపు ధోరణులు విడనాడాలి.

పాట పైసల కోసం కాదు

నిజానికి నేడు తెలంగాణలో ప్రజా వాగ్గేయకారులు, పాటగాళ్లలో అత్యధికులు దళితులే. బీసీలు చాలా తక్కువనే చెప్పాలి. విమలక్క, నాగన్న, చింతల యాదగిరి, నేటి తరంలో పదునైన విప్లవ పాటై దూసుకొస్తున్న యోచన లాంటి అతి కొద్దిమందే ఉన్నారు. రెడ్లలో పెదిరెడ్డి వెంకట్ రెడ్డి మినహా ఎవ్వరూ లేరు. రెడ్డి, కమ్మ, వెలమ, బ్రాహ్మణుల్లో ఎంత వెతికినా ఏ ఒక్కరూ కనపడరు. ఎందుకంటే ఈ రంగంలో సేవ, త్యాగమే తప్ప, వాళ్ళు కోరుకునే అధికారం, ఆదాయం, గౌరవం అంతగా ఉండదు. అంతా సమానమంటారు. అందుకనే అగ్రకులాల వారు ఇటువైపు రారు. ఈ కాలంలో కూడా నాగన్న లాంటి వారు 'పాట పైసల కోసం కాదు - ప్రజల కోసం' అని నినాదాలిస్తుంటే దళిత, బహుజనులు తప్ప పాటను ఎవరెత్తుకోగలరు? అందుకే ఈ ప్రపంచీకరణ పాడు కాలంలో, రాజకీయం వ్యాపారంగా, పాటలను లాభాలుగా మార్చుకున్న పరిస్థితుల్లో, యూట్యూబ్ రాబడుల కోసం దళిత, బహుజనుల పాటను దొంగిలిస్తూ కొన్ని అగ్రకుల గొంతుకలు నడవంత్రంగా పుట్టుకొచ్చినయ్.

పాటలతో చైతన్యం రవాణా

ఎన్నడూ ప్రజా సమస్యల మీద కొట్లాడని, ప్రజాపాట పాడని, ప్రజా ఉద్యమాల్లో పాల్గొనని ఆ అద్దె గొంతులు ప్రజాగాయకుల, యుద్ధ గొంతుకల ట్యాగ్ లైన్లు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నాయి. అలా ప్రజా గొంతుల పేరు పెట్టుకోవడమే అభ్యంతరం. జనం పాటల పేరు పెట్టుకుని, జనం పాటకు బదులు భజన పాటలతో లాభాలు పోగేసుకుంటున్నాయి. ఇటుపక్క అటుపక్క శత్రు శిభిరాలనే తేడా లేకుండా ఇరువైపులా అవే కిరాయి గొంతులు వినిపిస్తున్నాయి. కానీ నాగన్న మాత్రం అలా కాదు. ఓ పాటల బైరాగిలా సిద్దాంతానికి కట్టుబడి, యాభై ఏళ్లుగా పల్లె పల్లెకు తిరుగుతూ తన పాటలతో చైతన్యం రవాణా చేస్తున్న కమిట్ మెంట్ ఉన్న ప్రజా గాయకుడు. ప్రజలకు కష్టాలను, కన్నీళ్ళను పల్లవి చరణాలుగా మలిచి, గొంతెత్తి ప్రపంచానికి వినిపిస్తున్నాడు. ప్రజల పాటై నాగన్న కొనసాగిస్తున్న తెలంగాణ ప్రజాసాహిత్య పరంపరకు ఆ అగ్రకుల నకిలీ గొంతులు వ్యతిరేకం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 'కళా కాసుల కోసం కాదు, కళా ప్రజలకోసం' అంటూ లాఠీలు, తూటాలు, జైళ్లు లెక్కజేయక సర్వం త్యాగం చేసినవాడు నాగన్న. తన బాల్యానికి, వృద్దాప్యానికి మధ్య జీవితాన్ని అడవికి, ఆదివాసులకి, ప్రకృతికి, ప్రజలకు రాసిచ్చినవాడు నాగన్న. ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలను వేల పాటలుగా కైగట్టి గానం చేస్తున్న అరుణదయ నాగన్నలాంటి ఎరుపు మెరుపుల ప్రజా గొంతులను కాపాడుకోవాల్సిన, మరిన్నిటిని తయారు చేసుకోవాల్సిన అవసరం యావత్ తెలంగాణ సమాజం ముందున్న తక్షణ కర్తవ్యం.

(సుద్దాల హనుమంతు, జానకమ్మ జాతీయ పురస్కారం అక్టోబర్ 19న, సుందరయ్య కళా నిలయం, హైదరాబాదులో అరుణోదయ నాగన్న అందుకుంటున్న సందర్బంగా..)

ఎం. విప్లవకుమార్

95152 25658

Advertisement

Next Story

Most Viewed