నాలు పెన్నుంగల్

by Ravi |   ( Updated:2024-10-18 00:30:35.0  )
నాలు పెన్నుంగల్
X

మలయాళ సాహిత్య నిధి తగళి శివశంకర్ పిళ్లై రచించిన నాలుగు కథల ఆధారంగా మలయాళ ప్రసిద్ధ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్ తీసిన సినిమా 'నాలు పెన్నుంగల్' Naalu Pennungal (నలుగురు స్త్రీలు). 1940 నుంచి 1960 మధ్య స్త్రీ జీవితాల చుట్టూ అల్లుకున్నవి. డైరెక్షన్, యాక్టింగ్‌కి సంబంధించి క్లాసిక్ ఈ సినిమా. నాలుగు భిన్న నేపథ్యాలు కలిగిన స్త్రీలు తమ జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు కథలుగా మలిచిన విధానం చెప్పడం కన్నాచూడటమే బాగుంటుంది. ముఖ్యంగా కావ్య మాధవన్, నందితా దాస్ నటించిన కథ గుర్తుండిపోతుంది.

తగళి శివశంకర పిళ్లై మలయాళ సాహిత్య నిధి. వందల కథలు రాశారు. అందులోనుంచి నాలుగు కథలు ఎంపిక చేశారు మలయాళ ప్రసిద్ధ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్. కథలు నాలుగున్నాయి, వాటిని నాలుగు సినిమాలుగా తీయలేం! ఒకే సినిమాలో నాలుగు కథలు చూపించాలి‌. అందుకు తగ్గట్టు స్క్రిప్ట్ రాసుకున్నారు. అది 2007 నాటి మాట. ఇందులో ఏ కథకు ఆ కథ వేరుగానే ఉంటుంది.

స్త్రీల జీవితాల చుట్టూ..

కథలన్నీ స్త్రీ జీవితాల చుట్టూ అల్లుకున్నవి. 1940 నుంచి 1960 మధ్య జరిగినవి. వాటిలో నటించేందుకు పద్మప్రియ, మంజు పిళ్లై, గీతూ మోహన్‌దాస్, కావ్య మాధవన్‌లను ఎంచుకున్నారు. మరొక ముఖ్యమైన పాత్ర ఉంది. అది నందితా దాస్ చేసింది. ఆదూర్ కేవలం 12 సినిమాలు తీసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన సినిమాల్లో దక్షిణాది హీరోయిన్లకే పెద్దపీట. రెండుసార్లు మాత్రం ఆ నియమం సడలింది. 'విధేయన్' సినిమా కోసం తన్వీ ఆజ్మీ, ఆ తర్వాత 'నాలు పెన్నుంగల్' కోసం నందితాదాస్. అంతే!

క్లాసికల్ భారతీయ సినిమా

'నాలు పెన్నుంగల్'(Naalu Pennungal) అంటే నలుగురు స్త్రీలు. ఈ కథలూ అలాగే ఉంటాయి. ఒకరు వేశ్య, ఒకరు గృహిణి, పెళ్లయినా సంసార జీవితం ఎరుగని మహిళ ఒకరు, వయసొచ్చినా పెళ్లి కాని స్త్రీ ఇంకొకరు. దక్షిణాది భాషల్లో వచ్చిన తొలి ఆంథాలజీ సినిమాల్లో ఇదీ ఒకటి. 15 ఏళ్ల క్రితం విడుదలవ్వడం వల్ల ఇది ఎక్కువ మందికి చేరలేదు. కానీ ఇవాళ ఓటీటీలో వచ్చి ఉంటే మరింత మందికి తెలిసి ఉండేది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు స్త్రీలు. వారికి సహాయంగా ఉండే పాత్రల్ని మనోజ్.కె.జయన్, ముఖేష్, శ్రీజిత్ రవి లాంటి వారు పోషించారు. అందరిది మంచి టీమ్ వర్క్. ఈ సినిమా చాన్నాళ్లు యూట్యూబ్‌లో ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉండేది. ఇప్పుడు అవి లేవు. ఈ సినిమా ఓటీటీలో ఉందో లేదో తెలియదు. దొరికితే మాత్రం తప్పకుండా చూడండి. డైరెక్షన్, యాక్టింగ్‌కి సంబంధించి ఒక గొప్ప ఇండియన్ క్లాసిక్ ఈ సినిమా.

సినిమా : నాలు పెన్నుంగల్

దర్శకుడు : ఆదూర్ గోపాలకృష్ణన్

లభ్యం: యూట్యూబ్

సాయి వంశీ

చిత్ర సమీక్షకులు

90108 66078

Advertisement

Next Story

Most Viewed