నాడు సినిమా చూపించే నగ్నసత్యాలు

by Ravi |   ( Updated:2024-06-14 00:46:20.0  )
నాడు సినిమా చూపించే నగ్నసత్యాలు
X

వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్ష నిర్వహణ మీద ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో 'నాడు' సినిమా చూశాను. 'ఆహా'లో, 'అమెజాన్'లో వీక్షకుల కోసం సిద్ధంగా ఉన్న ఈ సినిమాకి పెద్దగా రేటింగ్ లేకపోయినప్పటికీ, కొండ ప్రాంత గిరిజనులు ఆరోగ్య సేవల కోసం ఎదుర్కొనే అనేక అనేక ఇబ్బందులను స్క్రీన్ మీదికి తెచ్చింది.

గిరిజనుల కష్టాల వైపు మళ్లించే సీన్లు

ఈ సినిమాను కొంచెం ఓపికగా చూడాలి. ప్రాథమిక వైద్య సౌకర్యాలు కూడా అందుబాటులో లేక కొండ ప్రాంత గిరిజనులు పడే కష్టాలను ఓపికగా తెరకు ఎక్కించిన సినిమా ఇది. చిన్న చిన్న జ్వరాలకు కూడా చనిపోతున్న గిరిజనులు, ఆదివాసీలు ఉన్న 75 ఏళ్ల స్వతంత్ర స్వర్ణోత్సవ భారతదేశం మనది. చదువు అంటే కెరీర్ కోసమా, సేవ కోసమా అన్న చర్చని కూడా రేకెత్తించే సినిమా. 'కొల్లి' కొండల్లో జరిగిన నిజజీవిత కథనాన్ని సినిమాగా ఎంచుకొని తీసినట్టు దర్శకుడు శరవణన్ చెబుతున్నారు. రక్తపాతం, హింస, వెకిలి హాస్యం వంటి వాటికి బానిసలైన ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా నచ్చే అవకాశం ఉండదు.

ఆరోగ్య పరిశ్రమ మీద, వైద్య వృత్తి మీద, నీట్ పరీక్ష నిర్వహణ తీరు మీద అవసరమైన చర్చను ఈ సినిమా పెడుతుంది. అలాగని, ఎక్కడా మేధోపరమైన చర్చలు ఉండవు. డ్యూయెట్ల కోసం అర్ధనగ్న సన్నివేశాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఈ సినిమా వైపు పోకపోవడమే మంచిది.

అబద్దాల వైపు మన కళ్లను లాగేసి, బుర్రని మనకు కాకుండా చేసే పనికిమాలిన దర్శకులు పెట్రేగిపోతున్న కాలాన ఈ సినిమా కొండల్లోకి, కొండ ప్రాంత అడవుల్లోకి, అడవుల్లోని జనాల జీవితాల్లోకి, వాళ్ళ జీవితాల్లోని కష్టాలూ కన్నీళ్లలోకి, వాళ్ల చదువులలోని అనేకానేక అవాంతరాల లోకి, వాళ్ల ఆరోగ్యంలోని హీన, దీన స్థితిలోకి మనల్ని నడిపిస్తుంది.

మన గర్వం తలదించుకునేలా..

సినిమా ముగిసిపోయి టైటిల్స్ పడేటప్పుడు వచ్చే పేపర్ కటింగ్స్ మీద కూడా మనం దృష్టిపెట్టాలి. అనారోగ్యంతో చనిపోయిన భార్య శవాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌కి కూడా డబ్బులు లేక భుజం మీద శవాన్ని మోసుకెళ్తున్న భర్తకు సంబంధించిన వార్త. డబ్బులు లేక శవాన్ని సైకిల్‌కి కట్టుకొని ఇంటికి తీసుకెళుతున్న వలస కూలీ వార్త. డోలీల మీద, తిరగేసిన మంచాల మీద అనారోగ్య పీడితులను కట్టుకొని కొండలు గుట్టలు దిగుతూ లెక్కలేనన్ని కష్టాలు పడే ఆదివాసి ప్రజల గురించిన వార్తలకి సంబంధించిన క్లిప్పింగ్స్ పనికిమాలిన మన గర్వాన్ని తలవంచుకునేలా చేస్తాయి. ముగింపులో గట్టిదనం లేక తేలిపోయినప్పటికీ సినిమా ఆసాంతం మనల్ని ఒక కొండ ప్రాంత అడవిలోని జనాల మధ్య ఒక ప్రశ్నగా నిలబెడుతుంది.

సినిమా 'నాడు'

నటీనటులు : తర్శన్ త్యాగరాజ, మహిమా నంబియార్, సింగంపులి, ఆర్ఎస్ శివాజి

కథ, దర్శకత్వం : ఎం. శరవణన్

ఓటీటీ : ఆహా, అమెజాన్ ప్రైమ్


సమీక్షకులు

డా. నూకతోటి రవికుమార్

98481 87416

Advertisement

Next Story

Most Viewed